ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ సంపూర్ణ సహకారంతో అమరావతిని ప్రపంచం గర్వించేలా నిర్మిస్తామని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు.2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 94 శాతం స్ట్రయిక్ రేట్‌తో చరిత్రాత్మక విజయం సాధించిందని చంద్రబాబు గుర్తుచేశారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్‌పై ఉందని, ప్రధాని మోదీ అండతో దానిని తిరిగి గాడిలో పెడుతున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. గత ఐదేళ్ల వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే బయటకు తీసుకొస్తున్నామని అన్నారు.అమరావతి కేవలం ఒక నగరం కాదని, అది ఐదు కోట్ల ఆంధ్రుల సెంటిమెంట్ అని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. రాజధాని నిర్మాణం కోసం నాడు 29 వేల మంది రైతులు తమ భవిష్యత్తును త్యాగం చేసి 34 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారని గుర్తుచేశారు. చారిత్రకంగా అమరలింగేశ్వర స్వామి, కృష్ణానది, బౌద్ధారామాలకు నిలయమైన అమరావతి అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి రైతులు చెప్పలేని కష్టనష్టాలు అనుభవించారని, వారి పోరాటం, త్యాగం మరువలేనిదని అన్నారు. అమరావతి ఉద్యమం లాంటి దాన్ని తన జీవితంలో చూడలేదని కొనియాడారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఏకపక్ష తీర్పుతో అమరావతికి మళ్లీ ప్రాణం పోశారని వ్యాఖ్యానించారు.ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని పునర్ నిర్మాణ పనులను ప్రారంభించుకోవడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజని చంద్రబాబు అభివర్ణించారు. ఐదు కోట్ల మంది ప్రజలు గర్వంగా ‘ఇది మా రాజధాని’ అని చెప్పుకునేలా అమరావతిని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. విద్య, వైద్య రంగాలకు కేంద్రంగా, ప్రపంచంలోని అన్ని ప్రధాన నగరాలతో అనుసంధానమై ఉండేలా, గ్రీన్ ఎనర్జీతో కాలుష్య రహిత నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని వివరించారు. అమరావతిలో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు చదువుకునేలా విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తామన్నారు.గతంలో హైదరాబాద్‌లో హైటెక్ సిటీని స్థాపించి ఐటీ విప్లవానికి నాంది పలికామని, దానిని నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రారంభించారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అదే స్ఫూర్తితో అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ సంస్థలతో కీలక ఒప్పందాలు ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఏఐ కృత్రిమ మేధ రంగంలోనూ ఏపీ దూసుకుపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మూడేళ్ల తర్వాత అమరావతి నగరం పూర్తిస్థాయిలో రూపుదిద్దుకున్నాక, మళ్లీ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అమరావతి అభివృద్ధికి మోదీ అందిస్తున్న సహకారం చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆయన ఆశీస్సులు తమకు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. కేవలం అమరావతే కాకుండా, రాష్ట్రంలోని అన్ని 26 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.ఇవాళ అమరావతికి వర్ష సూచన ఉందన్నారని, కానీ వర్షం రాకుండా దేవతలు మొత్తం ఆశీర్వదించారని చంద్రబాబు సంతోషంగా చెప్పారు. ప్రధాని మోదీ కూడా ఒక మాట అన్నారని, తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ సభ కూడా ప్రతికూల వాతావరణం కారణంగా రద్దవలేదని, ఇవాళ అమరావతి సభ కూడా సక్సెస్ అయి తీరుతుందని చెప్పారని చంద్రబాబు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa