జగన్ కు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఎద్దేవా జగన్ 2.0లో 11 సీట్లు కూడా ఉండవని వ్యాఖ్య 30 ఏళ్లు తానే సీఎం అంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. జగన్ ను మానసిక వైద్యుడికి చూపించాల్సిందిగా ఆయన భార్య భారతిని కోరుతున్నానని చెప్పారు. ఐదేళ్లు నేరస్తులతో కలిసి పాలన చేసిన జగన్ కు ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఓడిపోయి ఏడు నెలలు కూడా కాకముందే జగన్ అప్పుడే భ్రమల్లో జీవిస్తున్నారని అన్నారు.అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు కనీస గుర్తింపు కూడా జగన్ ఇవ్వలేదని వెంకన్న విమర్శించారు. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి కార్యకర్తల గురించి గంటల సేపు మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ పాలనలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తప్ప మరెవరూ సంతోషంగా లేరని చెప్పారు.దమ్ముంటే జగన్ అసెంబ్లీకి వెళ్లి మాట్లాడాలని సవాల్ విసిరారు. జగన్ పాలనలో మహిళలను అసెంబ్లీలో కించపరిచేలా మాట్లాడారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వంలో మహిళలను గౌరవిస్తున్నామని చెప్పారు. మీడియా ముందుకు వచ్చి జగన్ అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. జగన్ 2.0లో ఇప్పుడున్న 11 సీట్లు కూడా ఉండవని ఎద్దేవా చేశారు.
![]() |
![]() |