రాజమహేంద్రవరంలో ఆత్మహత్యాయత్నం చేసిన ఫార్మసీ విద్యార్థిని నాగ అంజలి, 12 రోజుల తర్వాత దుర్మరణానికి ప్రభుత్వమే కారణమని ఎమ్మెల్సీ, వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన దీపక్ ఏజీఎంగా ఉన్న ఆస్పత్రిలోనే అంజలికి చికిత్స చేయొద్దని, వేరే ఆస్పత్రికి తరలించాలని కోరినా, ఆమె తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెప్పినా, ప్రభుత్వం పట్టించుకోలేదని, చివరికి 12 రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎవరూ కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ.... ఒక నరరూప రాక్షసుడి వేధింపులకు ఫార్మసీ విద్యార్థిని నాగ అంజలి అసువుల బాసింది. తన ఆత్మహత్యకు కిమ్స్ ఏజీఎం దీపక్ కారణమని సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్యా యత్నం చేసిన అంజలి పన్నెండు రోజులుగా మృత్యువుతో పోరాడి చివరికి కన్నుమూసింది. ప్రభుత్వమే అంజలిని పొట్టన పెట్టుకుంది. అంజలి కుటుంబానికి న్యాయం చేసే విషయంలో ప్రభుత్వ ఉదాసీనత కొట్టొచ్చినట్టు కనపడింది. ఏ ఆస్పత్రిలోనైతే ఆత్మహత్య ప్రయత్నం చేసిందో అదే ఆస్పత్రిలో వైద్యం అందిస్తే ఎలా న్యాయం చేసినట్టు అవుతుందని, పైగా ఇదే ఆస్పత్రిలో నిందితుడు దీపక్ ఏజీఎంగా పనిచేస్తున్నాడని అంజలి తల్లిదండ్రుల తరఫున వైయస్సార్సీపీ అనుమానం వ్యక్తం చేస్తూనే ఉంది. ఆస్పత్రి మార్చాలని కోరినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. నిందితుడు దీపక్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అందుకే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది అని ఆరోపించారు.
![]() |
![]() |