ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిబ్బంది భుజంపై చేయివేస్తే.. మంత్రి పదవి ఊడింది!

international |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2025, 08:06 PM

ఓ చర్చలో భాగంగా సిబ్బంది భుజంపై చేయి వేస్తే. మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. న్యూజిలాండ్‌ వాణిజ్య మంత్రి ఆండ్రూ బేలీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. చర్చ సమయంలో సిబ్బంది భుజంపై చేయి వేయడం అహంకారపూరితమైన ప్రవర్తనగా ఆయన అంగీకరించారు. ‘‘అలా ప్రవర్తించినందుకు క్షమించండి. చర్చలో లీనమైపోయి.. సిబ్బంది భుజంపై చేయి వేశాను... అది సరైంది కాదు... దీనిపై కేసు కూడా నమోదైంది’’ అని బేలీ మీడియాకు వెల్లడించారు.


ఈ సంఘటన గతవారం చోటుచేసుకున్నట్టు ఫిర్యాదు అందింది. దీంతో ఫిబ్రవరి 18న ఆయన తన పదవికి రాజీనామా చేయగా.. ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ దానిని ఆమోదించారు. తన కుటుంబసభ్యులు, సిబ్బందితో మాట్లాడటానికి మంత్రి సమయం ఇవ్వడంతోనే రాజీనామా ప్రకటన ఆలస్యమైందని ప్రధాని లక్సన్ అన్నారు.


అయితే, ఇక తాను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ.. ఎంపీగా కొనసాగుతానని బేలీ స్పష్టం చేశారు. కాగా, అమర్యాదపూర్వక ప్రవర్తనకు సంబంధించి బేలీ కొన్ని నెలల కిందట విమర్శలను ఎదుర్కొన్నారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి మంత్రి మద్యం సేవించి వచ్చి.. అసభ్యపదజాలంతో మాట్లాడారని ఒక ఉద్యోగి ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఆరోపణలపై బేలీ స్పందిస్తూ.. ‘‘నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ సమయంలో నేను మద్యం సేవించలేదు’’ అని క్షమాపణలు చెప్పారు.


‘ ఈ విషయంలో మనం ఇంత చాలా త్వరగా నిర్ణయం తీసుకున్నట్టు నేను భావిస్తున్నాను... బేలీ తన చర్యలు నిర్దేశించుకున్న అంచనాలకు అనుగుణంగా లేవని భావించారు... అయితే, బేలీ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగాలని నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు.. మంత్రిగా అసాధారణమైన నిర్ణయం తీసుకున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ అన్నారు. మళ్లీ బేలీని ఎప్పుడైనా మంత్రివర్గంలోని తీసుకుంటారా? అని మీడియా ప్రశ్నించగా అలా ఎప్పుడూ జరగబోదని న్యూజిలాండ్ ప్రధాని తేల్చిచెప్పారు. నవంబరు 2023లో జరిగిన న్యూజిలాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో క్రిస్టోఫర్ లక్సన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa