జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసే టీడీపీ అభ్యర్థులపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా కృష్ణాజిల్లా నుంచే అభ్యర్థుల ఖరారుకు పార్టీ అధినేత చంద్రబాబు శ్రీకారం చుట్టారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కుమార్తె షబానాఖాతూన్‌కు పశ్చిమ సీటు ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో మొట్టమొదట ప్రకటించిన స్థానం ఇదే. అనంతరం 16 అసెంబ్లీ స్థానాల్లో 10 స్థానాలకు అధినేత అభ్యర్థులను ఖరారు చేశారు. తాజాగా గుడివాడ స్థానాన్ని దేవినేని అవినాష్‌కు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ ఐదు స్థానాలపై రెండుమూడు రోజుల్లో స్పష్టత వస్తుందని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
తెరపైకి బాడిగ రామకృష్ణ కుమార్తె పేరు-
పెడన అసెంబ్లీ స్థానం లేదా మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ కుమార్తె బాడిగ శ్రీదేవి పేరును టీడీపీ అధిష్ఠానం పరిశీలిస్తుందన్న ప్రచారం తాజాగా తెరపైకి వచ్చింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కాగిత వెంకట్రావు అనారోగ్య కారణంతో పోటీకి దూరంగా ఉండనున్నారని సమాచారం. మచిలీపట్నం ప్రస్తుత ఎంపీ కొనకళ్ల నారాయణ పెడన అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆయనకు పెడన సీటు కేటాయించే పక్షంలో మచిలీపట్నం ఎంపీగా బాడిగ శ్రీదేవి రంగంలోకి దిగే అవకాశం ఉంది. 2004లో మచిలీపట్నం ఎంపీగా బాడిగ రామకృష్ణ పనిచేశారు. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆయన నాటి టీడీపీ అభ్యర్థి అంబటి బ్రాహ్మణయ్యపై విజయం సాధించారు. ఎంపీగా ఉన్న ఐదేళ్ల కాలంలో మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. సౌమ్యుడిగా పేరున్న బాడిగ రామకృష్ణకు రాజకీయాల్లో అజాతశత్రువు అన్న పేరుంది. అయితే 2009లో మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన నాటి టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావు చేతిలో ఓటమి పాలయ్యారు. నాటి నుంచి ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం కాకినాడ వైసీపీ నేత చలమలశెట్టి సునీల్‌తోపాటు బాడిగ రామకృష్ణ కుమార్తె శ్రీదేవి టీడీపీలో చేరడంతో మళ్లీ బాడిగ రామకృష్ణ కుటుంబం క్రియాశీలక రాజకీయాల్లోకి అరంగేట్రం చేసినట్లయింది.
తిరువూరు, పామర్రుపై వీడని ఉత్కంఠ-
గత ఎన్నికల్లో తిరువూరు, పామర్రు స్థానాలు వైసీపీ గెలుచుకుంది. పామర్రు వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆ తర్వాత టీడీపీలో చేరారు. అయితే టీడీపీ శ్రేణులను కలుపుకొని పోవడం లేదన్న ఆరోపణలు కల్పనపై ఉన్నాయి. దీంతో ఈ స్థానాన్ని అధినేత పెండింగ్‌లో పెట్టారు. తిరువూరు నుంచి డి.వై.దాసు పేరు కూడా వినిపిస్తోంది. తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న నల్లగట్ల స్వామిదాసు పనితీరుపై అధిష్ఠానం సంతృప్తికరంగా లేదని సమాచారం. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు అధినేత చంద్ర బాబును కలిసి తమ అభ్యర్థిత్వాలను పరిశీ లించాలని విన్నవించుకుంటున్నారు. మొత్తం మీద రెండు మూడు రోజుల్లో ఈ ఐదు స్థానాలపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కైకలూరు, నూజివీడు రేసులో కొత్త ముఖాలు-
ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉండే నూజివీడు, కైకలూరు అసెంబ్లీ స్థానాలకూ టీడీపీ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. కైకలూరు స్థానం నుంచి జయమంగళ వెంకటరమణ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. అయితే ఏలూరు ఎంపీ మాగంటి బాబు కైకలూరు నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తి కనబరుస్తుండటంతో ఈ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం.
కైకలూరు నుంచి పోటీ చేసేందుకు టీడీపీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దోనేపూడి పవన్ కుమార్ కూడా ఆసక్తితో ఉన్నారు. ఆయన ఇప్పటికే సీఎంని కలిసి తనకు టికెట్ ఇవ్వాలని అభ్యర్థించినట్లు సమాచారం. ఇక నూజివీడు నుంచి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అభ్యర్థిత్వంపై స్థానిక నాయకుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో ఈ స్థానాన్ని అధినేత పెండింగ్‌లో పెట్టారు. ఈ స్థానం నుంచి అట్లూరి రమేష్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa