ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిందూరం మొక్క నాటిన ప్రధాని మోదీ

national |  Suryaa Desk  | Published : Fri, Jun 06, 2025, 06:08 PM

పర్యావరణ దినోత్వవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రోజు ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సిందూర మొక్కను నాటారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ఆ విషయాన్ని అందరితో పంచుకున్నారు. అంతేకాకుండా ఈ మొక్కను తనకు.. ఎవరిచ్చారో చెబుతూ వారి ధైర్య సాహసాలను వెల్లడించారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో పాకిస్థాన్‌తో భారత్ చేసిన యుద్ధంలో ధైర్య సాహసాలు చూపించిన మహిళా బృందాన్ని ఇటీవలే కలిశానని.. వారిచ్చిన ఈ మొక్కనే తన ఇంట్లో నాటుతున్నట్లు పేర్కొన్నారు. ఈక్రమంలోనే ఆ సిందూర మొక్క గురించి తెలుసుకోవడానికి అంతా ఆసక్తి కనబరుస్తున్నారు.


ఇటీవలే గుజరాత్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీని.. ఓ మహిళా బృందం కలిసింది. వారెవరో కాదు.. బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం చేసిన కచ్‌కు చెందిన మహిళలు. అయితే మోదీని కలిసిన వారు.. సిందూర మొక్కను బహుమతిగా అందజేశారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నేడు అదే మొక్కను తన ఇంటి ఆవరణలో నాటారు. ఈ విషయాన్ని ఆయనే నేరుగా ఎక్స్ వేదికగా వివరిస్తూ.. ఈ మొక్కను నాటే గొప్ప అవకాశం తనకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ మొక్క మన దేశ మహిళా శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన చిహ్నంగా నిలుస్తుందన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.


సిందూర్ మొక్కనే .. అన్నట్టో లేదా లిప్‌స్టిక్ చెట్టు అని కూడా పిలుస్తారు. దీని వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా దీని విత్తనాల నుంచి లభించే ఎరుపు, నారింజ రంగు రంగుల్లో మెండుగా ఔషధ గుణాలు ఉన్నాయి.


సహజమైన రంగు :


ఆహార పరిశ్రమ: సిందూర్ విత్తనాల నుంచి "బిక్సిన్" అనే సహజమైన రంగును సేకరిస్తారు. ఇది ఐస్ క్రీమ్, జున్ను, వెన్న, మార్గరిన్, పానీయాలు మరియు ఇతర ఆహార ఉత్పత్తులకు రంగు ఇవ్వడానికి విస్తృతంగా ఉపయోగిస్తారు. అలాగే సింథటిక్ రంగులకు సురక్షితమైన మరియు సహజమైన ప్రత్యామ్నాయంగా కూడా పరిగణించబడుతుంది.


సౌందర్య సాధనాలు: లిప్ స్టిక్, హెయిర్ కలరింగ్ ఉత్పత్తులు, నెయిల్ పాలిష్, సబ్బులు వంటి సౌందర్య సాధనాల్లోనూ దీనిని విరివిగా ఉపయోగిస్తారు.


వస్త్ర పరిశ్రమ: పత్తి, పట్టు వంటి వస్త్రాలకు రంగులు వేయడానికి కూడా ఈ రంగును ఉపయోగిస్తారు.


సాంప్రదాయం: భారతదేశంలో ఈ విత్తనాల నుంచి తయారుచేసిన సిందూరం (కుంకుమ)ను సాంప్రదాయ ఆచారాలు, మతపరమైన కార్యక్రమాలలో ఉపయోగిస్తారు.


ఔషధ ఉపయోగాలు :


శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్: సిందూర్ విత్తనాలలో విటమిన్ సి మరియు కెరోటినాయిడ్లు లాంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో సహాయపడతాయి.


జీర్ణక్రియకు సహాయం: ఇది జీర్ణక్రియను మెరుగు పరచడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది.


చర్మ ఆరోగ్యం: సిందూరం విత్తనాల్లో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి, చిన్న గాయాలు మరియు చర్మ సమస్యలను నయం చేయడానికి ఉపయోగపడతాయి.


జ్వరం, ఇతర వ్యాధులు: సాంప్రదాయ వైద్యంలో.. సిందూరిని జ్వరం, విష పరిస్థితులు, రక్తస్రావం, అధిక దాహం, కామెర్లు, అతిసారం లాంటి అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.


ఇతర ఔషధ లక్షణాలు: యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి.


ఇతర ఉపయోగాలు:


క్రిమి సంహారకం, దోమల నివారణ: విత్తనాల గుజ్జును చర్మానికి రాస్తే దోమలను నివారించవచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.


పశువుల దాణా: విత్తనాల నూనె తీసిన తర్వాత మిగిలిన పదార్థాన్ని పశువుల దాణాగా ఉపయోగిస్తారు.


రసాలు, వంటకాలు: కొన్ని దేశాలలో, దీనిని రసాలు మరియు సాంప్రదాయ వంటకాలలో (ఉదాహరణకు, మెక్సికన్ మరియు బెలిజియన్ వంటకాల్లో) రుచి మరియు రంగు కోసం ఉపయోగిస్తారు.


కొయ్య, తంతువులు: ఈ మొక్క కలపను వంట చెరకుగా, బెరడు నుంచి తంతువులను తాడులు మరియు ఇతర వస్తువులు చేయడానికి ఉపయోగిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa