ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనూషను చంపేందుకు జ్ఞానేశ్వర్ గతంలో ఎన్ని వేషాలు.. విశాఖ కేసులో విస్తుపోయే నిజాలు

Crime |  Suryaa Desk  | Published : Wed, Apr 16, 2025, 11:05 PM

విశాఖపట్నంలోని మధురవాడలో హత్యకు గురైన నిండు గర్భిణి అనూష ఘటనలో ఆమె భర్త గెద్దాడ జ్ఞానేశ్వర్‌ గతంలో ఎన్ని వేషాలు వేశాడో.. ఆమెను చంపేందుకు ఎన్ని కుట్రలు పన్నాడో ఒక్కక్కటిగా బయటికి వస్తున్నాయి. అసలు అనూషను జ్ఞానేశ్వర్‌ చంపిన విషయం కూడా బయటికి వచ్చుండేది కాదు. రాత్రి పడుకున్న నా భార్య తెల్లారేసరికి ఉలుకుపలుకు లేకుండా పడుందని నాటకం ఆడాడు జ్ఞానేశ్వర్‌. కానీ, అనూష స్నేహితురాలి తల్లికి అనుమానం వచ్చింది. ఆమె అనుమానమే నిజమైంది. ఒకవేళ ఆమె అనుమానించకుండా ఉండుంటే జ్ఞానేశ్వర్‌ హత్య చేసిన విషయం ఇంత త్వరగా తెలుసుండేది కాదు.. అసలు పూర్తిగా తెలిసే అవకాశమే లేకుండా పోయేదేమో.


మరోవైపు పోలీసులు విచారణలో జ్ఞానేశ్వర్‌ కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వైజాగ్ బీచ్‌రోడ్డులోని ఓ కాలేజీలో అనూష హోటల్‌ మేనేజ్‌మెంట్ కోర్సు చేస్తున్నప్పుడు ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. పెళ్లికి ముందే శారీరకంగా ఒకటవుదామని పలుమార్లు ప్రయత్నించినా అనూష అందుకు ఒప్పుకోలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులకు తెలియకుండా సింహాచలంలో పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి అనూష కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఆ తర్వాత మధురవాడలో కాపురం పెట్టి తాను బెంగళూరులో ఉంటున్నానని తల్లిదండ్రులను నమ్మించాడు.


పెళ్లి తర్వాత అనూషతో శారీరకంగా దగ్గరైన జ్ఞానేశ్వర్‌.. ఆ తర్వాత ఆమెను ఎలాగోలా వదిలించుకోవాలని అవకాశం చిక్కినప్పుడల్లా ప్రయత్నాలు చేశాడు. నాకు క్యాన్సర్ అటాక్ అయ్యింది.. నాతో ఉంటే నీ జీవితం పాడైపోతుంది.. విడాకులు తీసుకుని వేరొకరిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండంటూ నంగనాచి కబుర్లు చాలానే చెప్పాడు. కానీ ఈ ఒత్తిళ్లకు అనూష లొంగలేదు. చావైనా బతుకైనా నీతోనే.. నిన్ను వదిలి ఎక్కడికీ వెళ్లను అని అనూష తెగేసి చెప్పింది. పెళ్లై రెండేళ్లు గడచినా ఇంట్లో రెండు మంచాలు, వంట సామాన్లు తప్ప మరే సౌకర్యాలు కల్పించకుండా కాలం గడిపాడు జ్ఞానేశ్వర్‌. ఆమెతో కలిసి ఫొటోలు దిగితే ఫ్రెండ్స్ ద్వారా బయటకు వెళ్లిపోతాయని ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ వచ్చాడు. గర్భిణిగా ఉన్న ఆమె ఓ సారి ‘ఫలూదా’ తాగాలని ఉందని అడిగితే తీసుకు వచ్చి దాంట్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. తాగే సమయంలో గ్లాసులో కరగకుండా ఉన్న ఓ మాత్రను ఆమె గుర్తించి ఏమిటని అడగటంతో తనకు తెలియదని బుకాయించాడు. మొత్తానికి ఆమెను వదిలించుకోవాలనే ప్రయత్నాలు అయితే ఆపలేదు.


ఏప్రిల్ 13వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత భార్యను హత్య చేసిన జ్ఞానేశ్వర్‌.. ఆ తర్వాత పెద్ద నాటకమే వేశాడు. పొద్దున్నే లేచి బెడ్ రూమ్‌లోనే ఫోన్ చూసుకుంటూ చాలా నేచురల్‌గా నటించాడు. అనూష డెలివరీ ఉందని రెండు రోజుల ముందే అమ్మమ్మ ఆమె దగ్గర వచ్చారు. ఆవిడ హాలులో పడుకునేవారు. ఉదయం అనూషను నిద్రలేపేందుకు గదిలోకి వెళ్లారు. ఆమె ఎంత లేపినా అనూష నుంచి స్పందన లేదు. ఏంటి లేవడం లేదా.. ఏమైంది అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తనలోని నట విశ్వరూపాన్ని చూపించాడు జ్ఞానేశ్వర్‌. తన భార్య లేవడం లేదని అందరినీ కంగారు పెట్టాడు. నైబర్స్‌లో ఇద్దరు గ్రే హౌండ్స్ కానిస్టేబుల్స్ ఉన్నారు. వారిలో ఒకరికి కారు ఉంది. ఆ కారులో ముందుగా ఓ ప్రైవేటు హాస్పిటల్‌కి అనూషను తీసుకువెళ్లాడు. అనూష అప్పటికే చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. అయితే, వాళ్లతో హాస్పిటల్‌కు వెళ్లిన అనూష స్నేహితురాలి తల్లి.. ఆమె మెడపై ఉన్న మచ్చను గుర్తించారు. అంతేకాకుండా అనూష శరీరం నల్లగా ఉబ్బి పోవడం చూసి ఇది క్యాజువల్ డెత్ కాదని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అనూష డెడ్ బాడీని అక్కడి నుంచి కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. విషయం పోలీసులకు చెప్పడంతో వాస్తవాలు బయటపడ్డాయి.


హత్యకు గురైన నిండు గర్భిణి అనూషకు పోస్టుమార్టం నిర్వహించిన కేజీహెచ్ డాక్టర్లు.. ఆమె గర్భం నుంచి మృత ఆడశిశువును బయటకు తీశారు. ఈ హృదయ విదారకరమైన ఘటన అందరినీ కలచి వేసింది. నిందితుడు జ్ఞానేశ్వర్‌ ప్రత్యక్షంగా ఒకరిని, పరోక్షంగా ఇద్దరిని బలిగొన్నాడని అంతా ఆవేదన వ్యక్తం చేశారు. రెండు జీవితాలను చిదిమేశాడని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని దుయ్యబట్టారు. ఇక జ్ఞానేశ్వర్‌‌ను అరెస్ట్ చేసిన పోలీసులు భీమిలి కోర్టులో హాజరుపరిచారు. అతడికి కోర్టు ఈ నెల 28 వరకు అంటే 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో జ్ఞానేశ్వర్‌‌ని సెంట్రల్ జైలుకి పంపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa