ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిన్న సాయంత్రం ఏదో జరిగింది..: దన్ఖడ్ రాజీనామాపై జైరాం రమేష్

national |  Suryaa Desk  | Published : Tue, Jul 22, 2025, 10:33 PM

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ రాజీనామాకు ఆరోగ్య బాగాలేకపోవడమే కారణం అంటూ కేంద్రం చెబుతున్నప్పటికీ.. దీని వెనుక లోతైన రాజకీయ కారణాలు దాగి ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న సాయంత్రం ఏదో చాలా తీవ్రమైన పరిణామం చోటుచేసుకుందని.. అది జగదీప్ ధన్ఖడ్ వంటి వ్యక్తిని ఇంత ఆకస్మికంగా పదవిని వీడేలా చేసిందని చెప్పారు. ముఖ్యంగా జులై 21వ తేదీన రాజ్యసభ అధ్యక్షతన జరిగిన వ్యాపార సలహా కమిటీ సమావేశానికి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు కావాలనే గైర్హాజరు అయ్యారని చెప్పుకొచ్చారు.


సోమవారం రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగిన మొదటి BAC సమావేశానికి కేంద్ర మంత్రులు ఇద్దరూ హాజరయ్యారని.. అయితే ధన్ఖడ్ పిలిచిన సాయంత్రం 4.30 గంటలకు జరిగిన సమావేశానికి జేపీ నడ్డా, కిరిణ్ రిజిజు గైర్హాజరయ్యారని జైరాం రమేష్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దీనిపై దన్ఖడ్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారని.. ఆపై ఈ సమావేశాన్ని మంగళవారం రోజు మధ్యాహ్నం 1 గంటలకు తిరిగి షెడ్యూల్ చేశారని చెప్పుకొచ్చారు. ఇదంతా నిశితంగా పరిశీలిస్తుంటే.. సోమవారం మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటలకు వరకు ఏదో తీవ్రమైన సంఘటనే జరిగిందని.. ఆ ఇద్దరు మంత్రులు గైర్హాజరు అవ్వడానికి కూడా ఇది కారణం అని వెల్లడించారు.


దన్ఖడ్ రాజీనామాను పూర్తిగా ఆరోగ్య కారణాలకు ఆపాదించడం పట్ల జైరాం రమేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి పదవి రాజ్యాంగ పరంగా అత్యున్నతమైనదని.. అలాంటి కీలక బాధ్యతలో ఉన్న వ్యక్తి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే రాజీనామా చేయడం సాధారణ విషయం కాదని అన్నారు. అనూహ్యంగా జరిగిన ఈ రాజీనామా వెనుక కంటికి కనిపించని మరెన్నో లోతైన కారణాలు దాగి ఉన్నాయని తాను బలంగా నమ్ముతున్నానని రమేష్ చెప్పారు. దన్ఖడ్ పదవీకాలం ప్రారంభం నుంచే ఆయన ప్రతిపక్షాలతో తరచుగా ఘర్షణ పడ్డారని.. రాజ్యసభలో ఆయన వ్యవహార శైలిపై అనేక విమర్శలు వచ్చాయని గుర్తు చేశారు.


ప్రభుత్వానికి ఆయన వ్యాఖ్యలు కొన్నిసార్లు ఇబ్బందికరంగా మారాయని కూడా వార్తలు వచ్చాయని ఆయన ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల మధ్య హఠాత్తుగా రాజీనామా చేయడం వ్యక్తిగత ఆరోగ్య సమస్యలకు మాత్రమే పరిమితం కాదని.. దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు లేదా అంతర్గత సంక్షోభం ఉండవచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ ఘటన భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు, రాజ్యాంగ సంస్థల స్వయం ప్రతిపత్తికి సంబంధించిన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోందని జైరాం రమేష్ చెప్పుకొచ్చారు. రాజీనామా వెనుక గల అసలు కారణాలను ప్రభుత్వం స్పష్టం చేయాలని.. ప్రజలకు నిజం తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa