ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారానికి 90 గంటల పని.. తీవ్రంగా నిరసిస్తూ రోడ్డెక్కిన ఉద్యోగులు

national |  Suryaa Desk  | Published : Tue, Mar 11, 2025, 10:57 PM

దేశంలో గత కొన్నిరోజులుగా ఉద్యోగుల పని గంటలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఉద్యోగులు వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా.. ఆ తర్వాత ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ ఏకంగా వారానికి 90 గంటలు పనిచేయాలని పేర్కొనడం మరిన్ని తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే వివిధ వర్గాల నుంచి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నారాయణమూర్తి, ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ లాంటి ప్రముఖులు.. పని గంటలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు.. దేశంలోనే సిలికాన్ సిటీగా పేరు గాంచిన కర్ణాటక రాజధాని బెంగళూరులో రోడ్డెక్కారు.


ఇటు ఉద్యోగం.. అటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక తీవ్ర సతమతం అవుతుంటే.. అదనపు గంటలు పని చేయాలని పరిశ్రమ పెద్దలు పిలుపునివ్వడంపై టెక్ ఉద్యోగులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటివరకు తమ అభిప్రాయాలను కేవలం సోషల్ మీడియాలో వెల్లడించి.. తమ నిరసన వ్యక్తం చేయగా.. ఇప్పుడు ఏకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. తాజాగా బెంగళూరు నగరంలోని ఫ్రీడమ్ పార్క్ వద్ద ఇటీవల ఐటీ ఉద్యోగులు ధర్నా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ టెకీల ఆందోళనకు కార్మిక సంఘాల యూనియన్ అయిన సీఐటీయూ మద్దతు తెలపడంతో ఐటీ ఉద్యోగుల ఆందోళనలు మరింత తీవ్ర రూపం దాల్చినట్లు అయింది.


టెక్ ఉద్యోగులు వారానికి 70 నుంచి 90 గంటలు పని చేయాలని పలు కంపెనీల సీఈఓలు, ఛైర్మన్‌లు పేర్కొంటున్నారు. అదే సమయంలో ఉద్యోగుల పని గంటలను ఇప్పుడు ఉన్న 8 గంటల నుంచి 14 గంటలకు పెంచాలని.. బెంగళూరులోని కంపెనీలు కర్ణాటకలో అధికారంలో ఉన్న సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులు కన్నెర్ర చేసి.. పని గంటలకు వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని విప్పాయి. ఆరోగ్యకరమైన పని గంటలు-జీవన సమతుల్యత ప్రతి ఉద్యోగి హక్కు అనే నినాదంతో టెకీలు ఇప్పుడు బెంగళూరు నగరంలో ఆందోళన బాట పట్టారు.


అయితే టెక్ ఉద్యోగులకు మద్దతుగా సీఐటీయూ మద్దతుగా నిలిచింది. దీంతో ఈ పని గంటల ఉద్యమం క్రమంగా మరింత తీవ్రతరం కాబోతున్నదా అనే చర్చ ఇప్పుడు కర్ణాటకలోని రాజకీయ, కంపెనీల్లో నెలకొంది. ఐటీ ఉద్యోగ సంఘం గతేడాదే కర్ణాటక కార్మిక శాఖ మంత్రికి పని గంటల విషయంలో కంపెనీల ప్రవర్తన, తమ సమస్యలపై మెమోరాండం సమర్పించింది. అయినా సమస్యలు పరిష్కారం కాకపోగా.. అదనపు పని గంటలు అందుబాటులో ఉండాలని ఆయా సంస్థలు సంస్థలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నాయంటూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com