పాన్ మసాలా ప్రచారకర్తలుగా ఉన్న షారుక్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్ సహా పలువురి బాలీవుడ్ నటులకు రాజస్థాన్‌లోని జైపూర్ వినియోదారుల వివాదాల పరిష్కార కోర్టు నోటీసులు జారీచేసింది. ‘విమల్’ పాన్ మాసాలా ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందంటూ దాఖలైన పిటిషన్‌ను కన్జ్యూమర్ కోర్టు విచారణకు స్వీకరించింది. దీంతో ఈ యాడ్‌లో నటించిన బాలీవుడ్ నటులు, తయారీ సంస్థకు నోటీసులు జారీచేస్తూ.. మార్చి 19న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ‘నోటీసులు అందుకున్న అన్ని పార్టీలు వ్యక్తిగతంగా లేదా వారి ప్రతినిధులు మార్చి 19 ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలి.. అలా కానిపక్షంలో . పైన పేర్కొన్న విచారణ తేదీన ఫిర్యాదును విడిగా నిర్ణయిస్తాం’ అని జైపూర్ కన్జ్యూమర్ కమిషన్ ఛైర్మన్ గైర్సి లాల్ మీనా మార్చి 5న ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.
అంతేకాదు, ప్రకటనలో పాల్గొన్న నటుడు, పాన్ మాసాల తయారీ సంస్థ.. నోటీసులు అందుకున్న 30 రోజుల్లోగా సమాధానం లిఖితపూర్వకంగా సమర్పించాలని స్పష్టం చేశారు. కాగా, ఈ నోటీసులపై సంబంధిత నటులు, సదరు సంస్థ ఇప్పటివరకూ స్పందించలేదు. జైపూర్‌కు చెందిన న్యాయవాది యోగేశ్ సింగ్ బడియాల్.. ప్రజల ఆరోగ్యానికి హానికలిగించే పాన్ మసాలాపై తప్పుదారి పట్టించేలా ప్రకటన రూపొందించారని ఆరోపిస్తూ పిటిషన్ వేశారు.
‘‘ఈ పాన్ మసాలాలోని ప్రతి పలుకులోనూ కుంకుమపువ్వు శక్తి ఉందని ప్రకటన చెబుతుంది.. ఇలాంటి తప్పుడు ప్రకటనతో తయారీ సంస్థ జేబీ ఇండస్ట్రీస్ కోట్లాది రూపాయలు సంపాదిస్తోంది.. సామాన్య ప్రజలు పాన్ మసాలాను నిత్యం వినియోగిస్తున్నారు.. ఇది ఆరోగ్యానికి హానికరం.. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను దారితీస్తుంది’’ అని లాయర్ యోగేశ్ సింగ్ పేర్కొన్నారు. తమ గుట్కాలో ‘కుంకుమ పువ్వు’ ఉందంటూ విమల్ పాన్ మాసాలా కొనేలా ప్రజలను ఆకర్షిస్తున్నారు..
మార్కెట్‌లో కుంకుమపువ్వు కిలో రూ.4 లక్షలు పలుకుతుంటే.. పాన్ మసాలా ప్యాకెట్ ధర రూ.5.. కానీ, అందులో ఎలాంటి కుంకుమ పువ్వు లేదు’ అని ఆయన ఆరోపించారు.
తప్పుడు సమాచారంతో ప్రజలను మోసం చేస్తోన్న సంస్థ, ప్రకటనలో నటించినవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వారి చర్యల కారణంగా సామాన్యులు జీవితాన్ని, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిందితులకు జరిమానా విధించి, ప్రకటనతో పాటు పాన్ మాసాలా అమ్మకాలను నిషేధించేలా ఉత్తర్వులు వెలువరించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa