ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్ సుప్రీం నేతను అంతం చేస్తేనే యుద్ధానికి ముగింపు.. నెతన్యాహు

international |  Suryaa Desk  | Published : Tue, Jun 17, 2025, 09:45 PM

ఇరాన్, ఇజ్రాయేల్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఇరు దేశాలూ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఎటునుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని ఇరు దేశాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. యావత్తు ప్రపంచం ఈ ఘర్షణలను నిశితంగా గమనిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయేల్ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. వీలైనంత త్వరగా ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీని అంతం చేస్తేనే యుద్ధం ముగుస్తుందని వ్యాఖ్యానించారు. ఖమేనీ హత్య చేయాలన్న ప్లాన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకించారన్న విషయం అమెరికా అధికారులు ధ్రువీకరించిన మర్నాడే నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


ఇజ్రాయేల్-ఇరాన్ మధ్య ఘర్షణ నాల్గవ రోజులోకి ప్రవేశించిన వేళ..ఇరువైపులా మిసైళ్ల వర్షం కురుస్తోంది. పౌరులను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు జరగడంతో పరిస్థితి చేజారే స్థాయికి వెళ్లిందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయేల్ ప్రభుత్వాలు తమ దేశ పౌరులకు దీర్ఘకాల సంసిద్ధత అవసరమని హెచ్చరికలు జారీ చేశాయి. అయితే, ట్రంప్‌‌ను ఇరాన్‌కు ప్రధాన శత్రువని, అందుకే ఆయనను హత్యచేయడానికి టెహ్రాన్ ప్రయత్నిస్తోందని నెతన్యాహు ఆరోపించిన విషయం తెలిసిందే.


ఏబీసీ ఇంటర్వ్యూలో ఇజ్రాయేల్ ప్లాన్‌ను ట్రంప్ ఎందుకు అంగీకరించలేదన్న ప్రశ్నకు నెతన్యాహు స్పందిస్తూ.. ‘ఇది ఘర్షణను తీవ్రతరం చేయడం కాదు, ముగింపు’ అని సమాధానం ఇచ్చారు. ‘ఇరాన్ ఎప్పటికీ యుద్ధం కొనసాగాలని కోరుకుంటోంది.. వారు మమ్మల్ని అణు యుద్ధపు అంచునకు తీసుకువెళ్తున్నారు.. ఇజ్రాయేల్ చేస్తున్నది దానిని అడ్డుకోవడం, ఈ దాడులను ముగించడం.. ఇది కేవలం చెడు శక్తులను అడ్డుకోవడం ద్వారా మాత్రమే సాధ్యం’ అని ఆయన స్పష్టం చేశారు.


ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యులను సురక్షితంగా ఒక రహస్య బంకర్‌కు తరలించారని సమాచారం. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆయనకు భారీ భద్రత కల్పిస్తున్నారు. సోమవారం రాత్రి వరకూ అయతుల్లా సురక్షితంగా ఉన్నారని, దేశపు రక్షణ చర్యలను పరిశీలిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నారని అధికారులు వెల్లడించారు.


ఇరాన్‌పై వందల కొద్దీ ఫైటర్ జెట్లతో ఇజ్రాయేల్ దాడి.. ఆర్మీ చీఫ్ సహా పలువురు హతం


ఖమేనీ హత్యకు ఇజ్రాయేల్ ప్లాన్‌ను ట్రంప్ వీటో వేశారన్న వార్తను రాయిటర్స్ మొదటిగా ప్రచురించింది. ట్రంప్ యంత్రాంగంలోని ఉన్నతాధికారుల వెల్లడించిన సమాచారం ఆధారంగా కథనం ప్రచురించింది. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీని హత్య చేసే అవకాశం ఉందని అమెరికాకు ఇజ్రాయేల్‌ తెలియజేయగా.. ట్రంప్ ఆ ప్లాన్‌ను ఆపివేశారని వారు చెప్పారు. అయితే, ఈ విషయంపై ట్రంప్ ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, ట్రంప్, నెతన్యాహు మధ్య తరచూ సంభాషణలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.


ఈ అంశంపై ఫాక్స్ న్యూస్‌తో నెతన్యాహు మాట్లాడుతూ.. ‘ఎన్నో తప్పుడు వార్తలు పుట్టుకొస్తుంటాయి.. వాటన్నిటినీ నేను ఖండించలేను’ అని చెప్పారు. ‘కానీ ఒక్క మాట చెప్పగలను. మేము చేయాల్సింది చేస్తాం. అమెరికాకూ తన ప్రయోజనాలు బాగా తెలుసు’ అని నెతన్యాహు అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa