ఆరుగాలం కష్టపడి రైతులు పంటలు పండిస్తుంటారు. అయితే అనుకోకుండా సంభవించే ప్రకృతి విపత్తులు, భారీ వర్షాలతో పంట నష్టం సంభవిస్తూ ఉంటుంది. అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల కారణంగా పంటను కోల్పోయే రైతుల బాధ వర్ణనాతీతం. ఈ నేపథ్యంలో అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీమా పథకాలను తీసుకువచ్చాయి. అయితే వ్యవసాయ పంటల తరహాలోనే ఆక్వా రైతులకు కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఆక్వా రైతులు చేపల చెరువుల ద్వారా రొయ్యలు, చేపల పెంపకం చేపడుతూ ఉంటారు.
అయితే తెగుళ్లు సోకి చేపలు, రొయ్యలు మృత్యువాత పడి నష్టాలు సంభవించే పరిస్థితి. ఇక వరదలు, తుపానుల సమయంలో చేపల చెరువులు నీటమునిగి ఆక్వారైతులు నష్టపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అందులో భాగంగానే ఆక్వా రైతులను ఆదుకునేందుకు కేంద్రంతో కలిసి ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా బీమా సదుపాయం కల్పిస్తోంది. ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన పథకం అమలు చేస్తోంది.
ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన పథకం లబ్ధి పొందేందుకు ఆక్వా రైతులు తమ చేపల చెరువుల్లో పిల్లలను వదిలిన తర్వాత బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే తొలిసారి చెల్లించిన ప్రీమియంకు రెండు నెలల పాటు మాత్రమే కవరేజీ ఉంటుంది. రెండు నెలల తర్వాత ప్రతీ 20 రోజులకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇక ఈ ఇన్సూరెన్స్ ఒక పంట కాలానికి మాత్రమే వర్తిస్తుందని అధికారులు చెప్తున్నారు. పంట వేసిన తర్వాత ఏదైనా కారణంతో పట్టుబడి పూర్తి చేస్తే.. బీమా ముగిసినట్లేనని వివరిస్తున్నారు. అలాగే పంట వందశాతం పాడైతేనే బీమా వర్తిస్తుందని చెప్తున్నారు.
మరోవైపు ఆక్వా రైతులు తమ చేపల చెరువుల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. తెగుళ్లు, వైపరీత్యాలతో పంట దెబ్బతింటే ఆ సమాచారాన్ని వెంటనే బీమా సంస్థకు తెలియజేయాలి. బీమా సంస్థ ప్రతినిధుల పరిశీలన తర్వాతే పట్టుబడి చేయాలి. లేదా సీసీ కెమెరాలో లేదా జియో ట్యాగింగ్, లేదా మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసి పట్టుబడి పూర్తి చేయాలని అధికారులు చెప్తున్నారు.
![]() |
![]() |