ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టైట్ ఫైట్.. పోరాడిన న్యూజిలాండ్ బ్యాటర్లు

sports |  Suryaa Desk  | Published : Sun, Mar 09, 2025, 07:56 PM

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టు భారత్‌ ముందు 252 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 రన్స్ చేసింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని భారత్.. 252 రన్స్ చేస్తే.. ఓటమి అనేది లేకుండానే టైటిల్‌ను సాధించినట్లవుతుంది.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడితూ ఓపెనర్లు నిలకడగా రాణించారు. దీంతో ఆ జట్టుకు మెరుపు శుభారంభం దక్కింది. విల్ యంగ్ (15)కు తోడు రచిన్ రవీంద్ర (37) రాణించడంతో న్యూజిలాండ్‌ 7.4 ఓవర్లలో 57/0తో నిలిచింది. దీంతో ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేసేలా కనిపించింది.


ఈ దశలో భారత స్పిన్నర్లు సత్తాచాటారు. వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్‌ యాదవ్‌ వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. ఓపెనర్లతో పాటు కేన్ విలిమయ్సన్ (11), టామ్ లేథమ్ (14) వికెట్లను త్వరగానే కోల్పోయిన న్యూజిలాండ్ 108 రన్స్‌కి 4 వికెట్లు కోల్పోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా డేరిల్ మిచెల్ (101 బంతుల్లో 63 రన్స్‌) క్రీజులో పాతుకుపోయాడు. చివర్లో మైకెల్ బ్రేస్‌వెల్ 40 బంతుల్లో 53 రన్స్ చేయడంతో న్యూజిలాండ్ జట్టు 250 పరుగుల మార్కును దాటింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 రన్స్ చేసి ఇన్నింగ్స్‌ను ముగించింది.


ఇక భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, కుల్‌దీప్ యాదవ్ 2, మహమ్మద్ షమీ 1, రవీంద్ర జడేజా 1 వికెట్ పడగొట్టారు. రవీంద్ర జడేజా ఒక్క వికెట్ మాత్రమే తీసినప్పటికీ పొదుపుగా బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లు వేసి కేవలం 30 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అక్షర్ పటేల్ కూడా 8 ఓవర్లు వేసి.. 29 రన్స్ ఇచ్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa