ఆమ్ ఆద్మీ పార్టీని నిండా ముంచిన ఎన్నికల అంశాల్లో 'శీష్ మహల్' వివాదం ఒకటి. ఇంతటి వివాదానికి కారణమైన ''శీష్ మహల్''లో ఢిల్లీ కొత్త సీఎం ఉండకపోచ్చంటూ జాతీయ మీడియలో కథనాలు వెలువడుతున్నాయి. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ప్రస్తుతం కొత్త సీఎంను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తోంది.'ఆప్' జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు సివిల్ లైన్స్‌లోని 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ బంగ్లాను అధికారిక నివాసంగా చేసుకుని ఉండేవారు. దీనిని ''శీష్ మహల్" (అద్దాలమేడ)గా అభివర్ణిస్తూ బీజేపీ ఎన్నికల అస్త్రంగా చేసుకుంది. కరోనా సమయంలో ప్రజలు బాధలు పడుతుంటే కోట్లాది రూపాయలు వెచ్చించి సొంత బంగ్లా కట్టుకున్నారంటూ విమర్శలు గుప్పించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఎన్నికల ప్రచారంలో ''శీష్ మహల్'' అంశాన్ని పదేపదే ప్రస్తావించారు. నాలుగు లక్షల మందికి తాము ఇళ్లు కట్టించామే కానీ అద్దాలమేడలు కట్టుకోలేదంటూ విమర్శలు గుప్పించారు. హోం మంత్రి అమిత్‌షా మరో అడుగు ముందుకు వేసి తాము అధికారంలోకి వస్తే ''శీష్ మహల్'' ప్రజాసందర్శనార్ధం ఉంచుతామని ప్రకటించారు.ఆప్ అవినీతిని, అధికార దుర్వినియోగాన్ని సమర్ధవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో బీజేపీ అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్ని విడిచిపెట్టలేదు. ఆప్ సర్కార్‌పై ఉన్న ప్రజావ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంతో ఆప్ విజయవకాశాలకు గండిపడింది. బీజేపీకి తిరుగులేని ఆధిపత్యాన్ని ఓటర్లు కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో ఆప్ పతానానికి చిహ్నంగా నిలిచిన ''శీష్ మహల్'' బంగ్లాకు దూరంగా ఉండాలని బీజేపీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
![]() |
![]() |