దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా రెండో రోజు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం సాయంత్రం రిక్టర్ స్కేల్‌పై 3.7 తీవ్రతతో భూప్రకంపలు నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. గురువారం కూడా ఢిల్లీలో 4.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. తాజా భూకంప కేంద్రాన్ని హర్యానాలోని ఝజ్జర్‌లో గుర్తించారు. గురువారం నాటి భూకంప కేంద్రం కూడా ఇక్కడే ఉండటం గమనార్హం. ‘‘శుక్రవారం రాత్రి 7.49 గంటలకు 3.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.. హర్యానాలోని ఝజ్జర్‌లో భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉంది’’ అని ఎన్సీఎస్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 17న కూడా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్‌పై 4 తీవ్రతతో భూకంపం వచ్చింది. తూర్పు ఢిల్లీకి 9 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం 5 కిలోమీటర్ల లోతున ఉన్నట్టు గుర్తించారు. భూప్రకంపనలతో వణికిపోయిన ఢిల్లీవాసులు.. భయపడి వీధుల్లోకి పరుగులు తీశారు. ఇక, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం.. ఢిల్లీ భూకంపాల జోన్ 4లో ఉంది. జోన్ 4 అంటే భూకంపాల ముప్పు అధికం. ఈ ప్రాంతంలో మధ్యస్థ నుంచి భారీ భూకంపాలు సంభవించే అవకాశాలు ఉంటాయి.
దేశ రాజధాని ఢిల్లీ భూకంపాలకు ప్రభావితమయ్యే ప్రాంతాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. ఇది హిమాలయ పర్వత పరిధికి సమీపంగా ఉండటంతో, భూకంప ప్రకంపనలు రావడం అత్యంత సాధారణం. ఇండియా-యూరేషియా టెక్టోనిక్ ప్లేట్ల తాకిడి వల్ల ఈ ప్రాంతం భూకంపపరంగా అత్యంత క్రియాశీలకంగా మారింది. ఇటీవల ఢిల్లీ ప్రాంతానికి సమీపంలోని ఝజ్జర్, రోహతక్ (హర్యానా) వంటి స్థానిక కేంద్రాల నుంచి వచ్చిన ప్రకంపనలతో పాటు, హిమాచల్ ప్రదేశ్, నేపాల్, అఫ్గనిస్థాన్ వంటి దూర ప్రాంతాల భూకంపాల ప్రభావం కూడా ఢిల్లీపై ఉన్న సందర్భాలు ఉన్నాయి.
ఢిల్లీ నగరంలో అత్యధిక జనసాంద్రత, అనియంత్రిత నిర్మాణాలు, పాడుపడిన వసతులు, బలహీన మౌలిక సదుపాయాలు ఈ భూకంప ప్రమాదాన్ని మరింత తీవ్రమయ్యేలా చేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాత ఢిల్లీ ప్రాంతాలు, స్వతంత్రంగా నిర్మించిన అప్రమాణిక భవనాలు, భూకంప నిరోధక నిర్మాణ నిబంధనలను పాటించని కట్టడాలకు ముప్పు అధికంగా ఉంది. ‘‘ఢిల్లీ పెద్దగా భూకంప కేంద్రంగా మారకపోయినా, సమీప ప్రాంతాలలో జరిగే ప్రకంపనలు నగరాన్ని గణనీయంగా ప్రభావితం చేయగలవు. అందువల్ల భవన నిర్మాణ నిబంధనలు, భూకంప మౌలిక సదుపాయాలను అత్యవసరంగా పటిష్టపరచాలి’’ అని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. నగర నిర్మాణంలో వ్యవస్థాపిత నిర్లక్ష్యం, జనసాంద్రత, పాత బహుళ అంతస్తుల భవనాలు వంటివి ఘోర విపత్తుగా మార్చే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa