ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి మద్దతు తెలిపారు. నెతన్యాహుపై ప్రస్తుతం కొనసాగుతున్న విచారణను తక్షణమే రద్దు చేయాలని లేదా ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించాలని ఇజ్రాయెల్ అధికారులను ట్రంప్ కోరారు. ఈ ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని, అన్యాయమైనవని ఆయన పేర్కొన్నారు.ఇరాన్‌పై ఇటీవల జరిగిన దాడిని ఇజ్రాయెల్ చరిత్రలోనే అత్యంత గొప్ప విజయాల్లో ఒకటిగా డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. అటువంటి సమయంలో కూడా నెతన్యాహుపై విచారణ కొనసాగించడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో ఒక సుదీర్ఘ పోస్ట్‌లో పేర్కొన్నారు. నెతన్యాహు నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, ఇరాన్‌తో ఇజ్రాయెల్ చేస్తున్న మనుగడ పోరాటంలో ఆయనొక యోధుడు అని కొనియాడారు. "ఇజ్రాయెల్ చరిత్రలోనే అత్యంత గొప్ప విజయాల్లో ఒకదాన్ని అందుకుని, నెతన్యాహు సారథ్యంలో బలంగా ఉన్నప్పటికీ.. తమ గొప్ప యుద్ధకాల ప్రధానిపై ఈ హాస్యాస్పదమైన వేటను కొనసాగించడం విని నేను షాక్ అయ్యాను!" అని ట్రంప్ రాసుకొచ్చారు. ఇజ్రాయెల్ చిరకాల శత్రువు, చాలా కఠినమైన, తెలివైన ఇరాన్‌తో పోరాడుతూ నేను, నెతన్యాహు కలిసి నరకాన్ని చూశాం. ఆ పవిత్ర భూమిపై ప్రేమ విషయంలో ఆయన ఇంతకంటే గొప్పగా, చురుగ్గా, బలంగా ఉండలేరు. మరెవరైనా అయితే నష్టాలు, అవమానాలు, గందరగోళం ఎదుర్కొనేవారు! బహుశా ఇజ్రాయెల్ చరిత్రలో మరే యోధుడు లేనంతటి యోధుడు నెతన్యాహు" అని ట్రంప్ పేర్కొన్నారు.నెతన్యాహు నాయకత్వం వల్లే ఇరాన్ నుంచి పొంచి ఉన్న భారీ అణు ముప్పు తొలగిపోయిందని ట్రంప్ తెలిపారు. "ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధాల్లో ఒకటిగా మారే ప్రమాదం ఉన్నదాన్ని పూర్తిగా నిర్మూలించడం.. అదీ త్వరలోనే జరగబోయేదాన్ని.. ఎవరూ ఊహించని రీతిలో సాధించాం" అని ఆయన అన్నారు.రాజకీయ దురుద్దేశాలతోనే ఇజ్రాయెల్ న్యాయవ్యవస్థ నెతన్యాహును విచారిస్తోందని ట్రంప్ విమర్శించారు. ఈ కేసును ఒక భయానక ప్రదర్శనగా ఆయన అభివర్ణించారు. 2020 నుంచి విచారణ ఎదుర్కొంటున్న నెతన్యాహుపై ఖరీదైన సిగార్లు, షాంపేన్ వంటి బహుమతులు పొందారని, అనుకూల వార్తల కోసం మీడియా సంస్థల అధిపతులకు రెగ్యులేటరీ ప్రయోజనాలు కల్పించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ ఆరోపణలు చాలా చిన్నవని, అర్థరహితమైనవని ట్రంప్ కొట్టిపారేశారు."సిగార్లు, ఒక బగ్స్ బన్నీ బొమ్మ, ఇంకా అనేక అన్యాయమైన ఆరోపణలకు సంబంధించిన ఈ దీర్ఘకాల రాజకీయ ప్రేరేపిత కేసు విచారణ కొనసాగింపు కోసం నెతన్యాహును సోమవారం కోర్టుకు పిలిపించారని ఇప్పుడే తెలిసింది. ఇది ఆయనకు తీవ్ర హాని తలపెట్టడానికే" అని ట్రంప్ తన పోస్ట్‌లో రాశారు. ఇంత సేవ చేసిన వ్యక్తిపై ఇలాంటి వేటను నేను ఊహించలేను అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నెతన్యాహు విచారణను వెంటనే రద్దు చేయాలి లేదా క్షమాభిక్ష ప్రసాదించాలి అని ఈ సందర్భంగా ట్రంప్ డిమాండ్ చేశారు.అమెరికా, ఇజ్రాయెల్ మధ్య బలమైన సంబంధాలున్నాయని ట్రంప్ మరోసారి నొక్కి చెప్పారు. గతంలో వాషింగ్టన్ ఇజ్రాయెల్‌కు సహాయం చేసిందని, ఇప్పుడు నెతన్యాహుకు అండగా నిలుస్తుందని ఆయన ప్రకటించారు. "బహుశా అమెరికా అధ్యక్షుడైన నాతో ఇంతటి సమన్వయంతో పనిచేసిన వ్యక్తి నెతన్యాహు తప్ప నాకు తెలిసినంతలో మరొకరు లేరు. ఇజ్రాయెల్‌ను కాపాడింది అమెరికానే, ఆయనను కాపాడబోయేది కూడా అమెరికానే" అని ట్రంప్ స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa