కర్నూలు జిల్లా, ఆత్మకూరు పట్టణంలోని ఓ బంగారు దుకాణదారుడిని దోర్నాల పోలీసులు సోమవారం విచారించారు. వివరాల్లోకి వెళ్ళితే.... ప్రకాశం జిల్లాలోని దోర్నాల ప్రాంతంలో చోరీలకు పాల్పడిన ఓ దొంగ అక్కడి పోలీసులకు చిక్కాడు. విచారణ చేపట్టగా సుమారు 25 గ్రాముల బంగారాన్ని ఆత్మకూరు పట్టణంలోని కప్పలకుంటలో గల ఎం.వాహీద్ జ్యువెలర్స్ షాపులో విక్రయించినట్లు తేలింది. సోమవారం దోర్నాల ఎస్సై మహేష్ పోలీసు సిబ్బందితో కలిసి బంగారు దుకాణం వద్దకు వచ్చారు. దొంగ వద్ద బంగారు కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరమని అరెస్టు చేయడానికి సిద్ధమయ్యారు.
దీంతో గోల్డ్ మర్చంట్ అసోషియేషన్ అధ్యక్షులు ఎంఏ రషీద్‌తో పాటు మిగిలిన బంగారు దుకాణాల యజమానులు షాపులను మూసివేసి అతడిని అరెస్టు చేయకుండా అడ్డుకున్నారు. సరైన ఆధారాలు లేకుండా ఎవరో దొంగ వచ్చి ఫలానా షాపు అని చూపినంత మాత్రాన వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని నిలదీశారు. ఇలా అయితే బంగారు దుకాణాలను కూడా నడపలేని పరిస్థితులు ఉంటాయని అన్నారు. దీంతో పంచాయతీ కాస్త ఆత్మకూరు పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది. కాగా ఎంతో కొంత అమౌంట్ చెల్లించి సమస్యను క్లియర్ చేసుకోవాలని సదరు బంగారు దుకాణ యజమాని మంతనాలు జరిపినట్లు తెలిసింది. మొత్తానికి ఈ వ్యవహారంలో దోర్నాల పోలీసుల తదుపరి చర్య ఎలా ఉంటుందన్నది తెలియాల్సి ఉంది.
![]() |
![]() |