బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్లుగా ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు నోటీసులు పంపించగా ఇప్పుడు అవే బ్యాంకులకు నోటీసులు అందడం గమనార్హం. తాజాగా విజయ్ మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను తీసుకున్న రుణాలకు చాలా రెట్లు బ్యాంకులు వసూలు చేశాయని పిటిషన్‌లో పేర్కొన్నారు మాల్యా. అందుకు సంబంధించిన అకౌంట్ స్టేట్‌మెంట్లను అందించాలని కోరుతూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు.
తనతో పాటుగా ప్రస్తుతం లిక్విడేషన్‌లోని యూబీహెచ్ఎల్ సహా ఇతర సంస్థల నుంచి వసూలు చేసిన రుణాల రికవరీలకు సంబంధించిన మొత్తం వివరాలను అందించాలని పిటిషన్‌లో మాల్యా కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది హైకోర్టు. ఈ సదర్భంగా మాల్యా తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సుమారు రూ.6,200 కోట్లు లోన్ తీసుకోగా బ్యాంకులు రూ.14 వేల కోట్లు రికవరీ చేశాయని తెలిపారు. ఈ విషయాన్ని లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. మాల్యాకు చెందిన రూ.14,131 కోట్లు బ్యాంకులు రికవరీ చేసినట్లు ఆమె చెప్పారని తెలిపారు. అలాగే ఆయన తీసుకున్న లోన్‌లో రూ.10,200 కోట్లు తిరిగి చెల్లించినట్లు రికవరీ అధికారి సైతం వెల్లడించారని కోర్టుకు తెలిపారు న్యాయవాది.
తీసుకున్న రుణాలు పూర్తిగా చెల్లించినా ఇంకా రివకరీ ప్రక్రియ కొనసాగుతోందని, మాల్యాకు సంబంధించిన రికవరీ చర్యలపై స్టే విధించాలని కోర్టును కోరారు. రికవరీ చేసిన డబ్బులకు సంబంధించి అన్ని బ్యాంకల నుంచి అకౌంట్ స్టేట్మెంట్లు ఇప్పించాలని అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ విషయంపై స్పందించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సహా 10 బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 13 వరకు గడువు విధించింది.
కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ లోన్లు తీసుకుని మాల్యా మోసం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దేశం విడిచి వెళ్లిపోయారు. 2016, మార్చి నుంచి బ్రిటన్‌లో నివరిస్తున్నారు. మాల్యాను భారత్‌కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు బ్యాంకులకు నోటీసులు ఇవ్వడం గమనార్హం.
![]() |
![]() |