ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్లమెంట్‌‌ను వక్ఫ్‌కు అప్పగించేవాళ్లు.. కాంగ్రెస్‌పై కిరణ్ రిజుజు తీవ్ర వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Wed, Apr 02, 2025, 08:59 PM

వివాదస్పద వక్ఫ్ సవరణ బిల్లును ఎన్డీయే ప్రభుత్వం..బుధవారం లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. స్పీకర్ అనుమతితో కేంద్ర మైనార్టీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు ఈ బిల్లును సభ ముందుంచారు. ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీయే అధికారంలో ఉన్నప్పుడు 123 ఆస్తులను వక్ఫ్‌కు అప్పగించడం సహా చట్టానికి ప్రశ్నార్థకమైన మార్పులు చేసిందని ఆరోపించారు. అంతేకాదు, యూపీయేను అడ్డుకోకుంటే పాత పార్లమెంట్ భవనాన్ని కూడా వక్ఫ్‌కు అప్పగించేవారని ఎగతాళి చేశారు.


వక్ఫ్ చట్టంలో సవరణలను వ్యతిరేకిస్తోన్న ప్రతిపక్షాలపై కేంద్ర మంత్రి విరుచుకుపడ్డారు. పాత్త చట్టంతో ముస్లిం మహిళలు, పిల్లలకు సాధికారికత లేకుండా పోయిందని అన్నారు. ఆ చట్టాన్ని సవరించి ముస్లిం మహిళలు, పిల్లలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, మసీదుల నిర్వహణలో ఎటువంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. ‘ఇది ఆస్తి నిర్వహణ సమస్య.. మతపరమైన భావాలతో ప్రభుత్వానికి సంబంధం లేదు.’ అని రిజుజు పేర్కొన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు.


‘మేము చాలా స్పష్టమైన లక్ష్యంతో ఉన్నాం.... వక్ఫ్‌ను లౌకిక సంస్థగా.. సమగ్రంగా మార్చాలని కోరుకుంటున్నాం’ అని మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు, కేంద్ర వక్ఫ్ మండలిలో ఇద్దరు ముస్లిమేతరులను సభ్యులుగా నియమించడమే నిబంధనను ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ అభ్యంతరంపై రిజుజు పై విధంగా స్పందించారు.


ఈ బోర్డులలో మహిళలకు ప్రాతినిధ్యం లేదని, కనీసం ఇద్దరు మహిళా సభ్యులను ఉండేలా ప్రభుత్వం నిబంధనలను చేర్చిందని తెలిపారు. ఈ సమయంలో విపక్ష ఎంపీలు కేసీ వేణుగోపాల్, ఎన్‌కే రామచంద్రన్‌లు కేంద్ర మంత్రి ప్రసంగానికి అడ్డుతగిలారు. వక్ఫ్ సవరణ బిల్లుపై నియమించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి ఈ మార్పులను చేయడానికి అధికారం ఉందా? లేదా? అని రామచంద్రన్ ప్రశ్నించారు. బిల్లును పరిశీలించడానికి ప్రతిపక్షానికి తగిన సమయం ఇవ్వలేదని కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకుంటూ.. ఇరు వర్గాలకు సమానంగా సమయం ఇచ్చామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa