ఆ అమ్మాయికి 19 ఏళ్లు. చూసేందుకు చాలా బక్కగా ఉంటుంది. కానీ భవిష్యత్తులో బరువు పెరుగుతానేమోనన్న భయంతో ఏడాదిగా ఆహారం తినడం మానేసింది. పూర్తిగా కాకపోయినా.. చాలా తక్కువ మొత్తంలో మాత్రమే ఆహారం తీసుకునేది. ఫలితంగా పూర్తిగా బక్కచిక్కిపోయి కనీసం నడించేందుకు కూడా ఓపిక లేకుండా తయారైంది. దీంతో 10 రోజుల క్రితమే తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకురాగా.. వైద్యులు చికిత్స అందించారు. కానీ అప్పటికే ఆహారం లేక శరీరంలోని అనేక అవయవాలు పాడయ్యాయి. ఫలితంగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే బాలిక అలా భయపడడమే ఓ వ్యాధి అని.. దాని వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు చెబుతున్నారు. మరి ఆ కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కేరళ కన్నూర్ లోని మేరువాంబాయికి చెందిన 19 ఏళ్ల శ్రీనంద.. మట్టన్నూర్‌లోని పళస్సిరాజా ఎస్ఎస్ఎస్ కళాశాలతో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే చిన్నప్పటి నుంచి బక్కగానే ఉన్న శ్రీనంద పూర్తి ఆరోగ్యంగా ఉండేది. కానీ గత ఏడాది కాలంగా ఆమె బరువు పెరుగుతానేమోనని భయపడుతోంది. ఆ భయమే ఎక్కువ కాగా.. ఆహారం తీసుకోవడం మానేసింది. పూర్తిగా కాకపోయినా వీలైనంత తక్కువే తినడం ప్రారంభించింది. తల్లిదండ్రులు ఈ విషయం గుర్తించి పలుమార్లు హెచ్చరించినా వారికి తెలియకుండా పెట్టుకున్న ఆహారం పడేసేది.
సంవత్సర కాలంగా ఇలాగే చేస్తుండగా.. ఈ మధ్య శ్రీనంద ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ముఖ్యంగా బక్కచిక్కి.. బొక్కలు మాత్రమే కనిపించేలా తయారు అయింది. కనీసం నడిచేందుకు ఓపిక కూడా లేక పడిపోవడంతో 10 రోజుల క్రితమే తల్లిదండ్రులు ఆమెను సలరేసి సహకార ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే పరీక్షించిన వైద్యులు ఆమెకు అనోరెక్సియా నెర్వోసా అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాధి సోకడం వల్ల.. మనుషులు చాలా బక్కగా ఉన్నా సరే బరువు పెరుగుతామని భయపడిపోతారని.. అది తీవ్రమైతే పూర్తిగా ఆహారం తీసుకోవడం మానేస్తారని చెప్పారు.
సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకు వస్తే ఆ వ్యాధిని నయం చేసే వాళ్లమని.. కానీ సమయం చాలా మించిపోయిందని తల్లిదండ్రులకు చెప్పారు. కానీ వాళ్లు మాత్రం తమ కూతరును కాపాడాలంటూ వైద్యుల కాళ్లావేళ్లా పడ్డారు. డాక్టర్లు సైతం మెరుగైన చికిత్స అందించారు. అయినప్పటికీ ఏడాది కాలంగా ఆహారం సరిపడా తీసుకోకపోవడంతో శ్రీనంద శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయాయి. అలాగే అంతర్గత అవయవాలు అన్నీ పాడయ్యాయి. ఫలితంగా ఈరోజు శ్రీనంద ప్రాణాలు కోల్పోయింది.
కుమార్తె మృతదేహాన్ని చూస్తూ ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అసలు ఇలాంటి వ్యాధి ఉంటుందనే తమకు తెలియదని.. తినాలనిపించక, బక్కగా ఉండాలనే ఆమె అలా చేస్తుందనుకున్నామని.. కానీ అదే తన ప్రాణాలు తీస్తుందని ఏమాత్రం ఊహించలేకపోయామంటూ గుండెలు బాదుకుంటున్నారు.
![]() |
![]() |