ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీతో పాదాభివందనం చేయించుకున్న ఆ పెద్దావిడ ఇకలేరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 23, 2025, 05:58 PM

ప్రముఖ గాంధేయ వాది పసల కృష్ణభారతి దివారం తెల్లవారుజామున కన్నుమూశారు. హైదరాబాద్ స్నేహపురి కాలనీలోని తన నివాసంలో ఆమె కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కృష్ణభారతి 1932లో జన్మించారు. ఆమె తండ్రి కృష్ణమూర్తి, తల్లి అంజలిలక్ష్మిలు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు. ఈ దంపతుల ఏడుగురి సంతానంలో (నలుగురు సోదరులు, ముగ్గురు సోదరిలు) రెండో కుమార్తె కృష్ణభారతి. తుదిశ్వాస వరకూ గాంధేయవాదిగానే కొనసాగి... మహాత్ముడి ప్రవచించిన విలువలతోనే జీవించారు. పలు విద్యా సంస్థలు, గోశాలలకు విరాళాలు అందజేశారు. ముఖ్యంగా దళితుల విద్యావ్యాప్తికి కృష్ణభారతికి ఎనలేని కృషిచేశారు.


కాగా, భీమవరంలో జులై 2022న జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంంలో కృష్ణభారతిని ప్రధాని నరేంద్ర మోదీ సత్కరించారు.ఈ సందర్భంగా ఆమెకు పాదాభివందనం చేసి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. బ్రిటిష్ ఆంక్షలను ధిక్కరించి భీమవరం సబ్ కలెక్టర్ ఆఫీసుపై భారత జెండా ఎగురవేసిన ఘటనలో కృష్ణమూర్తి దంపతులను అరెస్ట్ చేసిన అధికారులు.. 1932 జూన్‌లో కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ ఘటన దక్షిణ బర్డోలీ తిరుగుబాటుగా గుర్తింపు తెచ్చుకుంది జైలు శిక్షపడిన సమయానికి అంజలక్ష్మి ఆరు నెలల గర్భవతి. అయినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం కనీసం కనికరించలేదు.


జైలులోనే ఆమెకు కృష్ణభారతి జన్మించారు. కారాగారంలో పుట్టిన శ్రీకృష్ణ పర్మమాత్ముడిని, స్వతంత్ర భారతి ఆకాంక్షను గుర్తు చేస్తూ ఆమెకు కృష్ణ భారతి అని పేరుపెట్టారు. తొలి 10 నెలల బాల్యం కారాగారంలోనే గడిచింది. పశ్చిమ విప్పర్రు గ్రామంలోని తమ యావదాస్తిని స్వాతంత్ర్య పోరాటం కోసం కృష్ణమూర్తి దంపతులు త్యాగం చేశారు. పశ్చిమ గోదావరిలో గాంధీజీ పర్యటించినప్పుడు.. ఆయనకు కృష్ణమూర్తి వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించారు. వినోబాభావే భూదానోద్యమంలోనూ భాగస్వామ్యమై స్వగ్రామంలో దళితులకు ఇళ్ల పట్టాలు ఇప్పించారు. అంతేకాదు, తమ జీవితాంతం కుష్టు రోగులకు, అభాగ్యులకు సేవ చేశారు. చివరి వరకు గాంధేయ విలువలతోనే జీవించారు.


స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా విజయవాడకు వచ్చిన గాంధీజీని కలిసిన కృష్ణమూర్తి దంపతులు.. కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకొని జాతీయోద్యమంలో అడుగు పెట్టారు. 1929 ఏప్రిల్‌ 25న చాగల్లు ఆనంద నికేతన్‌కు వచ్చిన మహాత్ముడ్ని కలిసి ఖద్దరు నిధికి తమ ఒంటిపైనున్న ఆభరణాలే కాదు.. తమ వెంట వచ్చిన ఆరేళ్ల కుమార్తె సత్యవతి, నాలుగేళ్ల కుమారుడు ఆదినారాయణ కూడా తమ ఆభరణాలను సమర్పించారు. .ఆ చిన్నారులను తన ఒళ్లో కూర్చోబెట్టుకున్న గాంధీజీ ‘ఇప్పుడిచ్చారు సరే.. మళ్లీ బంగారంపై మోజు పడకుండా ఉంటారా..?’ అని ఆ దంపతులను అడిగే. ఇకపై నగలు ధరించబోమంటూ ప్రతిన బూనారు.. నాటి నుంచి వారు బంగారం జోలికెళ్లలేదు. రెండో కుమార్తె అయిన కృష్ణభారతికి చెవులను కూడా కుట్టించలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa