ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బుల్లి ద్వీప దేశంతో చైనాకు చెక్ పెడుతున్న భారత్

international |  Suryaa Desk  | Published : Tue, Mar 11, 2025, 11:17 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం మారిషస్ వెళ్లారు. రాజధాని నగరమైన పోర్ట్ లూయిస్‌లోని విమానాశ్రయంలో అడుగుపెట్టిన మోదీకి మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గులామ్ ఘనస్వాగతం పలికారు. మార్చి 12న మారిషస్ 57వ నేషనల్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ పాల్గొంటారు. ఆఫ్రికా తూర్పు తీరంలో.. హిందూ మహాసముద్రంలో ఉన్న ద్వీప దేశమైన మారిషస్‌కు భారత్‌తో బలమైన సంబంధాలు ఉన్నాయి. భారత సంతతి ప్రజలు ఎక్కువగా ఉన్న ఈ ద్వీప దేశం.. హిందూ మహా సముద్రంలో చైనా ప్రాబల్యానికి చెక్ పెట్టేందుకు, తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి భారత్‌కు ఎంతగానో ఉపయోగపడుతోంది.


2 వేల చదరపు కిలోమీటర్లకుపైగా విస్తీర్ణం ఉన్న మారిషస్‌లో భారత సంతతి ప్రజలే ఎక్కువ. మారిషస్ జనాభాలో 68 శాతం భారత సంతతికి చెందిన వారే. బ్రిటిషర్ల కాలంలో మారిషస్‌లో పని చేసేందుకు భారత్ నుంచి ఎక్కువగా వలసలు చోటు చేసుకున్నాయి. మారిషస్‌లో భోజ్‌పురీ, హిందీ, తమిళంతోపాటు తెలుగు మాట్లాడే వారు సైతం పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. మారిషస్ ప్రధానులుగా వ్యవరించిన వారిలో ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వారే. దీంతో 1968లో బ్రిటిషర్ల నుంచి స్వాతంత్య్రం పొందిన నాటి నుంచి మారిషస్, భారత్ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి.


చైనా కుటిల యత్నాలు..


పాకిస్థాన్‌లోని గ్వాదార్ పోర్ట్‌ను అభివృద్ధి చేసిన చైనా.. శ్రీలంకలోని హంబన్‌టోట ఓడరేవును 99 ఏళ్లపాటు లీజ్‌కు తీసుకుంది. మయన్మార్‌లోని క్యాకుప్యూ రేవులోనూ చైనాకు యాక్సెస్ ఉంది. ఇక ఆఫ్రికాలోని జిబౌటీలో ఏకంగా మిలిటరీ బేస్‌నే ఏర్పాటు చేసింది. మాల్దీవులు, సీషెల్స్, బంగ్లాదేశ్‌లలోనూ పోర్టుల అభివృద్ధి పేరిట చైనా కాలుపెడుతోంది. ఇవన్నీ హిందూ మహా సముద్రంలో పరోక్షంగా, ప్రత్యక్షంగా భారత్ భద్రతకు భంగం కలిగించేవే.


మారిషస్ మనకు కీలకం..


హిందూ మహా సముద్రంలో ప్రాబల్యం పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న చైనాకు చెక్ పెట్టడానికి మారిషస్ ఎంతగానో ఉపయోగపడుతోంది. కీలక నౌకా రవాణా మార్గాలకు మారిషస్ చేరువగా ఉంటుంది. దీంతో చైనా యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్ల రాకపోకలపై ఓ కన్నేసి ఉంచడమే కాకుండా.. హిందూ మహా సముద్రంలో ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి భారత్‌కు మారిషస్ ఉపయోగపడుతోంది.


అగలెగా దీవి.. మన ‘బేస్’..


ఆఫ్రికా ఖండానికి గేట్‌వే లాంటి మారిషస్‌లోని అగలెగా ద్వీపంలో భారత్ మిలటరీ బేస్‌ను నిర్మిస్తోంది. అయితే అగలెగాను మిలటరీ బేస్‌గా మార్చడం లేదని ఇరు దేశాలు స్పష్టం చేశాయి. అగలెగాలోని 3 వేల మీటర్ల పొడవైన ఎయిర్‌స్ట్రిప్, జెట్టీ సాయంతో చైనా నౌకల కదలికలను భారత్ నిశితంగా గమనించగలదు. మారిషస్ ప్రధాన భూభూగానికి అగలెగా దీవి 1000 కి.మీ. దూరంలో ఉంటుంది. సముద్రపు దొంగల బారి నుంచి సరకు రవాణా నౌకలను కాపాడుకోవడానికి కూడా భారత్‌కు మారిషస్ ఉపయోగపడుతోంది. అందుకే భారత్ ఆ దేశానికి గస్తీ నౌకలు, ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్లను అందించింది.


మారిషస్‌కు బాసటగా భారత్..


వ్యూహాత్మకంగా కీలక స్థానంలో ఉండటం.. ఎక్కువ మంది భారత సంతతి ప్రజలే ఉండటంతో.. మారిషస్‌ను భారత్ ఓ తమ్ముడిలా ట్రీట్ చేస్తోందని చెప్పొచ్చు. మారిషస్‌లో మెట్రో ఎక్స్‌ప్రెస్, సుప్రీం కోర్టు బిల్డింగ్, ఈఎన్‌టీ హాస్పిటల్ లాంటి కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు భారత్ నిధులు సమకూరుస్తోంది. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. ఆఫ్రికాలో భారత్ పెట్టుబడులకు మారిషస్ గేట్ వే‌లా మారింది. అయితే భారత్‌లో మనీలాండరింగ్‌, ఆర్థిక నేరాలకు కేటుగాళ్లు మారిషస్‌ను ఉపయోగించుకుంటున్నారు.


చైనా-మారిషస్ సంబంధాలు ఇలా..


మారిషస్‌ను తనవైపు తిప్పుకోవడానికి చైనా ప్రయత్నాలు చేస్తోంది. 2019 అక్టోబర్‌లో రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. చైనాతో ఈ ఒప్పందం చేసుకున్న తొలి ఆఫ్రికా దేశం మారిషస్. అయితే చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ)లో మాత్రం మారిషస్ అధికారికంగా చేరలేదు. చైనా కంపెనీలు ఇక్కడ రోడ్లు, హాస్పిటళ్లు, వాణిజ్య భవనాలను నిర్మించాయి. చైనా ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. మారిషస్‌‌పై దాని ప్రభావం తక్కువే. మారిషస్‌కు ఇండియానే కీలక వ్యూహాత్మక భాగస్వామి. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఇరు దేశాల సంబంధాలు మరింతగా బలోపేతం కానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa