బిల్లుల ఆమోదంలో జాప్యానికి తావుండరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లులను గవర్నర్‌లు నిర్ణీత సమయంలో ఆమోదించాల్సిందేని ఉద్ఘాటించింది. లేదంటే వారి చర్యలను న్యాయ సమీక్షకు గురిచేస్తామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన బిల్లులను కూడా మూడు నెలల్లోపు పరిష్కరించాలని ఆదేశించింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం నేడు సంచలన తీర్పు వెలువరించింది.తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచిన 10 బిల్లులను సుప్రీంకోర్టు క్లియర్ చేసిన నాలుగు రోజుల తర్వాత ఈ తీర్పు వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్‌కు ఉన్న అధికారాలను గుర్తు చేస్తూనే, బిల్లులను ఆమోదించకుండా నిరవధికంగా నిలిపి ఉంచడాన్ని కోర్టు తప్పుబట్టింది.రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపితే, రాష్ట్రపతి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్దేశించిన గడువును అనుసరించాలని కోర్టు పేర్కొంది. ఒకవేళ ఆలస్యమైతే, అందుకు గల కారణాలను సంబంధిత రాష్ట్రానికి తెలియజేయాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం అడిగిన ప్రశ్నలకు రాష్ట్రాలు సహకరించాలని సూచించింది.గవర్నర్ బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపినప్పుడు, రాష్ట్రపతి తిరస్కరిస్తే, రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్టికల్ 200 ప్రకారం, గవర్నర్‌కు బిల్లులను ఆమోదించే, నిలిపివేసే లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపే అధికారం ఉంది. అయితే, గవర్నర్ బిల్లులను ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉంచడం, సదుద్దేశంతో వ్యవహరించకపోవడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. బిల్లులను పునఃపరిశీలించిన తర్వాత తిరిగి పంపినప్పుడు, గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలని సూచించింది.రాష్ట్ర మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్ పనిచేయాలని, ఒకసారి సభకు తిరిగి పంపిన బిల్లును రెండోసారి రాష్ట్రపతి పరిశీలనకు పంపకూడదని కోర్టు పేర్కొంది. గవర్నర్ బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి నిర్దిష్ట గడువు లేనప్పటికీ, ఆర్టికల్ 200 గవర్నర్‌కు బిల్లులను ఆమోదించకుండా, రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసే అధికారం ఇవ్వదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పు కాపీని అన్ని హైకోర్టులకు, రాష్ట్రాల గవర్నర్ల కార్యదర్శులకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది.మంత్రి మండలి సలహా మేరకు బిల్లును నిలిపివేసినా లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపినా, గవర్నర్ గరిష్ఠంగా ఒక నెలలో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. మంత్రి మండలి సలహాకు విరుద్ధంగా బిల్లును నిలిపివేస్తే, గరిష్టంగా మూడు నెలల్లో తిరిగి పంపాలని పేర్కొంది. పునఃపరిశీలన తర్వాత బిల్లును సమర్పిస్తే, గవర్నర్ గరిష్ఠంగా ఒక నెలలో ఆమోదం తెలపాలని కోర్టు ఆదేశించింది.శాసనసభ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడంలో జాప్యంపై తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. 2020 నాటి ఒక బిల్లుతో సహా 12 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa