ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనా రెండో ప్రపంచ యుద్ధ విక్టరీ పరేడ్ వేడుకలకు మోదీ దూరం

national |  Suryaa Desk  | Published : Tue, Aug 05, 2025, 05:25 PM

వచ్చే నెల అనగా.. సెప్టెంబర్ ప్రారంభంలో డ్రాగన్ కంట్రీ.. బీజింగ్‌లో జరగనున్న రెండో ప్రపంచ యుద్ధ విజయోత్సవ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. దీనిపై అనేక వాదనలు వినిపిస్తున్నప్పటికీ.. మోదీ ఈ వేడుకలకు హాజరు కావడం దాదాపు అసంభవం అని తెలుస్తోంది. ప్రస్తుతం ఇరు దేశాల మద్య ద్వైపాక్షిక సంబంధాలు తాత్కాలికంగా మెరుగుపడినప్పటికీ.. ఇంకా పరిష్కారం కానీ అనేక దౌత్యపరమైన, వ్యూహాత్మక అంశాలు.. ఈ సమావేశానికి మోదీ హాజరుకు అడ్డంకిగా నిలుస్తాయంటున్నారు. ఆ వివరాలు..


ఉద్రికత్తలు తగ్గినా..


ప్రస్తుతం భారత్, చైనా ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టినట్లుగానే ఉన్నాయి. ఇందుకు నిదర్శనంగా.. ఇటీవలి నెలల్లో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లు చైనాలో పర్యటించారు. ఈక్రమంలో డ్రాగన్ కంట్రీ టిబెట్‌కు తీర్థయాత్రలను తిరిగి అనుమతించింది. అలానే ఇండియా చైనా పౌరులకు వీసా సేవలను పునరుద్ధరించడం వంటివి.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గినట్లుగా చూపిస్తున్నాయి. అయినా సరే.. మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొంటే.. రాజకీయంగా, దౌత్యపరంగా విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుంది అంటున్నారు. ఒకవేళ మోదీ చైనా వెళ్తే.. ప్రస్తుత పరిస్థితులకు మద్దతివ్వని.. తీవ్రమైన దౌత్యపరమైన మార్పుకు ఈ సమావేశం వేదిక కాబోతుందని అంటున్నారు.


వాణిజ్యపరమైన అంశాలు..


ఇరు ఆసియా దిగ్గజ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గత ఏడాది 127 బిలియన్ డాలర్లను అధిగమించింది. అయినప్పటికీ ఇరు దేశాల మధ్య.. ఆర్థిక సంబంధాలు ఇప్పటికి కూడా అసమానంగా, తరచుగా వివాదాస్పదంగానే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా రేర్ ఎర్త్ మాగ్నెట్లు (అరుదైన భూ అయస్కాంతాలు), ఎరువులు వంటి కీలక ఉత్పత్తులపై ఎగుమతి నియంత్రణ మొదలు.. భారతీయ పరిశ్రమలను దెబ్బతీసే ట్రాన్స్-షిప్‌మెంట్ డంపింగ్ పద్ధతుల వరకు.. చైనా తీరును ఇండియా ఏమాత్రం అంగీకరించడ లేదు. దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది.


మరీ ముఖ్యంగా, రేర్ ఎర్త్ ఎగుమతులపై చైనా విధించిన ఆంక్షలు.. భారతీయ తయారీ రంగాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. భారత్‌లోని ఆటోమొబైల్స్, స్వచ్ఛమైన ఇంధన సాంకేతికతలకు చెందిన పరిశ్రమలు.. ఈ పదార్థాలపై ఎక్కువగా ఆధారపడతాయి. అలాంటిది.. చైనా వీటి మీద ఆంక్షలు విధించిడం భారత్‌ను ఇబ్బందులకు గురి చేయడానికే అనే వాదన కూడా వినిపిస్తోంది. ఇరు దేశాల మధ్య ఇలాంటి పరిష్కారం కాని సమస్యలు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మోదీ ఈకార్యక్రమానికి దూరంగా ఉంటారని సమాచారం.


చైనా సెప్టెంబర్ నెలలో బీజింగ్‌లో నిర్వహించే రెండో ప్రపంచ యుద్ధ విజయోత్సవ వేడుక కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.. జపాన్‌పై తమ విజయాన్ని స్మరించుకోవడానికి నిర్వహించే వేడుక. దౌత్యపరంగా ఇది చాలా సున్నితమైన అంశం. జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాతో కలిసి క్వాడ్ భాగస్వామిగా ఉన్న భారత్.. చైనా విక్టరీ పరేడ్‌కు హాజరు కావడం అంటే.. డ్రాగన్ దేశాన్ని చారిత్రకంగానే కాక.. వ్యూహాత్మకంగా కూడా సమర్థించినట్లే అన్న అభిప్రాయం ప్రపంచం దృష్టికి వెళ్తుంది.


ఇదిలా ఉంచితే.. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో, చైనా-తయారీ జే-10సీ యుద్ధ విమానాలను పాక్‌కు సరఫరా చేసి.. మన దాయాది దేశానికి క్రియాశీల సహాయం అందించడం.. సైనిక ఘర్షణలలో డ్రాగన్ భాగస్వామ్యంపై అనేక అనుమానాలను పెంచింది. ఇది దౌత్యపరంగా, సైనికంగా కూడా భారతదేశ విధానానికి ఏ విధంగానూ సరిపోదు అంటున్నారు.


దేశీయ ప్రయోజనాలే ముఖ్యం..


మోదీకి చైనా విక్టరీ పరేడ్ కన్నా దేశీయ ప్రయోజనాలే ముఖ్యం. డొనాల్డ్ ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దౌత్య పరిస్థితుల్లో తీవ్ర అనిశ్చితి నెలకొని ఉంది. భారత్, పాక్ పట్ల ట్రంప్ వైఖరి.. ప్రపంచం ముందు మనల్ని బలహీనపరిచేలా ఉంది. పైగా ఈ పరేడ్ వేడుకలకు రష్యా, పాకిస్తాన్ నాయకులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో మోదీ విదేశాంగ విధానం.. ప్రధాన మిత్ర పక్షాలతో సంబంధాలను సమతుల్యం చేసుకుంటూ.. అవసరమైన చోట భాగస్వామ్యాలను ఉపయోగించుకుంటూ సంప్రదాయ తటస్థ వైఖరిని కొనసాగిస్తూ వస్తోంది. ఈ తరుణంలో ఇండియా గనక చైనా విక్టరీ పరేడ్‌కు హాజరైతే.. ఇది క్వాడ్‌తో భారత్‌కున్న సంబంధాలు, పశ్చిమ దేశాలతో ఆర్థిక చర్చలపై ప్రభావం చూపే అవకాశం అధికంగా ఉంది.


వ్యూహాత్మక దూరం..


మోదీ సెప్టెంబర్‌లో చైనాలో నిర్వహిచే విక్టరీ పరేడ్‌కు హాజరు కావడం కన్నా.. ఈ నెలాఖరున అనగా ఆగస్టు చివర్లో టియాంజిన్‌లో జరగనున్న ఎస్‌సీఓ సదస్సుకు హాజరైతే.. దౌత్యపరమైన చర్చలకు మరింత ఆమోదయోగ్యమైన వేదిక లభించినట్లు అవుతుంది అంటున్నారు. అయితే మోదీ చైనా విక్టరీ పరేడ్‌లో పాల్గొంటారా.. లేదా అన్నది పూర్తిగా వేరే విషయం. మోదీ గనక ఈ విక్టరీ పరేడ్‌కు హాజరైతే.. భారత్ వ్యూహాత్మక ఉద్దేశ్యం తప్పుగా అన్వయించబడే ప్రమాదం ఉంది. అలానే జపాన్, అమెరికా వంటి కీలక భాగస్వాములతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది అంటున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మోదీ చైనా విక్టరీ పరేడ్‌కు హాజరయ్యే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. కానీ దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa