శతాబ్దాల ఘనచరిత్ర కలిగిన ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధారామం పీఠాధిపతి రాసలీలలు కలకలం రేపుతున్నాయి. మార్షల్ ఆర్ట్స్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన చైనాలోని షావోలిన్ ఆలయానికి పీఠాధిపతిగా వ్యవహరిస్తోన్న షీ యోంగ్‌షిన్ నిధుల దుర్వినియోగం, అనేక మంది మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ పత్రిక సీఎన్ఎన్ ప్రకారం... 59 ఏళ్ల షీ యోంగ్‌షిన్‌పై పలు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. వాటిలో నిధుల దుర్వినియోగం, మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారన్న ఆరోపణలున్నాయని పేర్కొంది. కాగా, ఇటీవల థాయ్‌లాండ్‌లో బౌద్ధ సన్యాసుల హనీట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
హోనన్ ప్రావిన్సుల్లోని పర్వతాల నడుమ ఉండే షావోలిన్ బౌద్ధ క్షేత్రాన్ని వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేయడంతో ‘సీఈవో మాంక్’గా యోంగ్‌షిన్ గుర్తింపు పొందారు. అయితే, ఆయన గతంలో స్థానిక ప్రభుత్వం నుంచి లగ్జరీ కారును బహుమతిగా అందుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు చాలా మంది మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడమే కాదు... అక్రమంగా ఓ బిడ్డకు తండ్రి అయినట్టు గుర్తించారు. స్వచ్ఛందంగా బ్రహ్మచర్య దీక్ష తీసుకుని.. బౌద్ధ నియమాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆలయ అధికారిక సోషల్ మీడియాలో ఓ ప్రకటన వెలువరించింది. 2015లో వెలుగులోకి వచ్చిన పాత ఆరోపణలను మళ్లీ ప్రస్తావించారు.
పీఠాధిపతి షీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారని, మరిన్ని వివరాలు త్వరలో ప్రజలకు తెలియజేస్తామని అని పేర్కొంది. అయితే, ఈ ఆరోపణలపై షీ యోంగ్‌షిన్ ఇంకా స్పందించలేదు. అటు, చైనా బౌద్ధ సంఘం తీవ్రంగా స్పందించింది. బౌద్ధ పీఠాధిపతికి అధికారిక గుర్తింపుగా భావించే షీ యోంగ్‌షిన్‌కు ఇచ్చిన ఆర్డినేషన్ సర్టిఫికెట్‌ను రద్దు చేసింది. ‘‘షీ యోంగ్‌షిన్ చర్యలు అత్యంత హేయమైనవి.. ఇవి బౌద్ధ సమాజ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి, బౌద్ధ సంప్రదాయాల పట్ల ప్రజల నమ్మకాన్ని దిగజార్చాయి... ఈ వ్యవహారంపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్న నిర్ణయానికి చైనా బౌద్ధ సంఘం పూర్తిగా మద్దతిస్తోంది’’ ఓ ప్రకటనలో పేర్కొంది.
బౌద్ధ సన్యాసులు బ్రహ్మచర్యాన్ని పాటించి, నిరాడంబర జీవితం గడుపుతారు. అటువంటింది. ఆయన లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ.. లైంగిక సంబంధాలు పెట్టుకుని నియమాలను యోంగ్‌షిన్ తుంగలోతొక్కారు. అలాగే, ఆలయ నిధుల దుర్వినియోగం, వనరుల మళ్లింపులో షీ పాత్ర ఉందని నివేదికలు పేర్కొన్నాయి. ఆస్ట్రేలియాలో కొన్ని కోట్ల రూపాయలతో ఆలయం, ఓ లగ్జరీ హోటల్, కుంగ్ ఫూ అకాడమీ, గోల్ఫ్ కోర్స్ నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు.
మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన షీ యెంగ్‌షిన్.. షావోలిన్ ఆలయంలో 1981లో చేరారు. 1999లో షావోలిన్ బౌద్ధారామం పీఠాధిపతిగా నియమితులయ్యారు. ఆయన నాయకత్వంలో ఆలయం అంతర్జాతీయ స్థాయిలో విస్తరించింది. షావోలిన్ బ్రాండ్ పేరుతో కుంగ్‌ఫూ ప్రదర్శనలు, వీడియో గేమ్స్, ఉత్పత్తులు, ఇంకా రియల్టీ ప్రాజెక్టులు ప్రారంభించారు. అయితే, ఇది తీవ్ర విమర్శలకు గురయ్యింది. ఆధ్యాత్మికతను కాలుష్యం చేస్తోందని పలువురు ఆరోపించారు.
కాగా, స్థానిక ప్రభుత్వం 2015లో బహుమతిగా ఇచ్చిన లగ్జరీ కారును అందుకుని విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే, ఈ విమర్శలపై ఆయన స్పందిస్తూ.. ‘సన్యాసులు కూడా మనుషులే.. మేము సమాజానికి సేవ చేశాం.., కాబట్టి కానుక అందుకోవడం సహజమే’ అంటూ సమర్దించుకున్నారు. సాంగ్ పర్వతాల్లో ఉన్న షావోలిన్ బౌద్ధరామాన్ని క్రీ.శ 495లో స్థాపించారు. 1500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఆధ్యాత్మిక ప్రాముఖ్యంతోపాటు కుంగ్‌ఫూ కూ ప్రఖ్యాతి చెందింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అక్కడకు వెళ్లి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa