అధికార పార్టీ అరాచకాలను ఎదుర్కొనేందుకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందని వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజార్టీ లేదని తెలిసినా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు చేశారని మండిపడ్డారు. అయినా 51 స్థానాలకు గాను 39 స్థానాల్లో వైయస్ఆర్‌సీపీ విజయం సాధించిందని చెప్పారు. బుధవారం వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో తమ పార్టీ గుర్తు మీద గెలిచిన ప్రతినిధులే ఉన్నారని తెలిపారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయని, ఇలాంటి తరుణంలోనూ అధికార పార్టీ నేతలు దౌర్జన్యం చేయడం ఏంటని ప్రశ్నించారు. గతంలో కూడా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు తన పార్టీలోకి తీసుకున్నారని గుర్తు చేశారు. ఇప్పడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ లేదని తెలిసినా సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ‘‘అంత ఉబలాటంగా ఉంటే.. చట్ట పరిధిలో అవకాశం ఉంటే స్థానిక సంస్థలను రద్దు చేయండి. ఎన్నికలకు వెళ్దాం. అంతేగానీ ఇలా దొడ్డిదారిలో తీసుకోవడం ఏంటి? రామగిరిలో మాకు మెజార్టీ లేదని, ఎంపీపీ అభ్యర్థి కూడా లేరని పరిటాల సునీతే స్వయంగా చెప్పారు. కానీ రామగిరి, గాండ్లపెంట ఎంపీపీ విషయంలో జరిగిన దౌర్జన్యాలు ఏంటి? 15, 20 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులను మళ్లీ తీసుకురావాలని అనుకుంటున్నారా? శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు కూడా చేతులెత్తేశారు.. ఎస్పీలతో కూడా నేను మాట్లాడాను. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు పోలీస్‌స్టేషన్లు తీసేయమంటే తీసి వేయడానికి సిద్ధంగా ఉన్నారా? అని అడిగాను. రామగిరి మండలంలో జరిగిన అరాచకానికి కారణం ఎవరు? మా సింబల్ పై గెలిచిన వాళ్లను ఎలా తీసుకెళ్తారు? మిమ్మల్ని ఎదిరిస్తే మనుషుల్ని చంపేస్తారా? పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్య కుటుంబానికి మా పార్టీ అండగా ఉంటుంది. ఈనెల 8వ తేదీన వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ కుటుంబానికే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ అండగా ఉంటారు’’ అని స్పష్టం చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరుగుతున్న దౌర్జన్యాలు, అరాచకాలకు సీఎం చంద్రబాబు బాధ్యత తీసుకోవాలని తెలిపారు.
![]() |
![]() |