అదృష్టం.. దురదృష్టం.. రెండే అక్షరాలు తేడా.. కానీ ఓ జీవితాన్ని మార్చే శక్తి వాటికి ఉంది. తనకంటూ రాసుంటే.. తలుపులు అన్నీ బిగించుకుని కూర్చున్నా సరే. అదృష్ట దేవత కిటికీలో నుంచి దూరొచ్చి మరీ హాయ్ చెప్తుంది. అదే మనకు బ్యాడ్ లక్ నడుస్తుంటే.. ఏం చేయకుండా ఇంట్లో కూర్చున్నా సరే జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. అలా రేపటిరోజున తనకు అదృష్టం పట్టకపోతుందా.. తన రాత మారకపోతుందా అని నమ్మేవారిలో సగటు మధ్యతరగతి జీవులే ఎక్కువగా ఉంటారు. ఆశ, నిరాశ, అదృష్టం, దురదృష్టం.. వీటి మధ్య వేలాడుతూ ఉండే వర్గమేదైనా ఉందంటే.. అది మధ్యతరగతి వర్గమే. అలాంటి ఓ మధ్యతరగతి జీవికి అనుకోకుండా ఓ రోజు అదృష్టదేవత హాయ్ చెప్పింది. దీంతో కూలీ కాస్తా లక్షాధికారిగా మారబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. జాతకాలు, సుడి, అదృష్టం వంటి అంశాలను బలంగా నమ్మే ప్రాంతం ఒకటుంది. అదే రాయలసీమలోని కర్నూలు జిల్లా. ఈ ప్రాంతవాసులు తొలకరి చినుకులు పడే కాలం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. చినుకులు పడితే సేద్యపు పనులు మొదలుపెడదామనేది ఒక కారణమైతే.. ఒక్క క్షణం మనదైతే చాలు తలరాత మారకపోతుందా అనేది మరో ఆశ. ఎందుకంటే తొలకలి చినుకులు పడే కాలం వస్తే చాలు.. ఇక్కడ వజ్రాలవేట మొదలైపోతుంది.
కంటికి కనిపించని ఆశతో.. మట్టిలో మెరిసే ఆ వజ్రం కోసం వెతుకుతూ ఎంతో మంది ఇక్కడకు వస్తుంటారు. వజ్రాల కోసం రేయింబవళ్లు గాలిస్తుంటారు. కానీ ముందే అనుకున్నట్లు మనకంటూ రాసుంటే.. అదే మన ఒళ్లో వచ్చి వాలుతుందని. అలా ఎంతో మంది వజ్రాల కోసం వేట సాగిస్తున్నా దొరకని వజ్రం.. ఓ కూలీకి దొరికింది. దీంతో ఆ కూలీ రాత మారబోతోంది.
కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పెండేగల్లులో భారీ వజ్రం దొరికినట్లు తెలిసింది. పొలం పనులు చేస్తున్న ఓ మహిళా కూలీకి 15 క్యారెట్ల బరువైన వజ్రం దొరికింది. పొలం పనులు చేస్తున్న సమయంలో మట్టిలో మెరుస్తూ ఓ రాయి కనిపించింది. ఏంటా అని చూస్తే.. అది వజ్రం. దీంత ఆ కూలీ పంట పండింది. వజ్రం దొరికిన విషయం తెలిసీ.. ఈ వజ్రం కోసం అప్పుడే బేరసారాలు కూడా మొదలైనట్లు సమాచారం. అయితే బేరం కుదరకపోవటంతో ఆ కూలీ.. వ్యాపారికి అమ్మకుండా వజ్రాన్ని తన వద్దే ఉంచుకున్నట్లు తెలిసింది. వ్యాపారి వజ్రాన్ని రూ.10 లక్షలకు ఇవ్వాలని కోరితే.. ఆ కూలీ రూ.50 లక్షలు చెప్తున్నట్లు తెలిసింది. ఈ వార్త ఇప్పుడు తుగ్గలి మండలంలో హాట్ టాపిక్‌గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa