ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్న వయసులోనే జుట్టు ఎక్కువగా రాలుతుందా, నో టెన్షన్

Life style |  Suryaa Desk  | Published : Sat, Jun 21, 2025, 11:37 PM

జుట్టు ప్రతి ఒక్కరి అందంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే, ఈ రోజుల్లో జుట్టు రాలడం, తెల్ల జుట్టు, పొడి బారడం, చుండ్రు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా జుట్టు రాలడం పెద్ద సమస్యగా మారింది. యువతలో కూడా జుట్టు రాలడం ఎక్కువైపోతుంది. జుట్టు రాలడం అనేది చాలా మందిని కలవరపెట్టే ఒక సాధారణ సమస్య. రోజువారీగా కొంత జుట్టు రాలడం సహజం, కానీ అది ఎక్కువగా ఉంటే ఆందోళన కలిగించవచ్చు.


ఇక, జుట్టు రాలడం తగ్గించడం కోసం చాలా మంది అనేక రకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయినా, వీటి వల్ల పెద్ద ఫలితం ఉండటం లేదు. అయితే, జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి మెంతులు అద్భుతమైన సహజసిద్ధమైన పరిష్కారమని పలువురు నిపుణులు అంటున్నారు. మెంతుల్లో ప్రొటీన్లు, నికోటినిక్ యాసిడ్, విటమిన్లు A, K, C, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో జుట్టు పెరుగుదల బాగా ఉంటుంది. జుట్టు రాలడం తగ్గించడం కోసం మెంతుల్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.


మెంతులు, పెరుగు హెయిర్ మాస్క్


ఈ హెయిర్ మాస్క్ జుట్టు రాలడాన్ని తగ్గించడంతో పాటు, సహజమైన కండిషనర్‌గా పనిచేసి.. మృదువుగా, మెరిసేలా చేస్తుంది. ఈ మాస్క్ కోసం ముందుగా 2 టీస్పూన్ల మెంతుల్ని నీటిలో నానబెట్టండి. బాగా నానిన తర్వాత వాటిని పేస్టులా చేసి.. దానికి మూడు టీస్పూన్ల పెరుగు కలపండి. జుట్టు పొడవును బట్టి ఈ పరిమాణాన్ని మార్చుకోవచ్చు. పేస్ట్ సిద్ధమైన తర్వాత, దానిని మీ జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును వాష్ చేసుకోవాలి. ఈ మాస్క్ తలలోని మృత కణాలను తొలగిస్తుంది. అంతేకాకుండా మూలాలకు పోషణను అందిస్తుంది. ఈ హెయిర్ మాస్క్‌ని క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.


మెంతులు, కొబ్బరి నూనె హెయిర్ మాస్క్


ఈ హెయిర్ మాస్క్ కూడా జుట్టు రాలడం తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీన్ని తయారు చేయడానికి, 2 టీస్పూన్ల మెంతుల పొడి, సమాన మొత్తంలో కొద్దిగా వెచ్చని కొబ్బరి నూనె తీసుకొని రెండింటిని కలపండి. పేస్ట్ చల్లబడిన తర్వాత, దానిని జుట్టుకు అప్లై చేసి ఒక గంట పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత నీటితో వాష్ చేసుకోండి. ఈ హెయిర్ మాస్క్‌ను అప్లై చేయడం వల్ల జుట్టు లోతుగా కండిషన్ అవుతుంది. ఇది జుట్టు మూలాలకు పోషణను అందిస్తుంది.


మెంతులు, ఉల్లిపాయ రసం హెయిర్ మాస్క్


ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలకు, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి బెస్ట్ ఆప్షన్. ఇది మెంతులతో కలిపి అద్భుతంగా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉల్లిపాయను తొక్క తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో మెత్తని పేస్ట్‌లా చేయండి. ఉల్లిపాయ పేస్ట్ నుంచి రసాన్ని ఫిల్టర్ చేయండి. నానబెట్టిన మెంతుల్ని మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టండి. మెంతుల పేస్ట్, ఉల్లిపాయ రసాన్ని బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్‌కు బాగా మసాజ్ చేస్తూ పట్టించండి. తర్వాత మిగిలిన మాస్క్‌ను జుట్టు పొడవుకు అప్లై చేయండి. 30-45 నిమిషాలు అలాగే ఉంచండి. తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోండి.


మెంతులు, మందారం హెయిర్ మాస్క్


​మందారం జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి, జుట్టుకు సహజమైన మెరుపు ఇవ్వడానికి పనిచేస్తుంది. ఈ హెయిర్ మాస్క్ కోసం రెండు టేబుల్ స్పూన్ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం, నానబెట్టిన మెంతులు, మందారం ఆకులు లేదా పువ్వులను కొద్దిగా నీరు లేదా కొబ్బరి పాలు కలిపి మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టండి. ఈ పేస్ట్‌ను స్కాల్ప్‌కు, జుట్టుకు బాగా పట్టించండి. 20-30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. గోరువెచ్చని నీటితో కడిగి, తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి. వారానికి ఒకసారి అప్లై చేయవచ్చు.


మెంతులు, కరివేపాకు హెయిర్ మాస్క్


కరివేపాకు జుట్టు తెల్లబడకుండా, జుట్టు రాలకుండా కాపాడుతుంది. మెంతులతో కలిపి మంచి ఫలితాలను ఇస్తుంది. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ మెంతులు, గుప్పెడు కరివేపాకులు అవసరం. మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం, నానబెట్టిన మెంతులు, కరివేపాకు ఆకుల్ని కొద్దిగా నీటితో కలిపి మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టండి. ఈ మాస్క్‌ను స్కాల్ప్‌కు, జుట్టుకు అప్లై చేయండి. సుమారు 1 గంట పాటు అలాగే ఉంచండి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ఈ హెయిర్ మాస్క్ చుండ్రు నివారణ, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.


ఈ విషయాలు ముఖ్యం


* మెంతుల్ని నానబెట్టిన నీటిని పారవేయకుండా, స్ప్రే బాటిల్‌లో నింపి తలస్నానం చేసిన తర్వాత లేదా మామూలుగా జుట్టుకు స్ప్రే చేయవచ్చు. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.


* ఉత్తమ ఫలితాల కోసం, ఈ మాస్క్‌లను వారానికి ఒకసారి లేదా రెండుసార్లు క్రమం తప్పకుండా ఉపయోగించండి.


* హెయిర్ మాస్క్ అప్లై చేసేటప్పుడు లేదా వాష్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త. జుట్టును గట్టిగా లాగడం మానుకోండి.


* జుట్టు రాలడం తీవ్రంగా ఉంటే హెయిర్ స్పెషలిస్ట్ లేదా వైద్యుణ్ని సంప్రదించి తగిన సలహాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa