వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ.. తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంటోంది. ప్రతీ ఏడాది శీతాకాలంలో ఢిల్లీలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయో మనందరం చూస్తూనే ఉన్నాం. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టినా అవి సఫలం కావడం లేదు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ తొలిస్థానంలో ఉందంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ .. తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీ నుంచి.. ఢిల్లీలో 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు.. పెట్రోల్ పంపుల వద్ద ఇంధనం నింపడాన్ని నిషేధించనున్నట్లు ప్రకటించింది. ఇక ఇలాంటి వాహనాలను గుర్తించేందుకు.. పెట్రోల్ బంకుల్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను వినియోగించనున్నారు.
అయితే ఈ రూల్ దశలవారిగా ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో విస్తరించనున్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ్ నగర్, సోనిపట్ వంటి ప్రాంతాల్లోనూ ఇదే రూల్ తీసుకురానున్నారు. ఆ తర్వాత 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి మిగిలిన ఎన్‌సీఆర్ పరిధి అంతటా ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్.. సభ్యుడు డాక్టర్ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ.. ఢిల్లీలోని 500 పెట్రోల్ బంకుల్లో ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కెమెరాల ద్వారా వాహనాల సమాచారాన్ని రియల్ టైమ్‌లో ట్రాక్ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు.. ఈ కెమెరాలు మొత్తంగా 3.63 కోట్ల వాహనాలను స్క్రీనింగ్ చేయగా.. అందులో 4.90 లక్షల వాహనాలు తమ లైఫ్ టైమ్ పూర్తి చేసుకున్నాయని పేర్కొన్నారు. 29.52 లక్షల వాహనాలు తమ పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్‌లను.. మళ్లీ పునరుద్ధరించుకున్నాయని.. వాటి ద్వారా రూ.168 కోట్ల మేర చలాన్లు జారీ అయినట్లు వెల్లడించారు.
ఇక ఈ నిబంధనను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు.. ఢిల్లీ రవాణా శాఖ 100 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. వాహనాల డేటాను పర్యవేక్షించడం, ఎక్కువ సంఖ్యలో పాత వాహనాలు వచ్చే పెట్రోల్ బంకులను గుర్తించడం, నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ఈ బృందాలు పనిచేయనున్నాయి. ఢిల్లీ, ఎన్‌సీఆర్ పరిధిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు.. పాత వాహనాలను తొలగించడం చాలా ముఖ్యమని తెలిపారు. ఈ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి టోల్ ప్లాజాల వద్ద కూడా ఉపయోగిస్తారు.
వాహనాలు పెట్రోల్ బంకులోకి ప్రవేశించిన వెంటనే వాటి నంబర్ ప్లేట్‌లను ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ వ్యవస్థ గుర్తిస్తుంది. అనంతరం అది రవాణా శాఖ డేటాబేస్ నుంచి దాని రిజిస్ట్రేషన్ వివరాలు, ఇంధనం రకం, వాహనం వయసు వంటి సమాచారాన్ని సేకరిస్తుంది. ఒక వేళ అది 15 ఏళ్లు దాటిన పెట్రోల్, 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనం అయితే.. అందులో ఇంధనం పోయొద్దని.. సదరు పెట్రోల్ బంకుకు హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆ తర్వాత ఆ సమాచారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు పంపిస్తుంది. ఆ తర్వాత అధికారులు రంగంలోకి దిగి వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం లేదా స్క్రాప్ చేయడం వంటి తదుపరి చర్యలు తీసుకుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa