భారత్ vs ఇంగ్లాండ్ జట్లు వన్డే సిరీస్ కు సిద్ధమయ్యాయి. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా గురువారం (ఫిబ్రవరి 6) తొలి వన్డే జరగనుంది. నాగ్ పూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కు ఇంగ్లాండ్ తమ ప్లేయింగ్ 11 ను ప్రకటించింది. టీ20 సిరీస్ లో విఫలమైనా.. డకెట్, సాల్ట్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. మూడో స్థానంలో స్టార్ ప్లేయర్ రూట్ ఆడనున్నాడు. యువ సంచలనం బ్రూక్ నాలుగో ప్లేస్ లో బ్యాటింగ్ చేస్తాడు. కెప్టెన్ బట్లర్ ఐదో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. స్పిన్ ఆల్ రౌండర్లు లివింగ్ స్టోన్, జాకబ్ బెతేల్ వరుసగా 6,7 స్థానాల్లో బ్యాటింగ్ కు దిగనున్నారు. బ్రైడాన్ కార్స్, ఆర్చర్, సాకిబ్ మహమ్మద్ ఫాస్ట్ బౌలర్లుగా పేస్ బాధ్యతలను పంచుకుంటారు. ఏకైక స్పిన్నర్ గా ఆదిల్ రషీద్ తుది జట్టులో స్థానం సంపాదించాడు. ఓవర్ టన్, జామీ స్మిత్, అట్కిన్సన్, మార్క్ వుడ్ బెంచ్ కు పరిమితం కానున్నారు. మరోవైపు భారత్ తుది జట్టును రేపు టాస్ తర్వాత ప్రకటించనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఇంగ్లాండ్ ఇదే తుది జట్టుతో వెళ్లే అవకాశం కనిపిస్తుంది.