భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ మరో కీలక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సామర్థ్యం గల అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి సాయంత్రం 7:30 గంటల సమయంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించి తన సత్తాను చాటింది.సుమారు 5,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగల సామర్థ్యం అగ్ని-5 సొంతం. ఈ ప్రయోగ సమయంలో క్షిపణి పనితీరు, వేగం, ట్రాకింగ్ వ్యవస్థలు వంటి అన్ని సాంకేతిక అంశాలను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పర్యవేక్షించారు. అనుకున్న విధంగానే క్షిపణి అన్ని ప్రమాణాలను విజయవంతంగా అందుకుందని అధికారులు ధ్రువీకరించారు. డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు, సైనిక ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ పరీక్ష సజావుగా సాగింది.భారత రక్షణ వ్యవస్థలో అగ్ని-5 క్షిపణి అత్యంత కీలకమైనదిగా పరిగణిస్తారు. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అయిన ఇది, అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యంతో దేశ రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. ఈ విజయవంతమైన పరీక్షతో రక్షణ సాంకేతికతలో స్వావలంబన దిశగా భారత్ మరో బలమైన అడుగు వేసినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజా విజయంపై డీఆర్‌డీఓ శాస్త్రవేత్తల బృందాన్ని పలువురు ఉన్నతాధికారులు అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa