ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ వర్షాలు, తీవ్ర ఎండలు.. రాబోయే 5 ఏళ్లలో వాతావరణంలో పెనుమార్పులు

international |  Suryaa Desk  | Published : Fri, May 30, 2025, 08:16 PM

రాబోయే 5 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ తీవ్ర హెచ్చరికలు చేసింది. వచ్చే 5 ఏళ్లు.. భూమికి అత్యంత కీలకమని పేర్కొంది. ఈ 5 ఏళ్లలో ఒక సంవత్సరం 2024కంటే వేడిగా ఉంటుందని వెల్లడించింది. సగటు ఉష్ణోగ్రత కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుందని తెలిపింది. వేడిగాలులు, భారీ వర్షాలు, కరువులు, ధ్రువ ప్రాంతాల్లో మంచు కరగడం వంటి ప్రకృతి వైపరీత్యాలను మరింత తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేసింది. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు సూచించింది.


ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) విడుదల చేసిన తాజా నివేదిక భూమి భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. 2025 నుంచి 2029 వరకు రాబోయే ఐదేళ్లు ప్రకృతి వైపరీత్యాలు మరింత తీవ్రంగా ఉండబోతున్నాయని.. తీవ్ర హెచ్చరికలు చేసింది. ప్రపంచ ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగనున్నాయని డబ్ల్యూఎంఓ ఒక నివేదిక వెల్లడించింది. మానవజాతి, ఆర్థిక వ్యవస్థలు, పర్యావరణంపై దీని ప్రభావం ఊహించని విధంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఇక 2025-2029 మధ్య కనీసం ఒక సంవత్సరం.. 2024 కంటే వేడిగా ఉండే అవకాశాలు 80 శాతం ఉన్నాయని ఈ డబ్ల్యూఎంఓ నివేదిక తెలిపింది.


ఇంకా అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. 1850 నుంచి 1900 ఏళ్ల మధ్య పారిశ్రామిక యుగం నాటి ఉష్ణోగ్రతల కంటే సగటు ఉష్ణోగ్రత రానున్న ఐదేళ్లలో 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరిగే అవకాశాలు 86 శాతం ఉందని ఈ నివేదిక అంచనా వేసింది. 2015 పారిస్ ఒప్పందం ప్రకారం.. ప్రపంచ ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. ఇది దాదాపు అసాధ్యమని ఈ నివేదిక తర్వాత ఇప్పుడు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.


గత 2 ఏళ్లుగా (2023, 2024) ప్రపంచ దేశాలు అత్యంత వేడి వాతావరణాన్ని చవిచూశాయి. ఈ నేపథ్యంలోనే ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీనివల్ల వేడిగాలులు, భారీ వర్షాలు, కరువులు, ధ్రువ ప్రాంతాల్లో మంచు కరగడం వంటివి మరింత పెరుగుతాయని డబ్ల్యూఎంఓ పేర్కొంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. గత కొన్ని వారాల్లోనే ఇవన్నీ జరిగిపోయాయి. చైనాలో 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది.


అటు.. యూఏఈ 52 డిగ్రీల సెల్సియస్‌ను దాటేసింది. పాకిస్తాన్‌లో బలమైన గాలులు భీకరంగా మారిపోయాయి. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, అల్జీరియా, భారత్, చైనా, ఘనా దేశాలు వరదలతో అతలాకుతలం అయ్యాయి. యూరప్, కెనడా, అమెరికా దేశాల్లో ఉన్న అడవుల్లో కార్చిచ్చు రేగింది. అదే సమయంలో ఆర్కిటిక్ ప్రాంతం వేగంగా వేడెక్కడం కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. బారెంట్స్ సముద్రం, బేరింగ్, ఒఖోట్స్క్ సముద్రాల్లో మంచు వేగంగా కరిగిపోవడం కూడా డేంజర్ బెల్స్ మోగిస్తోంది.


భారత్‌ సహా దక్షిణ ఆసియాలో గత 5 ఏళ్లలో 4 సంవత్సరాలు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. 2025 నుంచి 2029 వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ అంచనా వేసింది. అయితే కొన్నిసార్లు పొడి వాతావరణం కూడా ఉండవచ్చని తెలిపింది. ఈ సంవత్సరం కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.


ఇలా వాతావరణంలో వచ్చే పెను మార్పులు.. ఆర్థిక వ్యవస్థలు, రోజువారీ జీవితం, పర్యావరణ వ్యవస్థ, భూమిపై ప్రతికూల ప్రభావాన్ని పెంచుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఉష్ణోగ్రతలో ప్రతి పెరుగుదల అంటే మరింత హీట్‌వేవ్, భారీ వర్షాలు, కరువు, ధ్రువ ప్రాంతాల వద్ద మంచు కరగడమని తెలిపింది. ఈ నేపథ్యంలోనే వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను తగ్గించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డబ్ల్యూఎంఓ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. లేకపోతే రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ హెచ్చరికలను ఎంత త్వరగా సీరియస్‌గా తీసుకుంటే.. అంత త్వరగా భవిష్యత్తును కాపాడుకోవచ్చని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa