ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ చేసిన దాడులకు పాకిస్తాన్ బిక్కుబిక్కుమని వణికిన సంగతి ప్రపంచం మొత్తం తెలిసిందే. మొదట మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాక్.. భారత్ చేసిన దాడులను తిప్పికొట్టినట్లు బీరాలు పలికింది. అంతేకాకుండా భారత ఫైటర్ జెట్లను కూల్చేశామని.. భారత ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసినట్లు కూడా చెప్పుకుంది. భారత్, పాక్ ఉద్రిక్తతల్లో తామే విజయం సాధించామంటూ.. పాకిస్తాన్ వీధుల్లో సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ రాను రాను పరిస్థితి అందరికీ తెలియడంతో.. తాము నష్టపోయిన విషయాన్ని కూడా ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ వెల్లడిస్తోంది. ఈ క్రమంలోనే భారత్ జరిపిన దాడుల్లో తాము తీవ్రంగా నష్టపోయామని ఇప్పటికే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. తాజాగా అజర్ బైజాన్ పర్యటనలో ఉన్న షెహబాజ్ షరీఫ్.. మరిన్ని విషయాలు వెల్లడించారు.
అయితే ఆపరేషన్ సిందూర్ కంటే ముందు తామే భారత్‌పై దాడి చేయాలని ప్రయత్నించామని.. కానీ తమ కంటే ముందే భారత్ పాకిస్తాన్‌పై విరుచుకుపడినట్లు ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. మే 10వ తేదీన భారత్‌పై దాడి చేసేందుకు పాక్ సిద్ధమవుతుండగానే.. మే 9, 10 మధ్య రాత్రి భారత్ తమపై దాడి చేసినట్లు వెల్లడించారు. ఇక భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులకు పాక్ ఆర్మీ షాక్ అయినట్లు చెప్పారు. భారత మిసైల్స్ రావల్పిండి విమానాశ్రయం సహా పలు ప్రాంతాల్లోని కీలక లక్ష్యాలను ఛేదించాయని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్ వైమానిక దళాన్ని భారత్ స్థంభింపజేసిందని.. వారి కమ్యూనికేషన్ వ్యవస్థలను దెబ్బతీసిందని తెలుస్తోంది.
మే 10వ తేదీన ఉదయం.. దాడి గురించి తనకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ప్రస్తుతం ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి పొందిన ఆసిమ్ మునీర్.. తెలియజేశారని షెహబాజ్ షరీఫ్ చెప్పారు. ఆరోజున తెల్లవారుజామున 4.30 గంటలకు ఇస్లాంలోని ముఖ్యమైన ప్రార్థన అయిన ఫజ్ర్ తర్వాత భారత్‌పై దాడి చేసేందుకు పాక్ సాయుధ బలగాలు సిద్ధం కాగా.. అంతకుముందే భారత్ బ్రహ్మోస్‌ను ఉపయోగించి క్షిపణి దాడిని ప్రారంభించిందని వెల్లడించారు.
మే 9, 10 తేదీల మధ్య రాత్రి భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన దాడులు మే 10వ తేదీ మధ్యాహ్నం వరకు కొనసాగాయి. ఈ దాడుల్లో పాకిస్తాన్‌లోని ఎయిర్ బేస్‌లను లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దళం దాడులు చేశాయి. అంతకుముందు మే 6, 7 తేదీల మధ్య రాత్రి పాకిస్తాన్‌లోని బహావల్‌పూర్, మురిద్కేలలోని ఉగ్రవాద స్థావరాలతో సహా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసిన తర్వాత.. పాకిస్తాన్ తమ క్షిపణులతో భారత్‌పైకి దాడులు చేసింది. అయితే భారత్‌కు ఉన్న మల్టీ లెవల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్-400 మిసైల్ సిస్టమ్ కారణంగా పాక్ నుంచి ఎన్ని దాడులు వచ్చినా అవి ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి.
ఇక పాకిస్తాన్‌కు చెందిన మూడు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లపై దాడులు చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. పాకిస్తాన్ వైమానిక దళాన్ని పూర్తిగా స్థంభింపజేసింది. ఎందుకంటే పాక్ ఎయిర్‌ఫోర్స్ అడ్వాన్స్‌డ్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానానికి, వారి గ్రౌండ్ స్టేషన్‌ల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను భారత్ ధ్వంసం చేసంది. దీంతో వారి కమ్యూనికేషన్ వ్యవస్థ నాశనం అయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa