ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పట్టు కోల్పోతున్నారని నిఘా వర్గాల వెల్లడి

international |  Suryaa Desk  | Published : Wed, Jul 02, 2025, 09:38 AM

చైనా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తోంది. దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ క్రమంగా తన అధికారాన్ని, పట్టును కోల్పోతున్నారని, ఆయనను వ్యూహాత్మకంగా పక్కనపెట్టే ప్రక్రియ మొదలైందని అగ్రశ్రేణి నిఘా వర్గాలు సంచలన విషయాలు వెల్లడించాయి. దేశంలోని అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చైనా ఎప్పటిలాగే భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడే ప్రమాదం ఉందని ఈ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.నిఘా వర్గాల సమాచారం ప్రకారం చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ లో జిన్‌పింగ్ సిద్ధాంతపరమైన పట్టు బలహీనపడుతోంది. ఈ ఏడాది మే 21 నుంచి జూన్ 5 వరకు ఆయన ప్రజా జీవితానికి దూరంగా ఉండటం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. అయితే, చైనాలో శక్తిమంతమైన నేతల ప్రాధాన్యం తగ్గించి, కేవలం ఉత్సవ విగ్రహాలుగా మార్చడం కొత్తేమీ కాదని నిఘా వర్గాలు గుర్తుచేస్తున్నాయి. గతంలోనూ ముగ్గురు కీలక నేతల విషయంలో సీసీపీ ఇదే విధానాన్ని అనుసరించిందని వారు తెలిపారు.ప్రస్తుతం దేశంలో నిజమైన అధికారం సెంట్రల్ మిలటరీ కమిషన్  మొదటి వైస్ చైర్మన్ అయిన జనరల్ జాంగ్ యోక్సియా చేతుల్లో ఉందని తెలుస్తోంది. మాజీ అధ్యక్షుడు హు జింటావో వర్గానికి చెందిన సీనియర్ల మద్దతు జాంగ్‌కు పుష్కలంగా ఉంది. సైన్యం, ఆర్థిక వ్యవస్థ, పార్టీ సిద్ధాంతాలపై జిన్‌పింగ్ ఆధిపత్యం తగ్గుతోందని చెప్పడానికి, ఆయనకు విధేయులైన పలువురు ఆర్మీ జనరళ్లను పదవుల నుంచి తొలగించడం లేదా పక్కనపెట్టడమే నిదర్శనమని నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రభుత్వ నియంత్రణలోని మీడియాలో ‘జిన్‌పింగ్ ఆలోచనా విధానం’ ప్రస్తావన తగ్గడం కూడా ఈ మార్పును సూచిస్తోంది.జిన్‌పింగ్ స్థానంలో సంస్కరణలకు మద్దతిచ్చే టెక్నోక్రాట్ నేతగా వాంగ్ యాంగ్‌ను భవిష్యత్ నాయకుడిగా తీర్చిదిద్దుతున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. చైనాలో నాయకత్వ మార్పులు నేరుగా తొలగింపుల రూపంలో కాకుండా, ప్రాధాన్యం తగ్గించడం ద్వారానే జరుగుతాయని వారు వివరిస్తున్నారు.చైనా ఎప్పుడు అంతర్గత సంక్షోభంలో చిక్కుకున్నా, తన పొరుగు దేశాలపై, ముఖ్యంగా భారత్‌పై దుందుడుకుగా ప్రవర్తిస్తుందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దేశంలో 15 శాతానికి చేరిన నిరుద్యోగిత, స్తంభించిన రియల్ ఎస్టేట్ రంగం, సెమీకండక్టర్ల తయారీలో వైఫల్యాలు వంటి ఆర్థిక సమస్యలతో చైనా సతమతమవుతోంది. ఈ సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు భారత్‌తో సరిహద్దు వివాదాలను ఆ దేశం ఎగదోసే అవకాశం ఉంది.2024 చివరి నుంచి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ  వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌లో పలుమార్లు మార్పులు జరిగాయి. క్షేత్రస్థాయి కమాండర్లు తమ విధేయతను నిరూపించుకోవడానికి అరుణాచల్ ప్రదేశ్, లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ  వెంబడి ఉద్రిక్తతలను పెంచవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2020లో కరోనా సంక్షోభం సమయంలో లడఖ్‌లో, 2012లో బో జిలాయ్ రాజకీయ సంక్షోభం సమయంలో దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడుగా వ్యవహరించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.ఇదే తరహాలో ఇప్పుడు కూడా భారత్‌లోని మౌలిక సదుపాయాలపై సైబర్ దాడులు తీవ్రతరం చేయడం, దేశ అంతర్గత సమస్యలను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారాలు చేయడం వంటి చర్యలకు చైనా పాల్పడవచ్చు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత ప్రవేశానికి అడ్డుపుల్ల వేయడం, హిందూ మహాసముద్రంలో నౌకాదళ కార్యకలాపాలను పెంచడం ద్వారా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయవచ్చని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa