ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశం ఏది.. ముష్కరులకు నీడనిచ్చే తావేది అంటే ఠక్కున ప్రపంచ దేశాల చూపు పాకిస్థాన్ వైపు మళ్లుతుంది. మరి ప్రపంచంలో ఉగ్రవాదానికి పెట్టని కోటగా గుర్తింపు పొందిన పాకిస్థాన్ అంటే అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాలకు మాత్రమే కాక.. ఐక్యరాజ్య సమితి, ఐఎంఎఫ్ వంటి సంస్థలకి కూడా ప్రేమ కాస్త ఎక్కువే. పైపైకి ఆ దేశాన్ని ఏదో నాలుగు మాటలు దులిపి.. ఆ తర్వాత దానికి ముల్లెలు అందించడంలోనూ.. కీలక పదవులు కట్టబెట్టడంలోనూ ఇవి ఏమాత్రం వెనుకాడటం లేదు.
ట్రంప్ మయన్మార్ లాంటి దేశంపై ట్రావెల్ బ్యాన్ విధించి.. ఆ జాబితా నుంచి పాకిస్థాన్‌ను మినహాయించాడు. అదే సమయంలో ఐక్యరాజ్య సమితి ఓ అడుగు ముందుకు వేసి దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లుగా.. ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ ఛైర్మన్‌గా పాకిస్థాన్‌కు బాధ్యతలు అప్పగించడం విస్మయానికి గురి చేస్తోంది. కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన కొన్ని రోజుల వ్యవధిలోనే పాకిస్థాన్‌కు ఈ బాధ్యతలు దక్కడం గమనార్హం.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి.. ఉగ్రవాద నిరోధక కమిటీ వైస్ ఛైర్మన్‌గా పాకిస్థాన్‌ను ఎంపిక చేసింది. ఈ కమిటీకి అల్జీరియా అధ్యక్షత వహిస్తుండగా.. ఫ్రాన్స్, రష్యాలు కూడా ఉపాధ్యక్షులుగా ఉంటాయి. అంతేకాక తాలిబన్ల ఆంక్షల కమిటీ బాధ్యతలను కూడా పాకిస్థాన్‌కే దక్కాయి.
తాలిబాన్ ఆంక్షల కమిటీ అధ్యక్షత బాధ్యతలు స్వీకరించిన పాకిస్థాన్.. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి, భద్రతలకు ముప్పు కలిగించే తాలిబాన్లతో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థల ఆస్తుల జప్తు చేసే అధికారం కలిగి ఉంది. అలానే ప్రయాణ నిషేధాలు, ఆయుధాల నిషేధాల వంటి ఆంక్షలను అమలు చేయడానికి ఈ కమిటీకి అధికారం ఉంది. పాకిస్థాన్ ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఉంటే.. గయానా, రష్యా ఈ కమిటీకి ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తాయి.
భద్రతా మండలిలోని మొత్తం 15 సభ్య దేశాల ఏకాభిప్రాయం ప్రకారమే ఈ కమిటీలు ఏర్పాటవుతాయి. పాకిస్తాన్ ప్రస్తుతం 2025–26 కాలానికి గాను భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా ఉంది. గతంలో, భారతదేశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కలిక సభ్యదేశం కలిగి ఉన్న సమయంలో అంటే.. 2022లో తీవ్రవాద నిరోధక కమిటీకి అధ్యక్షత వహించింది. ఈ సమయంలో పాకిస్థాన్ ఉగ్రవాద సహాయక చర్యలు, ఆ దేశంలో ఉన్న ఉగ్ర సంస్థల గురించి చెప్పడంలో సఫలీకృతం అయ్యింది. ఇప్పుడు ఈ బాధ్యతలు పాకిస్థాన్ దక్కించుకోవడం భారతదేశాన్నే కాక ప్రపంచ దేశాలను సైతం విస్మయపరుస్తోంది.
ట్రంప్ తగ్గేదేలే.. అమెరికాలోకి రాకుండా 12 దేశాలపై నిషేధం
పాకిస్థాన్‌కు కీలక బాధ్యతలు కట్టబెట్టడం పట్ల భారతదేశం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుండగా.. విపక్షాలు మోదీ సర్కార్ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. భారతదేశం విదేశాంగ విధానం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఉగ్రవాద నిరోధక కమిటీ వైస్ ఛైర్మన్‌గా పాకిస్థాన్‌ను ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. అలానే ఇతర విపక్ష పార్టీలు కూడా భద్రతా మండలి నిర్ణయాలను తప్పు పట్టాయి. భారత్ సరైన దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని సూచించాయి.
‘ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు మిత్రులు లేరని కాదు, పాకిస్థాన్‌కు తాలిబాన్ ఆంక్షల కమిటీకి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం, కౌంటర్-టెర్రరిజం కమిటీకి ఉపాధ్యక్ష బాధ్యతల్లోకి తీసుకోవడం అనేది భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి అర్థం చేసుకోలేకపోవడమే’ అని శశి థరూర్ అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa