మనం ఇప్పటి వరకు ఎన్నెన్నో ప్రేమ కథలు చూశాం. ప్రపంచం మొత్తాన్ని కదిలించే దేవదాస్ పార్వతీ, లైలా మజ్నూ, ముంతాజ్ షాజహాన్, రోమియో జూలియెట్.. ఇలా అనేక మంది కథలు విన్నాం. కానీ మనం ఇప్పుడు చూడబోయే లవ్ స్టోరీ మాత్రం వీరిందరినీ ప్రేమ కథలకు మించింది. వీరిలా ప్రేయసి కోసం ప్రాణాలు తీసుకోవడమో, ఏవేవో భవంతులు కట్టించడమో, ప్రేమకు దూరమై తాగుడు బానిసవ్వడమో చేయలేదు.
కానీ ఆమెను అనుక్షణం సంతోష పెట్టడానికి ఏటీఎంలలో దొంగతనాలను పాల్పడ్డాడు. ఆ డబ్బుతో ప్రియురాలికి కారు, స్కూటీ, డబ్బులు వంటివి గిఫ్టులుగా ఇచ్చాడు. ఇది మాత్రమే కాకుండా తన ప్రియురాలి భర్తకు ఏకంగా గుండె ఆపరేషన్ కూడా చేయించి అతడిని కాపాడాడు. మరి ప్రతీ ఒక్కటి కిడ్నీని టచ్ చేసేలే ఉన్న ఈ ప్రేమ కథ ఎక్కడ మొదలైంది.. ఎలా సాగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మైసూరుకు చెందిన రాజీవ్ ప్రహ్లాద్ కులకర్ణికి 52 ఏళ్ల వయసు. ఇతడికింకా పెళ్లి కాలేదు. ప్రస్తుతం అతడు తాను ప్రేమించిన ఓ అమ్మాయి ఇంట్లోనే నివాసం ఉంటున్నాడు. అయితే గతంలోనే ఆమెకు పెళ్లి కాగా.. ఆమె భర్త కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు. ఇలా ముగ్గురూ కలిసే ఉంటుండగా.. రాజీవ్ ప్రహ్లాద్ కులకర్ణి తరచుగా దొంగతనాలు చేస్తుంటాడు. ఆ విషయం ప్రియురాలితో పాటు ఆమె భర్తకు కూడా తెలుసు. కానీ ఏమీ అనేవారు కాదు. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి.
ముఖ్యంగా కులకర్ణి నరగంలోని.. విశ్రాంబాగ్, సహకార్ నగర్, బిబ్వేవాడి, సింహగడ్ రోడ్డు, కోత్రుడ్, విశ్రాంత్ వాడి, అలండి, భోసారి, కంటోన్మెంట్, భారతి విద్యాపీఠ్, శివాజీ నగర్.. ఇలా అనేక ప్రాంతాల్లోని ఏటీఎంలలో దొంగతనాలకు పాల్పడ్డాడు. ముఖ్యంగా చదువురాని, వృద్ధులే లక్ష్యంగా చేసుకున్న కులకర్ణి.. ఏటీఎంల వద్దే వేచి చూసేవాడు. వృద్ధులు వస్తున్నట్లు కనిపించిన వెంటనే వారి వెనకాలే వెళ్లి డబ్బులు తీసుకునే నెపంతో క్యూలో నిలబడేవాడు. ఈక్రమంలోనే ఆ వృద్ధులు కులకర్ణిని సాయం చేయమని అడిగేవారు.
అది ఆసరాగా చేసుకున్న అతడు వారి వద్ద నుంచి పిన్ నెంబర్ తెలుసుకునేవాడు. దాన్ని సైలెంటుగా తన ఫోన్‌లో రాసుకుని.. వారి దృష్టి మరల్చేవాడు. ఆపై తన వద్ద ఉన్న బ్లాక్ అయిన కార్డును వారికి ఇచ్చి డబ్బులు రావడం లేదని చెప్పి పంపించేవాడు. ఒకే రంగులో ఉన్న కార్డు ఇవ్వడంతో అది తమదే అని భావించిన వృద్ధులు అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. ఆ తర్వాత వారి కార్డును ఉపయోగించి.. ఖాతాలో ఎన్ని డబ్బులు ఉన్నాయో చూసి మరీ వాటిని తీసుకునేవాడు.
ఇలా వచ్చిన డబ్బుతో తాను విలాసవంతమైన జీవితాన్ని గడపడమే కాకుండా.. తన ప్రియురాలికి కాస్ట్లీ బహుమతులు ఇచ్చేవాడు. ఇప్పటికే ఓ కారు, స్కూటీ ఇచ్చిన అతడు.. అనేక సార్లు డబ్బు సాయం కూడా చేశాడు. ఆమెకు నడుము నొప్పి ఉందని తెలుసుకుని ఓ పెద్ద ఆసుపత్రిలో కూడా చూపించాడు. అలాగే ఆమె భర్తకు గుండె సమస్య ఉన్నట్లు తెలుసుకుని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు శస్త్ర చికిత్స చేయాలన్నారు. ఇందుకు కూడా అతడే డబ్బులు చెల్లించి మరీ ఆమె భర్తకు వైద్యం చేయించాడు.
ఇదంతా బాగానే ఉన్నా ఫిబ్రవరి 2వ తేదీ రోజు సాయంత్రం కులకర్ణి..లాల్ బహదూర్ శాస్త్రి రోడ్డులోని ఓ ఏటీఎంలో వృద్ధుడిని మోసం చేశాడు. అది గుర్తించిన అతడు పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలోనే పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కులకర్ణిని గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. అలా ఫిబ్రవరి 5వ తేదీన అతడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఆపై విచారణ చేయగా.. కులకర్ణి జరిగిందంతా చెప్పాడు.
2022 సంవత్సరం నుంచి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు నిందుతుడి ఒప్పుకోగా పోలీసులు షాక్ అయ్యారు. ముఖ్యంగా ప్రియురాలికి అతడిచ్చిన బహుమతులు(కారు, ద్విచక్రవాహనం )తో పాటు 166 ఏటీఎం కార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారు. కార్డులు ఎక్కువగా ఉండడం చూస్తుంటే వందకు పైగానే మోసాలు చేసినట్లు అర్థం అవుతుందని.. కానీ బాధితులు ఇంకా ఎవరూ బయటకు రాలేదని వివరించారు. ఇప్పటి వరకు కేవలం 16 కేసులను మాత్రమే గుర్తించగా.. వాటి వల్ల రూ.17.9 లక్షలు మోసపోయినట్లు తెలుసుకున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa