ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. వారి పూర్వీకుల జీవిత ప్రస్థానం ధైర్య సాహసాలతో కూడుకున్నదని, వారు ఎదుర్కొన్న కష్టాలు ఎవరినైనా కుంగదీసేవని అన్నారు. అయినా వాటన్నింటినీ ఆశతో, పట్టుదలతో ఎదుర్కొన్నారని కొనియాడారు. "మీ పూర్వీకులు గంగ, యమునలను విడిచిపెట్టినా, తమ హృదయాల్లో రామాయణాన్ని మోసుకొచ్చారు. పుట్టిన గడ్డను వదిలినా, తమ ఆత్మను వదులుకోలేదు" అని మోదీ భావోద్వేగంగా అన్నారు.వారు కేవలం వలసదారులు కాదని, శాశ్వతమైన భారత నాగరికతకు రాయబారులుగా నిలిచారని ప్రధాని ప్రశంసించారు. ట్రినిడాడ్ సాంస్కృతిక, ఆర్థిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి భారత సంతతి చేసిన సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు. ఈ దేశ తొలి మహిళా ప్రధానిగా కమలా ప్రసాద్-బిస్సెసార్, అధ్యక్షురాలిగా క్రిస్టీన్ కార్లా కంగాలూ, రైతుబిడ్డ నుంచి ప్రధానిగా ఎదిగిన బసదేవ్ పాండే వంటి ఎందరో ప్రముఖులను ఆయన గుర్తు చేసుకున్నారు. "గిర్మిటియాల వారసులుగా ఉన్న మీరు ఇప్పుడు మీ విజయాలు, సేవలతో గుర్తింపు పొందారు. బహుశా ఇక్కడి 'డబుల్స్', 'దాల్ పూరీ'లోనే ఏదో మ్యాజిక్ ఉందేమో, ఎందుకంటే మీరు ఈ దేశ విజయాన్ని రెట్టింపు చేశారు" అని మోదీ చమత్కరించారు.భారత్, ట్రినిడాడ్ మధ్య బంధం తరాలు, భౌగోళిక సరిహద్దులకు అతీతమైనదని మోదీ అన్నారు. ఇక్కడి వీధులకు బెనారస్, పాట్నా, కోల్కతా వంటి భారత నగరాల పేర్లు ఉండటం, నవరాత్రి, మహాశివరాత్రి వంటి పండుగలను ఉత్సాహంగా జరుపుకోవడం ఈ బంధానికి నిదర్శనమని చెప్పారు. ఒకప్పుడు లారా ఆటను ఆస్వాదించామని, ఇప్పుడు సునీల్ నరైన్, నికోలస్ పూరన్ మన యువతలో అదే ఉత్సాహాన్ని నింపుతున్నారని క్రికెట్ బంధాన్ని గుర్తుచేశారు.అంతకుముందు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ట్రినిడాడ్ ప్రధాని కమలా ప్రసాద్-బిస్సెసార్, కేబినెట్ మంత్రులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa