ఏఆర్టీ సవరణ చేసి మార్జిన్ 14 శాతానికి పెంచడం ద్వారా ఏకంగా రూ.1000 కోట్లు తన నివాసానికి వెళ్లేలా సీఎం చంద్రబాబు రూట్ మ్యాప్ వేసుకున్నారని నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. మార్జిన్ పెంపు ద్వారా ప్రభుత్వ ఆదాయానికి రూ.3 వేల కోట్లు గండి కొట్టిన చంద్రబాబు, ఆ డబ్బంతా ఎల్లో సిండికేట్ జేబుల్లోకే వెళ్లేలా ప్లాన్ చేశారని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి ఇదేనన్న కాకాణి, మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకుంటూ పొలిటికల్ గవర్నెన్స్‌కి తెర తీశాడని ఆక్షేపించారు. ప్రజలు ఏమైపోయినా పర్లేదు, తన జేబులు నిండితే చాలన్నట్టు చంద్రబాబు పాలన సాగుతోందని మండిపడ్డారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న మద్యం దుకాణాలను అధికారంలోకి వస్తూనే చంద్రబాబు ప్రైవేటుపరం చేసి తన వారికి కట్టబెట్టడం ద్వారా దోపిడీకి డోర్లు తెరిచాడు. ప్రభుత్వం నష్టపోయినా పర్లేదు కానీ, టీడీపీ వారి జేబులు నింపడంలో భాగంగానే చంద్రబాబు ప్రైవేటు విధానాన్ని తెరపైకి తెచ్చాడు. టెండర్లలో ఒక మార్జిన్ పెట్టి, టెండర్లు ఖరారు చేసి.. దక్కించుకున్న వారు కొనసాగుతుండగానే మార్జిన్ పెంచడం వెనుక భారీ అవినీతి దాగి ఉంది. ఎమ్మార్పీ ధరలు పెంచి అమ్ముకునే విధంగా తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలబడిపోయే అవినీతి. మద్యం షాపుల టెండర్ల దగ్గర మొదలైన అవినీతి అంచలంచలుగా పెరిగి ఇప్పుడు మందు బాబులను కూడా ఆగం చేసే పరిస్థితికి తెచ్చారు. మద్యం వినియోగదారుల మీద భారం మోపి వచ్చిన డబ్బును సిండికేట్‌తో నీకింత నాకింత అనే విధంగా బేరం మాట్లాడుకున్నట్టు స్పష్టంగా అర్థం అవుతోంది. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు చెప్పిన సంపద సష్టి ఇదే. తనకు, తన కుటుంబానికి తన పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే సంపద సృష్టి జరుగుతోంది అని మండిపడ్డారు.
![]() |
![]() |