ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు దశాబ్దాల తర్వాత ఒక్కటవుతోన్న ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు

national |  Suryaa Desk  | Published : Sun, Apr 20, 2025, 08:35 PM

జాతీయ విద్యావిధానం 2020 అమలులో భాగంగా మహారాష్ట్రలో ఒకటితి నుంచి ఐదో తరగతి వరకూ హిందీ. మరాఠీ మీడియం విద్యార్థులకు తప్పనిసరిగా హిందీ బోధించాలని ఫడ్నవీస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై మరాఠావాదులు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు సంభవించబోతున్నాయనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రెండు దశాబ్దాల కిందట విడిపోయిన ఠాక్రే కుటుంబం మళ్లీ కలసే అవకాశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బాబాయి బాల్ ఠాక్రేతో విబేధించి 2005లో శివసేనను విడీన రాజ్ ఠాక్రే.. సొంతంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన పేరుతో పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. రాజ్ ఠాక్రేల మధ్య రాజకీయ విభేదాలు కొనసాగతున్నాయి. ఈ క్రమంలో సోదరులు ఇద్దరూ మళ్లీ కలుస్తున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా మరాఠీ సంస్కృతి, గుర్తింపుపై పెరుగుతున్న బెదిరింపుల నేపథ్యంలో దాయాదులు కలిసి పనిచేయాలనే నిర్ణయాన్ని పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.


రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. ‘ఉద్ధవ్‌కు, నాకు మధ్య ఉన్న విభేదాలు స్వల్పమే. దీని కంటే మహారాష్ట్ర అస్థిత్వం ప్రమాదంలో ఉంది. మా విభేదాలు మహారాష్ట్ర ప్రయోజనాలు, మరాఠీ ప్రజలకు నష్టం కలిగిస్తున్నాయి. కలవడం కష్టం కాదు ఇది మనసుకు సంబంధించింది.. ఇది నా స్వార్థం గురించి కాదు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం తన స్వార్ధం, అహంభావం పక్కన పెట్టేందుకు నేను సిద్ధం’ అని వెల్లడించారు. ఇదే జరిగితే గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి సంపూర్ణ మద్దతుకు వ్యతిరేకంగా ఉంటుంది.


అటు, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ, ‘నేను చిన్న చిన్న విబేధాలును పక్కన పెట్టేందుకు సిద్ధం. కానీ ఒక షరతు ఉంది.. మనం ఒక రోజు మద్దతు ఇచ్చి, మరో రోజు వ్యతిరేకంగా నిలబడి, మళ్లీ ఒప్పందాలు చేసుకుంటూ ఉండలేం.. మహారాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేసే ఎవరినీ నేను ఆహ్వానించను. ఇది స్పష్టంగా చెప్పాలి’ అని అన్నారు.


ఉద్థవ్ వర్గం నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కూడా ఈ విషయంపై స్పందించారు. ఇద్దరు ఠాక్రేలు కలిసి వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. అయితే, ఉద్ధవ్ పెట్టిన షరతు అంటే రాజ్ ఠాక్రే మహారాష్ట్ర, శివసేన శత్రువులకు మద్దతివ్వకూడదన్నది మాత్రం స్పష్టం చేశారు.


రాజకీయ పార్టీలు ఎలా స్పందించాయి?


బీజేపీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ.. ‘‘వారు కలిసి వస్తే మాకు ఆనందమే... ఇది మంచిదే. కానీ బృహన్ ముంబయి కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీయే ఓడించలేరు’ అన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవన్కులే మాట్లాడుతూ.. రాజ్ ఠాక్రే తన భవిష్యత్తు నిర్ణయించుకోవచ్చు. మేము అభ్యంతరం చెప్పమని అన్నారు. కాంగ్రెస్: మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సాప్కాల్ మాట్లాడుతూ.. మరాఠీ భాష, సంస్కృతికి బీజేపీ ముప్పు తెస్తోందనే అభిప్రాయాన్ని రాజ్ ఠాక్రే అంగీకరిస్తున్నట్లు కనపడుతోంది’ అన్నారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ.. ఇది సంతోషకరమైన విషయమని, బాల్ ఠాక్రే ఈ రోజు ఉండుంటే చాలా ఆనందించేవారని అన్నారు.


కాగా, శివసేన (షిండే) ఎంపీ నరేష్ మాస్కే మాత్రం.. ‘‘ఉద్ధవ్ ఠాక్రే.. రాజ్ ఠాక్రేకు పదవులు ఇస్తే ఇల్లు విడిచిపోతానన్నారని, ఆయన గతంలో రాజ్ ఠాక్రే అభిమానులను దూరం పెట్టారు’ ఆరోపించారు. ఒకవేళ సోదరులు ఇద్దరి కలయిక నిజమైతే మహారాష్ట్రలో బీజేపీకి గట్టి సవాలుగా మారవచ్చు. అక్టోబరులో జరగనున్న బీఎంసీ ఎన్నికలు ఈ కలయికకు తొలి పరీక్ష కావచ్చు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa