ట్రెండింగ్
Epaper    English    தமிழ்

4 ఏళ్లకు తప్పిపోయి 6 ఏళ్ల పాటు అక్కడే,,,,,,దట్టమైన అడవిలో కోతుల మధ్యే జీవనం

international |  Suryaa Desk  | Published : Mon, Jul 28, 2025, 09:41 PM

మనిషి కోతుల నుంచే మార్పు చెందాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా రామాయణ కాలంలో వానరసైన్యం ఉన్నారని వింటూనే ఉన్నాం. అప్పుడు మనుషులు, వానరులు కలిసి ఉండటం పురాణాలు చెబుతూ ఉన్నాయి. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు అది అసాధ్యం. ఎందుకంటే మనుషులు.. తమ తెలివితేటలతో ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకుని అందులో జీవిస్తున్నారు. కానీ కోతులు, ఇతర జంతువులు అన్నీ అడవుల్లో జీవిస్తూ.. అక్కడ దొరికే కాయలు, పళ్లు తిని జీవనం సాగిస్తున్నాయి. ఇదంతా ఇప్పుడెందుకు అని అనుకుంటున్నారు కదూ. ఇప్పుడు చెప్పబోయే మహిళ కథ వింటే.. మళ్లీ రామాయణ కాలం గుర్తొస్తుంది. ఎందుకంటే.. ఆ మహిళ తన చిన్నతనంలో ఉన్నపుడు.. కొన్నేళ్ల పాటు అడవిలో క్రూర మృగాల మధ్య నివాసం ఉంది. నాలుగేళ్ల పసి వయసులో అడవిలో తప్పిపోయిన ఆమె.. 6 ఏళ్ల పాటు అక్కడే కోతులతో జీవనం సాగించింది. చివరికి ఎలాగోలా 10 ఏళ్ల వయసులో అడవి నుంచి బయటికి వచ్చి.. జనజీవన స్రవంతిలో కలిసిపోయింది.


కొలంబియాకు చెందిన మరినా చాప్‌మన్ అనే మహిళ.. తన బాల్యంలో జరిగిన సంఘటనలను ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో.. ఆ విషయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. లోకం తెలియని పసితనంలో ఆమె ధైర్యం, పట్టుదల, ఏళ్ల పాటు మనుషులకు దూరంగా.. జంతువులు, చెట్లకు దగ్గరగా జీవించిన ఆమె.. తన స్టోరీని బయటపెట్టడంతో.. అది అందరినీ ఆకట్టుకుంటోంది. సమాజం నుంచి దూరంగా.. ఎక్కడో కొలంబియా అడవుల్లో.. ఆ మహిళ బాల్యమంతా గడిచిపోయింది. ఇటీవల ఆమె బ్రిటీష్ మీడియా సంస్థ UNILADకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన చిన్నతనం గురించిన విషయాలను వెల్లడించారు. ఇప్పుడు అవి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ సంఘటన 1950ల్లో జరగ్గా.. దశాబ్దాల తర్వాత బాహ్య ప్రపంచానికి తెలిసింది. ప్రస్తుతం ఆమె వయసు 74 ఏళ్లు.


అసలేం జరిగింది?


మరినా చాప్‌మన్ 4 ఏళ్ల వయసులో ఉన్నపుడు గుర్తు తెలియని వ్యక్తులు.. ఆమెను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అడవుల్లోకి తీసుకెళ్లి అక్కడే వదిలేశారు. వాళ్లు ఎవరో ఆమెకు తెలియదు.. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేంత వయసు ఆమెది కాదు.. ఎక్కడికి వెళ్లాలి అనేది గుర్తు లేదు. దీంతో ఆ చిన్నారి.. అడవిలోనే ఉండిపోయింది. మొదట చెట్లు, పక్షులు, జంతువులను చూసి.. భయం భయంగా ఉండేది. చీకటి పడితే చాలు.. చిమ్మ చీకటి.. పక్షులు, జంతువుల అరుపులు వినిపించేవి. ఇక ఆమెకు అడవిలో మొదట దొరికేవి కేవలం నీరు మాత్రమే. అవే నీరు తాగి.. కడుపు నింపుకునేది.


కోతులతో సావాసం


4 ఏళ్ల వయసులో ఆహారం, బతకడం తెలియని మరినా చాప్‌మన్‌కు అక్కడ కోతులే ఫ్రెండ్స్ అయ్యాయి. కోతులు తమ ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటాయి అనేది చూసి.. వాటి సాయంతో అడవిలో బతకడం నేర్చుకుంది. వాటితోపాటు ఆహారానికి వెళ్లడం.. అవి ఏం తింటే అవి తినడం అలవాటు చేసుకుంది. 4 ఏళ్ల వయసు నుంచి 10 ఏళ్ల వయసు వరకు.. ఆమె తన జీవితంలో 6 సంవత్సరాల పాటు కోతులతోనే జీవించి.. వాటిని అనుసరిస్తూ బతికినట్లు తన ఇంటర్వ్యూలో వివరించారు.


ప్రాణభయంతో అడవిలో ఒంటరిగా ఉన్న మరినా చాప్‌మన్‌ను.. ఒక కోతుల గుంపు ఎప్పుడూ గమనిస్తూ ఉండేది. దీంతో రోజులు గడుస్తున్న కొద్దీ.. ఆ కోతులే ఆమెకు అడవిలో బతికేందుకు సహాయపడ్డాయి. తాను ఆ అడవిలో బతకాలంటే కోతులు ఏం చేస్తున్నాయో అది చేయడమే సరైందని తనకు అర్థమైనట్లు చెప్పింది. ఆ కారడవిలో నీరు, ఆహారం ఎక్కడ దొరుకుతుందో తెలియక.. కోతులు ఎటు వెళ్తే అటే వెళ్లి.. ఆహారాన్ని సంపాదించుకునేదని పేర్కొంది. అప్పుడు తనకు ఆహారాన్ని అందించడంతో ఒక కోతి చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంది. రాత్రిపూట ఆ కోతి మెల్లగా వెళ్లి.. పండ్లు దొంగిలించి తనకు తీసుకువచ్చిన సంఘటనను వివరించింది. అలాంటి ఆహారాన్ని వేగంగా తీసుకోవాల్సి వచ్చేదని.. లేకపోతే అవి మళ్లీ లాగేసుకునేవని మరినా చాప్‌మన్ తెలిపింది. అందుకే తాను చాలా వేగంగా తినడం అలవాటు చేసుకున్నట్లు వెల్లడించింది.


అడవికి అలవాటుపడిన మరినా చాప్‌మన్


క్రమక్రమంగా మరినా చాప్‌మన్ అటవీ జీవితానికి అలవాటు పడింది. ఈ సందర్భంగా తన బాల్యం గురించి గుర్తు చేసుకున్న ఆమె.. అడవిలో జీవించడం అంటే అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మరినా చాప్‌మన్‌కు మనుషులతో ఎలాంటి సంబంధాలు లేకపోవడంతో.. ఆమె కోతులు చేసే రకరకాల శబ్దాలు అర్థం చేసుకోవడం ప్రారంభించింది. అందులో చాలా శబ్దాలు ఆహారం, ప్రమాదం, కదలికలకు సంబంధించి ఉన్నాయని పేర్కొంది. కోతులు చేసే శబ్దాలను గుర్తించి తాను నేర్చుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. పెద్దగా అరిస్తే.. జాగ్రత్తగా ఉండి, దాక్కోవాలని అర్థం. ఆహారం దొరికితే ఈల శబ్దం చేస్తాయి. వాటితో కలిసిపోవడం వల్లే అడవిలో అన్ని సంవత్సరాలు క్షేమంగా ఉన్నట్లు తెలిపింది.


బయటికి వచ్చినా తప్పని తిప్పలు


ఎట్టకేలకు మరినా చాప్‌మన్‌కు 10 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత.. అడవిలో వేటకు వెళ్లిన వేటగాళ్ల కంటికి చిక్కింది. దీంతో వాళ్లు ఆమెను అడవి నుంచి బయటికి తీసుకువచ్చారు. ఆ తర్వాతే ఆమెకు మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. ఆమె ఒంటరి బాలిక అని తెలుసుకున్న వేటగాళ్లు.. ఒక వ్యభిచార గృహానికి మరినా చాప్‌మన్‌ను అమ్మేశారు. 6 ఏళ్ల పాటు అడవి కష్టాలను దాటుకుని.. జనంలోకి వస్తే.. కొత్త రకం కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇక ఆ వ్యభిచార గృహం నుంచి తప్పించుకున్న ఆమె.. కొలంబియా వీధుల్లో కొన్నేళ్లపాటు జీవించింది. ఆ తర్వాత అనేక ఇబ్బందులు, ఎదురుదెబ్బలు తట్టుకుని.. చివరికి ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది.


ఇంగ్లండ్‌లో పెళ్లి


ఎట్టకేలకు వ్యభిచార గృహం నుంచి బయటపడి.. కొలంబియా వీధుల్లో జీవనం సాగించిన తర్వాత.. చివరికి మరినాకు ఒక ఇంట్లో పనిమనిషిగా ఉద్యోగం లభించింది. అదే ఆమె జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. ఆ కుటుంబంతో కలిసి ఆమె కొలంబియా నుంచి బ్రిటన్‌కు వెళ్లింది. ఇంగ్లాండ్‌లోని బ్రాడ్‌ఫోర్డ్‌లో అడుగుపెట్టిన తర్వాత.. మరినాకు ఇంగ్లీష్ నేర్చుకోవడం, బ్రిటిష్ నియమాలు అర్థం చేసుకోవడం వంటి సరికొత్త సవాళ్లు ఎదురయ్యాయి. బ్రాడ్‌ఫోర్డ్‌లోని స్థానిక చర్చిలో ఆర్గనిస్ట్ అయిన జాన్ చాప్‌మన్‌ను మరినా కలుసుకున్నారు. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి.. చివరికి పెళ్లి చేసుకున్నారు. వారికి వెనెస్సా, జొవాన్నా అనే ఇద్దరు కుమార్తెలు జన్మించారు. బాల్యం మొత్తం అడవుల్లో గడిచినప్పటికీ.. ఆ తర్వాత మరినాకు భర్త, ఇద్దరు పిల్లలతో ఒక కుటుంబం ఏర్పడింది.


పుస్తకంతో ప్రపంచానికి పరిచయం


ఇక 2013లో మరినా కథ ఒక పుస్తకంగా విడుదలైంది. "ది గర్ల్ విత్ నో నేమ్" అనే పుస్తకాన్ని మరినా తన కుమార్తెతో కలిసి రాసింది. అయితే మరినా కథపై అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తం అయినప్పటికీ.. ఆమె కుటుంబం మాత్రం అండగా నిలబడింది. ఇక మరినా రక్తంలో అడవి వ్యాధులు ఉన్నాయని మెడికల్ టెస్టుల్లో తేలిందని.. అదే ఆమె బాల్యం అడవిలో గడిచిందని చెప్పడానికి నిదర్శనమని వారు వాదించారు. అయితే మరినా చాప్‌మన్‌ కథ కేవలం స్ఫూర్తినిచ్చేది మాత్రమే కాకుండా ఒక అమ్మాయి ధైర్యం, ఆత్మవిశ్వాసం, మానసిక బలాన్ని అందరికీ తెలియజేస్తుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలనైనా, చిన్న వయసులోనైనా ఎదుర్కొని జీవించగలమని మరినా జీవితం.. అందరికీ ఒక పాఠంలా నిలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa