అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు పట్టుకుంటుందనేది సామెత.. అభివృద్ధి చెందిన దేశంగా, అగ్రరాజ్యంగా అమెరికా తీసుకునే ఏ నిర్ణయమైనా ప్రపంచ దేశాల మీద అంతో ఇంతో ప్రభావం చూపించకమానదు. అలాంటిది భారతదేశం మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 25 శాతం సుంకాలు విధించారు. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి భారత్‌పై 25 శాతం సుంకాలు అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రకటించారు. అమెరికా భారతదేశంపై 25 శాతం సుంకాలు విధించినన నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైనా ఆ ప్రభావం పడనుంది. అమెరికా తీసుకున్న నిర్ణయం భారతదేశ ఎగుమతులపై ప్రభావం చూపించనుంది. భారతదేశంలోని ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, అగ్రికల్చర్, ఎలక్ట్రానిక్స్, స్టీల్ అండ్ మెషినరీ రంగాలపై ఈ ప్రభావం పడనుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఏపీ ఆక్వారంగం మీద ట్రంప్ నిర్ణయం పెనుభారమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు రొయ్యలు, సీఫుడ్ ఎక్కువగా ఎగుమతి అవుతూ ఉంటాయి. మనదేశం నుంచి అమెరికాకు సీఫుడ్స్, రొయ్యలు అత్యధిక మొత్తంలో ఎగుమతి చేసే రాష్ట్రాలలో ఏపీ మొదటిది. అయితే సముద్ర ఆహార ఉత్పత్తులపై అమెరికా 27 శాతం సుంకం విధించనుంది. దీనికి కౌంటర్ వెయిలింగ్, యాంటీ డంపింగ్ డ్యూటీలు అదనమని.. మొత్తంగా భారత్ నుంచి ఎగుమతి అయ్యే రొయ్యలపై 34 శాతం వరకూ పన్ను తప్పదని విశ్లేషకులు చెప్తున్నారు. ఫలితంగా ఏపీలోని రొయ్యల ఎగుమతిదారులకు ఆర్థిక భారం కానుంది.
ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వారంగం మీద ఆధారపడి ఉన్న దాదాపు 8 లక్షల మంది రైతులు, అనుబంధ రంగాల కార్మికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. 2023-24లో ఆంధ్రప్రదేశ్ నుంచి 2.37 బిలియన్ డాలర్ల విలువైన 347,927 టన్నుల సీఫుడ్ ఎగుమతి జరిగింది. ఇందులో రొయ్యల వాటానే 76 శాతంగా ఉందంటే.. ఏపీ నుంచి ఏ స్థాయిలో అమెరికాకు రొయ్యల ఎగుమతులు సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా రొయ్యల ఎగుమతిదారులు నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే అమెరికాకు ఎగుమతి చేయటం కోసం కోల్డ్ స్టోరేజీలలో ఉంచిన రొయ్యలు, సీఫుడ్స్ నిల్వలు పేరుకుపోయే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో రొయ్యల సేకరణ నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా రొయ్యల ధరలు పతనమై.. ఆక్వారైతులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆక్వాకల్చర్ మీద ఆధారపడి ఉండే కోల్డ్ స్టోరేజీ, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్ రంగాలలో డిమాండ్ తగ్గి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.
మరోవైపు వియత్నాం, థాయిలాండ్, జపాన్ దేశాలు భారతదేశం నుంచి సీఫుడ్ కొనుగోలు చేసి.. వాటిని ప్రాసెసింగ్ చేసి అమెరికాకు ఎగుమతి చేస్తుంటాయి. ట్రంప్ నిర్ణయంతో ఆయా దేశాల నుంచి ఆక్వాకల్చర్ సాగుచేసేవారికి ఆర్డర్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇది ఏపీలోని రొయ్యల ఎగుమతుదారులను మరింత ఇబ్బందిపెట్టే అవకాశాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల పెంపు నిర్ణయంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని సుమారు 5 లక్షల మంది ఆక్వా రైతులు జీవనోపాధికి ఇబ్బందులు తలెత్తనున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల విధింపు నిర్ణయం ఏపీలోని ఆక్వా రైతులకు శాపంగా మారకూడదంటే ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవాల్సి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆక్వా రైతులకు ప్రభుత్వం మద్దతుగా నిలవడంతో పాటుగా రాయితీలు ఇవ్వాలంటున్నారు. ఆక్వా రైతుల వ్యయం తగ్గించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే యూనిట్ రూ. 1.50 చొప్పున విద్యుత్ రాయితీని అందిస్తోంది.
ఆక్వా రైతులు, వ్యాపారులు, దాణా సరఫరాదారులు, ఎగుమతిదారులు, అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అమెరికా మీదే ఎక్కువగా ఆధారపడకుండా ఇతర దేశాలకు కూడా రొయ్యలు, సముద్ర ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి సరైన ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది. సుంకాల మినహాయింపు, తగ్గింపుపై అమెరికాతో దౌత్యపరమైన చర్చలు జరిపేలా కేంద్రాన్ని కోరవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa