లాటరీ టికెట్లు కొనేవారు చాలామంది ఉంటారు. అదృష్టం ఉన్న నూటికో కోటికో ఒక్కరికి మాత్రమే ఆ లాటరీ సొమ్ము దక్కుతుంది. కొందరైతే లాటరీ దక్కుతుందనే ఆశతో ఏళ్లకేళ్లు.. అప్పులు చేసి మరీ లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక ఒక్కసారి లాటరీ దక్కిందంటే అప్పటివరకు కొన్న టికెట్లే కాకుండా అప్పులు కూడా తీరి.. ఒక్క రాత్రిలోనే కోటీశ్వరులు అయిన వారు ఎంతోమంది ఉన్నారు. జీవితంలో ఒక్కసారైనా లాటరీ గెలుచుకోవాలని ఎంతో మంది కోరుకుంటూ ఉంటారు. అలాంటిది.. ఓ వ్యక్తి ఏకంగా రెండుసార్లు లాటరీ విజేతగా నిలిచాడు. దీంతో కోట్ల రూపాయలు అతనికి వచ్చి పడ్డాయి. కేరళకు చెందిన వ్యక్తికి యూఏఈలో ఈ రెండు లాటరీలు దక్కాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నివసిస్తున్న కేరళకు చెందిన 60 ఏళ్ల పాల్ జోస్ మావేలి.. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో రెండోసారి విజేతగా నిలిచారు. దీంతో ఆయనకు 1 మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ.8.5 కోట్లు గెలుచుకున్నారు. 10 ఏళ్లలోపు రెండుసార్లు ఈ బహుమతిని గెలుచుకున్న 11వ వ్యక్తిగా జోస్ మావేలి నిలిచారు. 38 ఏళ్లుగా దుబాయ్‌లోనే పనిచేస్తున్న మావేలి.. తనకు రెండు లాటరీలు తగలడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.
దుబాయ్‌లో ఒక చిన్న కాంట్రాక్టింగ్ వ్యాపారానికి సైట్ సూపర్‌వైజర్‌గా జోస్ మావేలి పనిచేస్తున్నాడు. అతడు ఇంతకుముందు 2016 నవంబర్‌లోనూ ఇదే దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో బహుమతిని గెలుచుకున్నాడు. దీంతో ఈ పోటీ చరిత్రలోనే రెండుసార్లు గెలిచిన 11వ వ్యక్తిగా జోస్ మావేలి నిలిచాడు. ఖలీజ్ టైమ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 1999లో దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రా ప్రారంభమైనప్పటి నుంచి.. ప్రతీసారి జోస్ మావేలి పాల్గొంటూనే ఉన్నారు. అతడు గత కొన్ని ఏళ్లుగా టికెట్ కొనుగోలు చేయడానికి తన ఫ్రెండ్స్ సాయం తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల గెలిచిన బంపర్ డ్రా సందర్భంగా.. అతడు మే 19వ తేదీన ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన ఆ లాటరీ టికెట్ నంబర్ 3532ను తన 17 మంది స్నేహితుల సాయం తీసుకున్నాడు.
పాల్ జోస్ మావేలికి ఇద్దరు పిల్లలు. తాజాగా రెండోసారి లాటరీ టికెట్ గెలుచుకున్న తర్వాత లాటరీ డ్రా నిర్వాహకులకు థ్యాంక్స్ చెప్పారు. దుబాయ్ డ్యూటీ ఫ్రీకి తాను చాలా కృతజ్ఞుడిని అని పేర్కొన్నారు. ఈ లాటరీలో 1 మిలియన్ డాలర్లు గెలుచుకోవాలంటే లాటరీ టికెట్‌లు దుబాయ్ కరెన్సీలో 1000 ఏఈడీలు కాగా.. సుమారు రూ.22,700 ఉంటాయి. ఇందులో 5 శాతం వ్యాట్ మినహాయించి ఉంటుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని డ్యూటీ ఫ్రీ షాపుల్లో లేదా దుబాయ్ డ్యూటీ ఫ్రీ వెబ్‌సైట్‌లో ఈ లాటరీ టికెట్లు లభిస్తాయి.
ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ టికెట్లు కొనుగోలు చేసేందుకు అన్ని దేశాలకు చెందిన వారు అర్హులు. ఈ లక్కీ డ్రా నెలకు రెండుసార్లు నిర్వహిస్తారు. డ్రా జరిగే సమయంలో టికెట్ కొనుగోలు చేసిన వారు దుబాయ్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి లక్కీ డ్రాలో 5 వేల టికెట్లు మాత్రమే విక్రయిస్తారు. 1999లో ఈ లక్కీ డ్రా ప్రారంభమైనప్పటి నుంచి కనీసం 251 మంది భారతీయులు ఈ లాటరీని గెలుచుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ నెల మొదట్లో కేరళకు చెందిన మరో 52 ఏళ్ల వ్యక్తి దుబాయ్ డ్యూటీ-ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో 1 మిలియన్ డాలర్లు సుమారు రూ.8.5 కోట్లు గెలుచుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అజ్మాన్‌లో నివసించే ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్ వేణుగోపాల్ ముల్లాచెరి ఏప్రిల్ 23వ తేదీన దుబాయ్ ఎయిర్‌పోర్టులో లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa