కెనడా వేదికగా జరుగుతోన్న జీ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం ఆ దేశం చేరుకున్నారు. అల్బర్టా రాష్ట్రంలోని కాననాస్కిస్‌లో G7 శిఖరాగ్ర సదస్సు జరుగుతోన్న విషయం తెలిసిందే. పదేళ్ల తర్వాత కెనడాలో ప్రధాని మోదీ పర్యటించడం ఇదే మొదటిసారి. కెనడా ప్రధాని మార్క్ కార్నీ అధికారిక ఆహ్వానం మేరకు మోదీ ఈ సదస్సుకు హాజరయ్యారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ తొలి అంతర్జాతీయ పర్యటన ఇదే. రెండు రోజుల పాటు జరిగే జీ7 సదస్సు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, మోదీ కెనడాలో అడుగుపెట్టడానికి ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీ7 సదస్సు నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు.
ఇక, కెనడాకు బయలుదేరే ముందు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన ప్రధాని ‘ప్రజల మధ్య బలమైన సంబంధాలు కలిగిన ప్రజాస్వామ్య దేశాలుగా భారత-కెనడాలు పరస్పర గౌరవం, ప్రయోజనాల ఆధారంగా కలిసి పని చేస్తాయి. శిఖరాగ్ర సమావేశంలో మా భేటీ కోసం ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు. భారత్ G7 సభ్య దేశం కాకపోయినా, ప్రధాని మోదీ 2019 నుంచి ఏటా ప్రత్యేక ఆహ్వానం మేరకు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఇది అంతర్జాతీయంగా భారత్‌కు పెరుగుతోన్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది.
జూన్ 2023లో ఖలిస్థానీ హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య తరువాత తొలిసారిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కెనడాలో అడుగుపెట్టారు. ఇది ప్రపంచ రాజకీయాల్లోనూ, భారత-కెనడా సంబంధాల పునర్నిర్మాణ ప్రయత్నాల్లోనూ కీలకంగా మారింది . భారత్ ఉగ్రవాదిగా ప్రకటించిన నిజ్జార్.. బ్రిటిష్ కొలంబియాలో హత్యకు గురయ్యాడు. ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ నాటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ ఏడాది జనవరిలో ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయడం.. ఆయన స్థానంలో కార్నీ బాధ్యతలు చేపట్టడంతో మళ్లీ భారత్-కెనడా సంబంధాలు పునరుద్దరణకు అడుగులు పడ్డాయి. ఈ క్రమంలోనే మోదీని కార్నీ జీ7 సదస్సుకు ఆహ్వానించారు.
మరోవైపు, మోదీ కెనడాకు చేరడానికి కొద్ది గంటల ముందే జీ7 సదస్సు నుంచి డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా వెళ్లిపోయారు. ఆయన తన కెనడా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని అమెరికాకు పయనమయ్యారు. ట్రంప్‌తో మోదీ భేటీ కావాల్సి ఉండగా.. ఆయన మధ్యలో కెనడా పర్యటన ముగించుకున్నారు. ఇజ్రాయేల్, ఇరాన్ మధ్య ఘర్ష తీవ్రరూపం దాల్చడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు కల్లోలంగా ఉన్నాయి. ఇరు దేశాలు క్షిపణులతో దాడులు చేసుకుంటున్నాయి. ఈ యుద్ధం కారణంగా ట్రంప్ తన కెనడా పర్యటనను మధ్యలో ముగించి.. అమెరికాకు చేరుకున్నారు. అక్కడ భద్రతా మండలితో అత్యవసర సమావేశం నిర్వహిస్తారు.
అధ్యక్షుడు ట్రంప్ తన పర్యటనను కుదించుకున్న విషయాన్ని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ తెలిపారు. G7 సదస్సులో ట్రంప్ చర్చలు జరిపారని, యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో ఒప్పందం కూడా చేసుకున్నారని ఆమె చెప్పారు. కానీ, పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఆయన పర్యటనను మధ్యలోనే ముగించి స్వదేశానికి పయనమయ్యారని లీవిట్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం G7 సభ్య దేశాల నేతలతో ట్రంప్ గ్రూప్ ఫోటో దిగారు. ఆ తరువాత ఆయన ఇతర నేతలతో "నేను అత్యవసరంగా తిరిగి వెళ్లాలి. ఇది చాలా ముఖ్యం" అని అన్నారు. ట్రంప్ నిర్ణయం సరైనదేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యానుయేల్ మెక్రాన్ అన్నారు. ఇజ్రాయేల్, ఇరాన్ యుద్ధాన్ని ఆపాలని G7 నేతలు పిలుపునిచ్చారు.
టెహ్రాన్‌లో పేలుళ్లు జరుగుతుండటంతో పరిస్థితి తీవ్రంగా ఉంది. ట్రంప్ అమెరికా రాగానే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆయన భద్రతా సలహాదారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నారు. వైట్‌హౌస్‌లోని సిట్యుయేషన్ రూమ్‌లో సిద్ధంగా ఉండాలని అమెరికా జాతీయ భద్రతా మండలిని ట్రంప్ ఆదేశించారు. ఇరాన్, ఇజ్రాయేల్ ఉద్రిక్తతలపై ఆయన ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.
టెహ్రాన్‌లో ఉన్న పౌరులు వెంటనే ఖాళీ చేయాలని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. దీనిని బట్టి చూస్తే ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అవసరమైతే అమెరికా కూడా నేరుగా దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, భద్రతా మండలి సమావేశం ఫలితాలు ఈ ప్రాంతంలో భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ప్రపంచ దేశాలు సైతం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa