అన్నం పెట్టిన సంస్థకే కన్నం పెట్టాడో ప్రబుద్ధుడు. కంపెనీ సొమ్మును బంధువుల ఖాతాలకు మళ్లించి సొంతానికి వాడుకున్నాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.1.15 కోట్లు కొట్టేశాడు. ఈ ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్ సంస్థ అయిన ఎన్‌బీఎఫ్‌సీ జూబ్లీహిల్స్ శాఖలో 11 ఏళ్ల క్రితం లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కలెక్షన్ ఏజెంట్‌గా ఉద్యోగంలో చేరాడు. అనంతరం కలెక్షన్ హెడ్‌గా ప్రమోషన్ పొందాడు. ఆ సంస్థ నుంచి లోన్లు పొందిన వారి నుంచి అసలు, వడ్డీ వసూలు చేసే బాధ్యతలు లక్ష్మీనారయణే చూసేవాడు.
అయితే కంపెనీ డబ్బుపై అతడికి ఆశ పుట్టింది. పెద్దఎత్తున వస్తున్న నగదు కాజేసేందుకు ఫ్లాన్ వేశాడు. అందుకు అనుగుణంగా లోన్లు తీసుకున్న కస్టమర్లకు తమ కుటుంబసభ్యుల బ్యాంకు అకౌంట్ల నెంబర్లు ఇచ్చాడు. సంస్థ బ్యాంకు అకౌంట్ల మారాయని.. ఇందులో జమ చేయాలని సూచించేవాడు. దీంతో కస్టమర్లు లక్ష్మీనారాయణ చెప్పిన అకౌంట్లలో డబ్బులు జమ చేసేవారు. అయితే గత కొంత కాలంగా సంస్థలో ఢీపాల్టర్లు పెరుగుతున్నారు. ఈ విషయంపై సంస్థ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. గతేడాది డిసెంబరులో కంపెనీ ప్రతినిధులు మోసం జరుగుతున్న విషయాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న లక్ష్మీనారాయణ కుటుంబంతో సహా పారిపోయాడు.
కంపెనీ అంతర్గత ఆడిటింగ్‌లో దాదాపు రూ.30 లక్షలు దారి మళ్లినట్లు తేలింది. ఫేక్ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో లోనులు పొందిన వారికి ఎన్‌వోసీ జారీ చేసినట్లు తేల్చారు. లక్ష్మీ నారాయణ సంస్థకు సంబంధించిన ల్యాప్‌ట్యాప్, కంప్యూటర్, మూడు మొబైల్ ఫోన్లు సైతం తీసుకెళ్లినట్లు గుర్తించారు. సంస్థ ఫిర్యాదుతో గతేడాది డిసెంబరులోనే బంజారాహిల్స్ పోలీసులు కేసు బుక్ చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు మెుత్తంగా రూ.1.15 కోట్లు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. కేసు తీవ్రత దృష్ట్యా వెంటనే నగర సీసీఎస్‌కు బదిలీ చేశారు. పరారీలో ఉన్న లక్ష్మీనారాయణ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే అతడిని పట్టుకొని డబ్బులు రికవరీ చేస్తామని చెబుతున్నారు.
![]() |
![]() |