ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బయటకు చెప్పాలంటే భయపడుతున్నారు.. ట్రంప్ అమెరికన్ల నోరు కుట్టేస్తున్నారా

international |  Suryaa Desk  | Published : Sat, Jun 28, 2025, 10:15 PM

అమెరికా రాజ్యాంగంలోని మొదటి సవరణ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను బలంగా రక్షిస్తుంది. ఇది ప్రభుత్వం.. ప్రజల ప్రసంగాలను లేదా అభిప్రాయాలను నియంత్రించకుండా నిరోధిస్తుంది. ఈ హక్కులో కేవలం మాట్లాడటం మాత్రమే కాకుండా, రాయడం, తమ అభిప్రాయాలను పంచుకోవడం, నిరసన ప్రదర్శనలు చేయడం వంటివి కూడా ఉంటాయి. వాక్ స్వాతంత్ర్యానికి ప్రతీకగా భావించే అమెరికాలోనూ, స్వీయ-నియంత్రణ గణనీయంగా పెరుగుతోందని ఇటీవల సర్వేలు వెల్లడిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో భావప్రకటనా స్వేచ్ఛపై దాడులు పెరిగాయని, ఇది ప్రజల్లో భయాన్ని సృష్టిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.


అమెరికాలో పెరుగుతున్న రాజకీయ సమీకరణ, సామాజిక వ్యతిరేకతకు భయపడి ప్రజలు రాజకీయ అంశాలపై తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడానికి వెనకడుగు వేస్తున్నారు. ఇటీవలి పరిశోధనల ప్రకారం, దాదాపు సగం మంది అమెరికన్లు గతంలో కంటే ఇప్పుడు రాజకీయ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయలేకపోతున్నామని చెబుతున్నారు.


'స్పైరల్ ఆఫ్ సైలెన్స్' థియరీ


"స్పైరల్ ఆఫ్ సైలెన్స్" సిద్ధాంతం ప్రకారం, ఒక వ్యక్తి అభిప్రాయం చెప్పాలనుకున్నప్పుడు.. ప్రజాభిప్రాయం గురించి కూడా ఆలోచిస్తాడు. తన అభిప్రాయం వ్యక్తం చేస్తే.. విమర్శలు వస్తాయని, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని చాలా మంది అనుకుంటాడు. అలాగే ప్రస్తుతం అమెరికాలోనూ.. తాము వ్యక్తం చేసిన అభిప్రాయాలు నచ్చని వారు.. తీవ్రమైన విమర్శలకు దిగడం, వ్యక్తిగత విమర్శలు చేయడం వంటివి చేస్తున్నందున అమెరికన్లు స్వీయ-నియంత్రణ పాటిస్తూ తమ నోరును కుట్టేసుకుంటున్నారు.


భయం వెనుక కారణాలు


ఈ స్వీయ-నియంత్రణకు.. తమ అభిప్రాయం వ్యక్తం చేస్తే.. ప్రభుత్వ అణచివేత గురవుతామన్న భయం కంటే స్నేహితులు, కుటుంబం, సహోద్యోగుల నుంచి దూరం అవుతామనే భయమే ప్రధాన కారణమని పరిశోధనలు సూచిస్తున్నాయి. సోషల్ మీడియా పెరుగుదల, రాజకీయ విభేదాలు ఈ భయాలను మరింత పెంచాయి. సోషల్ మీడియా రాకతో, వ్యక్తిగత అభిప్రాయాలు తరచుగా దూషణలు, విమర్శలకు గురవుతున్నాయి. దీనివల్ల చాలా మంది మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారు.


ఇజ్రాయెల్-గాజా యుద్ధం, "వొకిజం" (సామాజిక అన్యాయాల ముఖ్యంగా జాతి, లింగం, సామాజిక అసమానతలకు సంబంధించిన అవగాహనను కల్పించడానికి ఉపయోగించే పదం)కు జరుగుతున్న ఉద్యమాలు చేస్తున్నారు. ఈ సందర్భాల్లో కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు.. ఉద్యమకారులను శిక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కారణంగా ప్రజలు బహిరంగంగా మాట్లాడేందుకు సంకోచిస్తున్నారు. తమ అభిప్రాయాలు అన్‌పాపులర్ అయితే, సామాజికంగా ఒంటరి అవుతామనే భయంతో కూడా చాలా మంది మౌనంగా ఉంటున్నారు.


విద్యావేత్తలపైనా ప్రభావం


ఈ ప్రభావం సామాన్య ప్రజలకే పరిమితం కాలేదు. విద్యావేత్తలు సైతం వేధింపులు, రాజకీయ పర్యవసానాలకు భయపడి తమ పరిశోధనలు, బోధన, బహిరంగ సంభాషణలలో స్వీయ-నియంత్రణ పాటిస్తున్నారు. ఒక సర్వేలో.. దాదాపు మూడింట రెండు వంతుల మంది రాజకీయాల కారణంగా కొన్ని కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని తేలింది.


అంతేకాకుండా మీడియాపై కూడా ట్రంప్ ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ప్రెస్ ఏజెన్సీలపై చట్టపరమైన చర్యల తీసుకుంటామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2025లో వైట్‌హౌస్‌లో అసోసియేటెడ్ ప్రెస్‌ను నిరవధికంగా నిషేధించడం ఇందుకు నిదర్శనం. అంతేకాకుండా ఆన్‌లైన్ వాక్ స్వాతంత్ర్యాన్ని ఎలా నియంత్రించాలనే అమెరికా ప్రయత్నాలకు కూడా వ్యతిరేకత ఎదురవుతోంది. యూరప్‌లోని కఠినమైన నియంత్రణ నమూనాలకు (కఠినమైన చట్టాలు) భిన్నంగా, మొదటి సవరణలో పొందుపర్చిన పౌరుల స్వేచ్ఛలను కాపాడాలని చాలా మంది అమెరికన్ న్యాయవాదులు కోరుతున్నారు. ఇదివరకు ప్రభుత్వం ప్రతిపాదించిన కిడ్స్ ఆన్‌లైన్ సేఫ్టీ యాక్ట్ వంటి చట్టాలు ఆన్‌లైన్ భద్రత, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మధ్య సమతుల్యంపై చర్చలను లేవనెత్తాయి.


ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారుతోంని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భిన్నాభిప్రాయాలు లేనప్పుడు, సమాజంలో ఆరోగ్యకరమైన చర్చ జరగదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరుస్తుందని చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత తీవ్రం కాకుండా ఉండాలంటే, ప్రజలు ఎలాంటి భయం లేకుండా తమ అభిప్రాయాలను గౌరవప్రదంగా వ్యక్తం చేసే వాతావరణాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa