ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన ఆవిర్భావ సభకు రాజమహేంద్రవరం ముస్తాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 13, 2019, 09:25 PM

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గోదావరి తీరాన... రాజమహేంద్రవరం నగరం జనసేన జెండాలతో ముస్తాబవుతోంది. మార్చి 14... గురువారం జనసేన ఆవిర్భావ సభను రాజమహేంద్రవరం నగరంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. 13 జిల్లాల నుంచి జనసైనికులు తరలి రానున్నారు. అక్టోబర్ లో జనసేన కవాతుతో పులకరించిన ఈ నగరంలోనే భారీ సభను నిర్వహించాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా సభ నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో గురువారం సాయంత్రం 3 గంటల నుంచి సభా కార్యక్రమాలు మొదలవుతాయి. బుధవారం ఉదయం నుంచి జనసేన ముఖ్య నేతలు సభా ప్రాంగణంలో చేస్తున్న ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. లక్షల మంది హాజరయ్యే ఈ సభలో ఏ ఒక్కరూ ఇబ్బందిపడకుండా చూస్తున్నారు. మహిళలు కూర్చొనేందుకు తగిన రక్షణతో ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండు చోట్ల పార్కింగ్ -
13 జిల్లాల నుంచి సభకు జనసైనికులు వస్తారు. వాహనాలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున పార్కింగ్‌ ప్రదేశాలను సిద్దం చేశారు. నిర్ణీత పార్కింగ్‌ ప్రదేశాల్లోనే వాహనాలను నిలపాల్సి ఉంటుంది. విశాఖపట్నం, వేమగిరి, రావులపాలెం వైపు నుంచి వచ్చే వాహనాలకు లాలాచెరువు హోండా కార్ల షోరూం వద్ద పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. ఇటు నుంచి వచ్చే వాహనాలు సి.టి.ఆర్.ఐ. జంక్షన్ లో జనాన్ని దింపి షోరూమ్ వద్ద గ్రౌండ్ లో పార్క్ చేసుకోవాలి. కొవ్వూరు, నిడదవోలు నుంచి ధవళేశ్వరం బ్యారేజ్, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి  మీదుగా వచ్చే వాహనాలు ఎస్‌కేవీటీ కళాశాలలో నిలుపుకోవాల్సి ఉంటుంది. నల్లజర్ల, దేవరపల్లి, గామన్ బ్రిడ్జి మీదుగా వచ్చే వాహనాలకు లూథరన్ గ్రౌండ్, ఎండోమెంట్ గ్రౌండ్ లో పార్కింగ్ సదుపాయం కల్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa