కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2025-26లో మధ్య తరగతి ప్రజలపై పన్ను భారాన్ని భారీగా తగ్గించింది. పన్ను నిబంధనల్లో మార్పులు చేస్తూ ఏకంగా రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఎవరూ ఊహించని విధంగా పన్ను మినహాయింపు పరిమితి ఒక్కసారిగా రూ.12 లక్షలకు పెంచడంతో చాలా మంది సంబరాలు చేసుకున్నారు. ఇక తాము ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని సంతోషపడ్డారు. అయితే, ఈ నిర్ణయం దేశంలోని మధ్య తరగతి ప్రజలకు ఎంత మేర ప్రయోజనం చేకూరుస్తుంది? కేంద్ర ప్రభుత్వ అంతిమ లక్ష్యాన్ని చేరుకునేందుకు దోహదపడుతుందా? నిపుణులు ఏమంటున్నారు? తెలుసుకుందాం.
రూ.12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. జీతభత్యాలకు అయితే రూ.12.75 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. ఈ నిర్ణయం మధ్య తరగతి ప్రజలకు కొంత ఊరట కల్పిస్తుంది. అయితే, పీపుల్స్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్స్ ఎకానమీ నివేదిక ప్రకారం దేశంలో 40 శాతం మధ్య తరగతి ప్రజలు ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ డిమాండ్ కొరతను ఎదుర్కొంటోంది. సాధారణంగా మధ్య తరగతి ప్రజలే వస్తు, సేవలను ఎక్కువగా వినియోగిస్తారు. వారి చేతిలో డబ్బులు లేకపోడవంతో కొనుగోలు శక్తి దెబ్బతింటోంది. దీంతో ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ తగ్గిపోతోంది.
మధ్య తరగతి ప్రజలకు వ్యక్తిగత ఆదాయపు పన్నులో మరింత మినహాయింపు కల్పిస్తే డిమాండ్ పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. ఇది ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ధరల పెరుగుదలతో సతమతమవుతున్న దిగువ మధ్య తరగతి ప్రజలకు పన్ను మినహాయింపులు కల్పించడంతో ఇకపై ప్రతి సంవత్సరం రూ.70-రూ.80 వేల వరకు చేతికి అందుతాయి. వారికి ఇది పెద్ద మొత్తమని నిపుణులు చెబుతున్నారు. ఈ డబ్బు వస్తు, సేవల కొనుగోలుకు వినియోగిస్తారు. అలాగే పొదుపు చేసినా ప్రయోజనమేనంటున్నారు నిపుణులు. మధ్య తరగతి ప్రజల వద్ద ఎక్కువ డబ్బు ఉండడం వల్ల వినియోగం పెరిగి తర్వాత ఆ డబ్బు మార్కెట్‌లోకి చేరుతుంది. దీంతో ఆదాయపు పన్ను మినహాయింపు కల్పించడం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపశమనం కల్పిస్తుందంటున్నారు. ఇది ఒకవైపు మాత్రమే. మధ్య తరగతి ప్రజల జీవనంలో పన్నులకు సంబంధంచి మరో కోణం ఉంటుంది. అది గమనించినప్పుడే బాదుడు భారం గురించి తెలుస్తుంది.
ఆ బాదుడు భారమేగా?
మధ్య తరగతి ప్రజలకు ఎక్కువ వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు కల్పించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పెంచే వ్యూహం సరైనది కాదని కొందురు నిపుణులు విమర్శిస్తున్నారు. మధ్య తరగతికి ప్రత్యక్ష పన్ను మినహాయింపులకు బదులుగా పరోక్ష పన్ను రేట్లను తగ్గిస్తే డిమాండ్ పెంచడంలో ప్రభావవంతంగా ఉంటుందని ఆర్థిక వేత్తలు అంటున్నారు. ఆదాయపు పన్నులో మిగులు ఉన్నప్పటికీ పేద వినియోగదారుడు సైతం పరోక్షంగా ఎక్కువ మొత్తంలో పన్నులు చెల్లించాల్సి వస్తుందంటున్నారు. ప్రస్తుతం దేశంలో చాలా వస్తువులు, సేవలపై పరోక్ష పన్ను రేట్లు గరిష్ఠంగా 28 శాతం వరకు ఉన్నాయి.
దేశ జనాభాలో కేవలం 9.5 కోట్ల మంది ఐటీ రిటర్నులు ఫైల్ చేస్తున్నారు. అందులో 6 కోట్లు జీరో రిటర్నులుగానే తేలింది. అంటే మిగిలిన 3.5 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ట్యాక్స్ మినహాయింపులు కల్పించడంతో పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదంటున్నారు ఆర్థిక నిపుణులు. అందుకు బదులుగా పరోక్ష పన్నుల రూపంలో మధ్య తరగతికి ఉపశమనం కల్పించాలంటున్నారు. అది వినియోగాన్ని పెంచేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు. జీఎస్టీ రూపంలో అధిక పరోక్ష పన్ను వినియోగ సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది. పెరుగుతున్న ధరల కారణంగా వినియోగదారులు తక్కువ వస్తువులు కొంటున్నారు. చాలా వినియోగ వస్తువులపై ప్రస్తుతం జీఎస్టీ రేటు 18 శాతం ఆపైన ఉంది. దీంతో వస్తువులు ఖరీదైనవిగా మారుతున్నాయి. అది నిత్యావసర వస్తువుల అమ్మకాలపై ప్రభావం చూపుతోంది.