కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వారికి మరింత చేరువ చేయడానికి ఆధార్ తరహా ప్రత్యేక కార్డులు జారీ చేస్తున్నది. ఇది వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ(భారత ప్రభుత్వం) సమన్వయంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ చేపడుతున్న బృహత్తర కార్యక్రమం. ఆధార్ కార్డు తరహాలో ప్రతి రైతుకు ఒక యూనిక్ కోడ్(యూసీ) కేటాయించేందుకు చర్యలు ప్రారంభించారు. మన రాష్ట్రంలో ఈ పోర్టల్ జనవరి 26వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. ఫార్మర్ రిజిస్ర్టీలో పేర్లు నమోదు చేసుకున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ తరహాలో 14 అంకెలతో కూడిన ప్రత్యేక కార్డును జారీ చేస్తుంది. ఇది రైతుకు గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే పేర్లు నమోదు ప్రారంభించారు. ఈ ఏడాది మార్చి నాటికి దేశ వ్యాప్తంగా సుమారు ఐదు కోట్ల మంది రైతులకు ‘భూ ఆధార్’ కార్డులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు తెలిపారు.రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అన్ని పఽథకాలను ఈ యూనిక్ కోడ్‌తో అనుసంధానం చేస్తారు. ఈ కోడ్ నంబర్‌ను యూనిఫైడ్ ల్యాండ్ ఏపీఐ, ఆధార్ బేస్డ్ ఆథంటికేషన్, పీఏం కిసాన్, తదితర వాటికి అనుసంధానిస్తారు. ఈ ఐడీ నంబరును ఉపయోగించి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంకు లింకుతో కూడిన సేవలను పొందవచ్చును. దీని సాయంతో దేశంలో ఎక్కడైనా రుణ అర్హత, రుణ బకాయిలు ఇతర సంక్షేమ పఽథకాల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. వ్యసాయ రంగంలో అన్ని సంక్షేమ పథకాలకు దీనిని తప్పనిసరి చేయనున్నారు. పండించిన పంటలకు మద్దతు ధర పొందేందుకు, మార్కెట్‌లో సులువుగా విక్రయించుకునేందుకు ఉపయోగపడుతుంది. ఎరువుల సరఫరా, లభ్యత, పంట రుణాల వివరాలు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే సత్వర పరిహారం అందుతుంది.రైతులు తమ ఆధార్ నంబరు, ఆధార్ అనుసంధానిత ఫోన్ నంబర్, భూమి రికార్డుల వివరాలతో సమీపంలోని రైతు సేవా కేంద్రంలో సిబ్బందిని సంప్రదించాలి. రైతుల ఎదుటే ఆయా వివరాలను సిబ్బంది అప్‌లోడ్ చేస్తారు. రైతుల ఆధార్ నంబర్‌కు అనుసంధానమైన ఫోన్‌కు వచ్చే ఓటీపీ నంబరు చెబితే నమోదు చేస్తారు. లేదా బయోమెట్రిక్ విధానం ద్వారా కూడా నమోదు చేస్తారు. స్థానికంగా లేని రైతులు తమ గ్రామంలోని ఆర్‌ఎస్‌కే సిబ్బందిని ఫోన్‌లో సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవచ్చు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ సంబంధ పథకాలను అర్హులైన రైతులకు మాత్రమే చేరేలా కొత్తగా భూ ఆధార్ లేదా ఫార్మర్ రిజిస్ర్టీని అందుబాటులోకి తీసుకువచ్చాయి. భూ ఆధార్ ఉన్న వాళ్లకే పీఏం కిసాన్, తదితర పథకాలు వర్తిస్తాయి. అన్ని పత్రాలతో సమీప రైతు సేవా కేంద్రాల్లో ఈ నెల 25వ తేదీలోగా నమోదు చేసుకోవాలి.
![]() |
![]() |