ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల అమలుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా కందుకూరులో శనివారం పర్యటించిన ఆయన మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, సంక్షేమ పథకాల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు.తాము అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలను అమలు చేశామని చంద్రబాబు చెప్పారు. అయితే, రాష్ట్రానికి వచ్చే ఆదాయం తక్కువగా ఉండటంతో, సంక్షేమ పథకాలను కొనసాగించాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు పేర్కొన్నారు.ఏపీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ప్రభుత్వం ఇప్పటికే 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తోందని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రతి నెలా 1వ తేదీనే ఇంటికే వెళ్లి పింఛన్లు పంపిణీ చేసే విధానం అమలు చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ భరోసా పేరుతో శ్రీకారం చుట్టినట్లు వివరించారు."ఏడాదికి రూ.33,000 కోట్లు పింఛన్ల కోసం ఖర్చు చేస్తున్నాం. ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్లు వంటి హామీలను కూడా ఎనిమిది నెలల్లోనే అమలు చేశాం" అని చంద్రబాబు చెప్పారు. ఈ ఏడాది నుంచే తల్లికి వందనం పథకం కూడా రాష్ట్రంలో అర్హులైన అందరికీ అందజేస్తామని అన్నారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని, రూ.10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినా రాష్ట్ర సంపద పెరగలేదని చంద్రబాబు విమర్శించారు. ఇప్పుడు ఆ అప్పులను తీర్చాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని చెప్పారు.చెత్త నుంచి సంపదను సృష్టించే కార్యక్రమాలను చేపట్టినట్లు చంద్రబాబు తెలిపారు. పేపర్లు, బాటిళ్లు రీసైక్లింగ్ చేయడం, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రభుత్వ ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఈ క్రమంలో సర్పంచుల పనితీరును ఆధారంగా చేసుకుని ప్రోత్సహిస్తామని, రాష్ట్రంలో అక్టోబర్ 2 నాటికి చెత్త లేకుండా చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు బాధ్యత అప్పగించామని చెప్పారు.పీఎం సూర్యఘర్ పథకం కింద ఇళ్లపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేసుకుని సొంతంగా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని చంద్రబాబు సూచించారు. అలాగే, రాష్ట్రంలో పేదరికం నిర్మూలన లక్ష్యంగా ‘పీ4 విధానం’ త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు.ఏపీ ఆర్థిక పరిస్థితి సవాళ్లతో కూడుకున్నప్పటికీ, సంక్షేమ పథకాలు ఆగకుండా ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
![]() |
![]() |