ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిరియా ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్‌ దాడి

international |  Suryaa Desk  | Published : Thu, Jul 17, 2025, 08:11 PM

రెండు తెగల మధ్య సాయుధ ఘర్షణలతో సిరియాలోని స్వైదా ప్రావిన్సు అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో రాజధాని డమాస్కస్‌లోని సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ సైన్యం బుధవారం రాత్రి వైమానికి దాడి చేసింది. సిరియా రక్షణ మంత్రిత్వ శాఖ సమీపంలోని సైనిక ప్రధాన కేంద్రంపై నేరుగా వైమానిక దాడిని జరిపింది. ఈ దాడిలో సైనిక కార్యాలయం ప్రధాన ద్వారం పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడిని ధ్రువీకరించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్.. ద్రూజ్ పౌరులపై సిరియా సర్కారు చేస్తున్న దురాగతాలకు ప్రతీకార చర్యగా పేర్కొంది. ‘‘రాజకీయ స్థాయి ఆదేశాల మేరకు చర్యలు కొనసాగుతున్నాయి. అవసరమైన అన్ని అవకాశాలను మేము పరిశీలిస్తున్నాం’’ అని ఐడీఎఫ్ స్పష్టం చేసింది.


స్వైదా ఘర్షణలు


స్వైదా ప్రావిన్స్‌లో స్థానిక ద్రూజ్ మిలీషియా, సిరియా ప్రభుత్వ బలగాల మధ్య చెలరేగిన ఘర్షణలు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం రద్దుకావడంతో మరింత హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా ద్రూజ్ సామాజిక వర్గంపై హింస పెరిగింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకూ 250 మంది మృతి చెందారు. వందల మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ద్రూజ్ ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. దీనికి తోడు తమ సరిహద్దులకు సమీపంలో ఇస్లామిక్ మిలీషియా గ్రూప్‌ల మళ్లీ కార్యకలాపాలు చురుగ్గా సాగించడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం అప్రమత్తమైంది.


సిరియాలో రెండు దశాబ్దాలకుపైగా కొనసాగిన అంతర్యుద్దం 2024 డిసెంబరులో బషర్ అల్ అసద్ పదవి నుంచి దిగిపోవడంతో ముగిసింది. సున్నీ ఆధిక్య ప్రభుత్వం ఇప్పుడు సిరియాను పాలిస్తున్నప్పటికీ, మైనారిటీ వర్గాలు, అసద్ అనుచరుల నుంచి నిరంతర వ్యతిరేకత ఎదురవుతోంది. వీటిలో ద్రూజ్ సమూహం తెరపైకి వచ్చింది.


ఇటీవల ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ.. సిరియా సైనిక బలగాలు వెనక్కు వెళ్లే వరకు వైమానిక దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ కూడా ఉత్తర సరిహద్దుల్లో పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందంటూ ద్రూజ్ వర్గం రక్షణకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. కాగా, సిరియాలో తిరుగుబాటుదారులను అసద్ కుటుంబం చిత్రహింసలకు గురిచేసి.. అత్యంత దారుణంగా వ్యవహరించిన ఘటనలు అతడు దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత వెలుగులోకి వచ్చాయి. మాజీ అధ్యక్షుడు అసద్ తన పెంపుడు సింహానికి ఖైదీలను ఆహారంగా వేశాడు.


ఎవరీ ద్రూజ్ సముదాయం?


సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్ ప్రాంతాల్లో విస్తరించిన ప్రత్యేక మత సామాజిక వర్గం ద్రూజ్. ప్రస్తుతం సిరియాలో అస్థిరతతో రెండు వర్గాలుగా విడిపోయాయి. ఓ వర్గం కొత్త ప్రభుత్వం పాలనలో ఏకీకరణకు అనుకూలంగా ఉన్నా.. ఇంకో వర్గం స్వయంపాలన కోరుకుంటోంది. స్వైదాలో సిరియా సైన్యం, స్థానిక మిలీషియా మధ్య ఘర్షణలు ఉధృతం కావడంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. యూకే కేంద్రంగా పనిచేస్తున్న సిరియన్ అబ్జర్వేటరీ హ్యూమన్ రైట్స్ ప్రకారం.. ఇప్పటివరకు 250 మంది వరకు మృతి చెందగా, వారిలో 21 మందిని కాల్చిచంపినట్టు ఆరోపణలు వచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa